(Source: Matrize)
Sanjiv Puri's Salary: ఐటీసీ ఎండీ సంజీవ్ పూరి రికార్డ్! వేతనం 30% జంప్ - రూ.16.31 కోట్లు!
Sanjiv Puri's Salary: ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి (Sanjiv Puri) జాక్‌పాట్ కొట్టేశారు. 2023 ఆర్థిక ఏడాదిలో ఆయన ఏకంగా రూ.16.31 కోట్లు వేతనంగా అందుకున్నారు.
Sanjiv Puri's Salary:
ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి (Sanjiv Puri) జాక్‌పాట్ కొట్టేశారు. 2023 ఆర్థిక ఏడాదిలో ఆయన ఏకంగా రూ.16.31 కోట్లు వేతనంగా అందుకున్నారు. అంతకు ముందు ఏడాది తీసుకున్న రూ.12.59 కోట్లతో పోలిస్తే ఇది 29.5 శాతం పెరుగుదల కావడం విశేషం.
సంజీవ్ పూరీ మూల వేతనం రూ.2.88 కోట్లు కాగా పెర్ఫామెన్స్ బోనస్, కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నారు. ఇక పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ.57.38 లక్షలని ఐటీసీ వార్షిక నివేదిక 2023 ద్వారా తెలిసింది. మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన పదవీ కాలం 2023, జులై 21తో ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 112వ సాధారణ వార్షిక సమావేశంలో దీనిని తీర్మానించనున్నారు.
ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరలు పెరుగుదలతో గతేడాది ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అధినేతలు తమ వేతనాలను తగ్గించుకున్నారు. ఇందుకు విరుద్ధంగా సంజీవ్ పూరి పారితోషికం భారీగా పెరగడం విశేషమే. నెస్లే ఇండియా ఛైర్మన్, ఎండీ సురేశ్ నారాయణన్ 2022లో తన వేతనంలో 6 శాతం కోత విధించుకున్నారు. దాంతో అంతకు ముందు రూ.18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ.17.7 కోట్లకు తగ్గింది.
హిందుస్థాన్ యునీలివర్ మాజీ సీఈవో సంజీవ్ మెహతా 2023 ఆర్థిక ఏడాదిలో kp.22.36 కోట్ల వరకు అందుకున్నారు. 2022తో పోలిస్తే ఆయన వేతనంలో ఎలాంటి మార్పు లేదు. అయితే 2021లో ఆయన వేతనం రూ.15 కోట్లు ఉండగా 2022లో రూ.22.07 కోట్లకు పెరిగింది. జూన్‌లో ఆయన పదవీ విరమణ పొందారు.
ప్రస్తుతం ఐటీసీలో (ITC) డీమెర్జర్ చర్చలు కొనసాగుతున్నాయి. హోటల్ బిజినెస్‌ను విడదీయాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు జులై 7న కంపెనీ హోటల్ వ్యాపారానికి సంబంధించి 'అసెట్ - రైట్' వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపింది. మొత్తం సంస్థలో 50 శాతం రూమ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కాంట్రాక్టుల ద్వారానే లభిస్తోంది. మిగిలినవి సొంత హోటళ్ల నుంచి వస్తోంది. కాగా ఐటీసీ మొత్తం ఆదాయంలో హోటల్ నుంచి 5 శాతమే వస్తోంది. దాంతో యాజమాన్యం దీనిని మరింత మెరుగ్గా మార్చాలన్న పట్టుదలతో ఉంది.
ఐటీసీ షేర్లు (ITC Share Price) నేడు రూ.473 వద్ద ముగిశాయి. మంగళవారం రూ.7.60 వరకు లాభపడ్డాయి. ఏడాది కాలంగా ఐటీసీ షేర్లు బుల్ ఫేజ్‌లో ఉన్నాయి. ఏకంగా 61 శాతం అంటే రూ.180 వరకు పెరిగాయి. కొన్నేళ్లుగా రూ.250-300 రేంజులో కదలాడిన షేర్లు ఇప్పుడు పుంజుకున్నాయి. రీరేటింగ్ రావడంతో ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. కాగా 2023 ఆర్థిక ఏడాదిలో కంపెనీ రూ.19,255 కోట్లు డివిడెండ్‌గా ఇచ్చింది.
Also Read: మధుమేహులకు బంపర్ ఆఫర్! డయాబెటిక్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చేసింది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial