LIC Profits: ఎల్ఐసీ బంపర్ ప్రాఫిట్..! ఐపీవో ముందు అదరగొట్టిన బీమా సంస్థ
అర్ధవార్షిక ఫలితాల్లో ఎల్ఐసీ అదరగొట్టింది. బంఫర్ రేంజ్లో లాభాలు ఆర్జించింది. ప్రీమియం, పెట్టుబడులు, అద్దె ఆదాయం పెరిగింది. ఐపీవో ముందు భారీ లాభాలు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
భారతీయ జీవిత బీమా (LIC) అదరగొట్టింది. FY21-22 (H1FY22) ప్రథమార్ధంలో పన్నులు పోగా రూ.1437 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది రూ.6.14 కోట్లే కావడం గమనార్హం. నికర ప్రీమియం రాబడి, పెట్టుబడులపై 12 శాతం ఆదాయం పెరగడం, బీమా విక్రయాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఐపీవోకు ముందు వచ్చిన ఈ ఫలితాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి.
2022 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్త ప్రీమియం అభివృద్ధి రేటు 554.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 394.76 శాతమేనని ఎల్‌ఐసీ తెలిపింది. 2021 ఏప్రిల్-సెప్టెంబర్‌కు మొత్తం నికర ప్రీమియం రూ.1679 కోట్లకు పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఓవరాల్ ప్రీమియం రూ.17,404 కోట్లకు పెరిగింది. పెట్టుబడులపై ఆదాయం రూ.3.35 లక్షల కోట్లకు పెరిగింది. ఇక H1FY22లో పెట్టుబడులపై ఆదాయం రూ.15,726 కోట్లుకు పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరుకుంది.
వడ్డీ, డివిడెండ్లు, అద్దె ఆదాయం రూ.10,178 కోట్లకు పెరిగింది. పెట్టుబడుల అమ్మకం, రిడెంప్షన్ ఆదాయ లాభం రూ.10,965 కోట్లకు పెరిగింది. ఐపీవో ముంగిట ఎల్‌ఐసీ వాటా మూలధనం రూ.6,325 కోట్లకు పెరిగింది. నాన్ లింక్‌డు వ్యక్తిగత బీమా ప్రీమియం రూ.7,262 కోట్లు పెరిగి రూ.1.13 లక్షల కోట్లకు చేరుకుంది. నాన్ లింకుడ్ వ్యక్తిగత పింఛన్ ప్రీమియం మొత్తం రూ.4,432 కోట్ల నుంచి రూ.5,636 కోట్లకు పెరిగింది. గ్రూప్ ప్రీమియం రూ.90 కోట్లు పెరిగి రూ.66,295 కోట్లకు చేరుకుంది. లింకుడు వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం రూ.737 కోట్ల నుంచి రూ.1,085 కోట్లకు చేరుకుంది.
ఎల్‌ఐసీ నెట్ రీటెన్షన్ రేషియో 99.88 శాతంగా ఉంది. పాలసీదారుల పెట్టుబడులు రూ.5.9 లక్షల కోట్లు పెరిగి రూ.37,72 లక్షల కోట్లకు చేరుకుంది. షేర్‌హోల్డర్ల పెట్టుబడులు రూ.56.17 కోట్ల నుంచి రూ.6,311 కోట్లకు పెరిగింది.
ఐపీవో కోసం ఎల్‌ఐసీ వేగంగా సిద్ధమవుతోంది. జనవరి చివరి వారంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేయనుందని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి.పబ్లిక్ లిస్టింగ్‌కు సంబంధించిన తేదీని ఎల్‌ఐసీ అత్యున్నత అధికారులు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు చెప్పినట్టు సమాచారం. అనుకున్నట్టుగానే 2022 ఆర్థిక ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
దేశంలోనే అత్యంత విలువైన ఐపీవోగా ఎల్‌ఐసీ నిలవనుంది. దాదాపుగా రూ.లక్ష కోట్ల విలువతో కంపెనీ మార్కెట్లో నమోదు అవ్వనుంది. కంపెనీ ఇప్పటికే పింఛన్లు, ఆన్యూటి, ఆరోగ్య బీమా, యులిప్ వంటి పథకాలపై దృష్టి సారించిందని అధికారులు ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఉత్పత్తుల్లో వైవిధ్యం పెంచుతున్నామని వెల్లడించారు. గతంలో ప్రవేశపెట్టిన నాన్ పార్టిసిపేటింగ్ పథకాల విక్రయాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.