Kaynes Technology India IPO: కేన్స్ టెక్నాలజీ షేర్లు సూపర్ హిట్, 32% ప్రీమియంతో లిస్టింగ్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) ఈ స్క్రిప్ ఒక్కొక్కటి రూ.778 వద్ద లిస్ట్ అయింది. తద్వారా, ఆఫర్ ప్రైస్ కంటే 32.54 శాతం లాభాన్ని నమోదు చేసింది.
Kaynes Technology India IPO: IoT పరికరాల ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ కేన్స్ టెక్నాలజీ ఇండియా షేర్లు మంగళవారం (22 నవంబర్ 2022) నాటి మార్కెట్‌లో అదరగొట్టాయి. రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE, NSE), IPO ఇష్యూ ధర కంటే 32 శాతం ప్రీమియంతో బలంగా లిస్ట్ అయ్యాయి.
కేన్స్ టెక్నాలజీ ఇండియా ఇష్యూ ప్రైస్ రూ.587. ఇవాళ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) ఈ స్క్రిప్ ఒక్కొక్కటి రూ.778 వద్ద లిస్ట్ అయింది. తద్వారా, ఆఫర్ ప్రైస్ కంటే 32.54 శాతం లాభాన్ని నమోదు చేసింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE) ఇది రూ. 775 వద్ద ప్రారంభమైంది. ఇక్కడ కూడా 32.03 శాతం పెరిగింది.
లిస్టింగ్ గెయిన్స్
మొదటి 30 నిమిషాల ట్రేడింగ్‌లో, ఈ కౌంటర్‌లో భారీ కొనుగోళ్లు కనిపించాయి. లిస్టింగ్ ప్రైస్ ప్రైస్ నుంచి ఈ స్టాక్ ధర మరింత పెరిగింది. BSEలో రూ.787, NSEలో రూ.786 గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ స్థాయిలో లాభాల స్వీకరణ మొదలు కాగానే కొద్దిగా దిగి వచ్చింది. మొత్తంగా చూస్తే, లిస్టింగ్ డే గెయిన్స్ కోసం ఈ IPOను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఈ స్క్రిప్ ఆనందాన్ని మిగిల్చింది. నిరాశ పరచకుండా లాభాలను అందించింది.
ఉదయం 10:30 గంటల సమయానికి, ఈ స్క్రిప్ BSEలో రూ.677.50 వద్ద ట్రేడవుతోంది. ఇష్యూ ధర కంటే ఇది 15.42 శాతం పెరుగుదల. NSEలో రూ.685.10 వద్ద ఉంది. ఇష్యూ ధర కంటే ఇది 16.71 శాతం లాభం.
కేన్స్ టెక్నాలజీ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,935.37 కోట్లని BSE డేటా చూపిస్తోంది.
కేన్స్ టెక్నాలజీ ఇండియా IPO వివరాలు
కేన్స్ టెక్నాలజీ IPO 2022 నవంబర్ 10న ప్రారంభమై, 14వ తేదీ వరకు కొనసాగింది. ప్రైస్ బ్యాండ్ రూ.559-587.
పెట్టుబడిదారుల నుంచి ఈ ఇష్యూకి మంచి స్పందన వచ్చింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోటా 98.47 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటా 21.21 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 4.09 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తంగా చూస్తే.. ఈ IPO 34.16 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కేన్స్ టెక్నాలజీ రూ.257 కోట్లు సమీకరించింది. ప్రైస్ బ్యాండ్ అప్పర్ లిమిట్ అయిన రూ.587 ధరతో యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు మొత్తం 43.76 లక్షల షేర్లను ఈ కంపెనీ కేటాయించారు. యాంకర్ ఇన్వెస్టర్లలో... నోమురా, గోల్డ్‌మన్ సాక్స్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా, టాటా మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, వైట్‌వోక్ క్యాపిటల్ ఉన్నాయి.
IPO ద్వారా కంపెనీ సేకరించిన డబ్బును రుణాల చెల్లింపునకు, మైసూర్ & మన్సీర్‌లో ఉత్పత్తి కేంద్రాల కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ ఖర్చు చేస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.