ITR 2024: హుషారుగా ఉన్న టాక్స్‌పేయర్లు, 4 రోజుల్లో వేల సంఖ్యలో రిటర్న్‌లు
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు సహజ్ ఫారం (ITR-1) ద్వారా రిటర్న్ ఫైల్ చేయవచ్చు.
Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను పత్రాలను సమర్పించే సీజన్ ప్రారంభమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి, టాక్స్‌పేయర్లు (Taxpayers) ఈ నెల నుంచి (01 ఏప్రిల్ 2014) ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 01 నుంచి 04వ తేదీ వరకు, ఈ నాలుగు రోజుల్లోనే వేల సంఖ్యలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయి.
23,000 రిటర్న్‌లు దాఖలు
2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సమర్పణ కోసం సంబంధిత ఫారాలను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, గత నాలుగు రోజుల్లో దాదాపు 23,000 రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయ పన్ను విభాగం ప్రకటించింది.
ఇటీవలి సంవత్సరాల్లో మొదటిసారిగా, కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే ఆదాయ పన్ను పత్రాల సమర్పణకు ఆదాయ పన్ను విభాగం అనుమతి ఇచ్చింది. ఆదాయ పన్ను చెల్లింపులను వేగవంతం చేయడానికి, టాక్స్ పేయర్లకు అందించే సేవల్లో సౌలభ్యం కోసం ఈ ముందడుగు వేసింది.
ఎక్కువ మంది ఉపయోగించే ఫారాలు
ఆదాయ పన్ను పత్రాల్లో ITR ఫామ్ 1 (సహజ్), ITR ఫామ్ 4 (సుగమ్) చాలా పాపులర్. పెద్ద సంఖ్యలో చిన్న & మధ్య స్థాయి పన్ను చెల్లింపుదార్లు వీటిని ఉపయోగిస్తారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుంచి ఆదాయం ఉన్న వ్యక్తులు ITR-2 ఫారాన్ని దాఖలు చేస్తారు.
పన్ను చెల్లింపుదార్లు ఎక్కువగా ఉపయోగించే ఫారాలు ITR-1, ITR-2, ITR-4 ఈ నెల ప్రారంభం నుంచి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని CBDT (Central Board of Direct Taxes) తెలిపింది. ఏప్రిల్ 01 నుంచి, కార్పొరేట్ కంపెనీలు తమ పన్ను బాధ్యతను ITR-6 ద్వారా ఫైల్ చేయవచ్చని వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: డబ్బు చరిత్ర ఏమిటి? కరెన్సీ ఏ విధంగా పరిణామం చెందిందో తెలుసుకోండి?
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు సహజ్ ఫారం (ITR-1) ద్వారా రిటర్న్ ఫైల్ చేయవచ్చు. జీతం, ఒక ఇంటి ఆస్తి, వడ్డీ వంటి ఇతర ఆదాయ వనరులు, రూ. 5,000 మించని వ్యవసాయ ఆదాయం వంటివి ఇందులోకి వస్తాయి.
వ్యాపారం, వృత్తి ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్న వ్యక్తులు, హిందు అవిభక్త కుటుంబాలు (HUFs), సంస్థలు (LLP మినహా) సుగమ్ (ITR-4) ఫారాన్ని దాఖలు చేయవచ్చు.
CBDT ఇప్పటికే ఈ ITR ఫారాలను నోటిఫై చేసింది. ITR-3, ITR-5, ITR-7 ఫారాలను ఫైల్ చేసే సదుపాయాన్ని కూడా త్వరలోనే పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులోకి తీసుకువస్తాని CBDT తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: క్యాష్, F&Oలో మరో 4 కొత్త సూచీలు - అతి త్వరలో ప్రారంభం