Akshaya Tritiya: సామాన్యులను ధనవంతులు చేసిన అక్షయతృతీయ, ఈసారి హిస్టరీ రిపీట్ అవ్వుద్దా?
Gold News: గడచిన దశాబ్దకాలంలో అక్షయతృతీయకు ఇన్వెస్టర్లు కొన్న పసిడి వారికి నిజంగా కనకవర్షం కురిపించింది. రెండు మూడు సంవత్సరాలు మినహా ప్రతి ఏటా గోల్డ్ ధరలు పెరుగుతూ వారికి సూపర్ లాభాలను అందించాయి.
Akshaya Tritiya: మరో రెండు రోజుల్లో అక్షయతృతీయ వచ్చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోని పెద్ద విక్రయదారులు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల రెండు నెలలుగా పెరిగిన పసిడి ధరలతో కొనుగోళ్లు సన్నగిల్లటంతో చాలా వ్యాపారులు పసిడి ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు కొనుగోలుదారుల రద్దీతో కళకళలాడిన షాపులు ప్రస్తుతం చాలా చోట్ల కళతప్పాయి. పెరిగిన రేట్లు సామాన్యుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ ప్రజలు చూడని స్థాయిలకు చేరుకోవటం అటు షాపుల యజమానులను, ఇటు పసిడి ప్రియులను ఈసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రపంచంలో ఏమూలన ఉన్నా భారతీయులు తప్పకుండా జరుపుకునే పండుగల్లో అక్షయతృతీయ ప్రధానమైనది. విదేశాల్లో స్థిరపడినప్పటికీ అక్కడ స్థానికంగా బంగారాన్ని ప్రజలు కొంటుంటారు. ఎందుకంటే.. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఈ రోజున చాలా మంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు లేదా బంగారం కొనుగోలు చేస్తారు. "అక్షయ" అంటే శాశ్వతమైనది లేదా నాశనం చేయలేనిదని అర్థం. అందువల్ల ఈ రోజున చేసే కొనుగోళ్లు లేదా పెట్టుబడులు నిలిచి ఉంటాయని భారతీయుల నమ్మకం. గత గణాంకాలను పరిశీలిస్తే ప్రజలు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన బంగారం అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయని వెల్లడైంది.
గతేడాది ఏప్రిల్ 21న అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసిన వారికి అద్భుతమైన రాబడి వచ్చిందని కేడియా కమోడిటీస్ ప్రెసిడెంట్ అజయ్ కేడియా తెలిపారు. ఏప్రిల్ 21, 2023న 10 గ్రాముల బంగారం ధర రూ.59,845 వద్ద ఉంది. ప్రస్తుతం రేట్లతో పోల్చితే దాదాపు ఇన్వెస్టర్లు రూ.14,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. గత 12 ఏళ్ల బులియన్ మార్కెట్ల డేటాను పరిశీలిస్తే.. 2011 నుంచి 2012 అక్షయతృతీయల మధ్య బంగారం ధర ఏడాదిలో 10 గ్రాములకు 33 శాతం అంటే రూ.7,184 పెరిగి రూ.29,030 స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత ఏడాది 2013 నాటి గోల్డ్ ధర కేవలం 2.88 శాతం మాత్రమే పెరిగింది. 2018- 2019 సంవత్సరాల్లో కూడా అక్షయతృతీయకు పసిడి కొనుగోలు చేసిన వారికి రాబడులు సానుకూలంగా ఉన్నాయి.
6 మే 2019 అక్షయతృతీయ రోజున కొనుగోలు చేసిన బంగారం ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.31,383 వద్ద ముగిసింది. తర్వాతి సంవత్సరం అంటే ఏప్రిల్ 24, 2020న అక్షయ తృతీయ రోజు నాటికి గోల్డ్ ధర 47.41 శాతం పెరిగి రూ.46,527 రేటుకు చేరుకుంది. ప్రతి పది గ్రాములపై దాదాపు రూ.15,000 రాబడిని ప్రజలు అందుకున్నారు. దీని తర్వాతి నుంచి గోల్డ్ నిరంతరం తన పెట్టుబడిదారులకు సానుకూల రాబడులను అందిస్తూనే ఉంది. గోల్డ్ 2021లో 2.47 శాతం, 2022లో 6.57 శాతం, 2023లో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2024లో మాత్రం పసిడి ధరలు మెగా ర్యాలీతో పెట్టుబడిదారులను ఖుషీ చేస్తున్నప్పటికీ.. కొనుగోలుదారులను మాత్రం షాక్ కి గురిచేస్తోంది. ఈ ఏడాది 5 నెలల కాలంలో ఇప్పటి వరకు 20 శాతానికి పైగా ర్యాలీతో గొప్ప రాబడులను గోల్డ్ అందించింది. కానీ.. 2014లో 3.33 శాతం, 2015లో 6.11 శాతం, 2017లో దాదాపు 5 శాతం నష్టాలను పసిడి పెట్టుబడిదారులకు అందుకున్నారు.