Retirement Plan: పదవీ విరమణ తర్వాత ఎవరి పంచనా చేరక్కర్లేదు, ఇలాంటి బెస్ట్ ప్లాన్స్ ఉంటే జీవితమంతా జాలీనే!
మీ దగ్గరున్న డబ్బును SCSSలో పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి 7.6% వడ్డీని పొందుతారు.
Retirement Plan: ఉద్యోగ జీవితంలో దాచిన డబ్బు పదవీ విరమణ తర్వాత పీఎఫ్, గ్రాట్యుటీ వంటి రూపాల్లో పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ఆ డబ్బును రకరకాల కార్యక్రమాల కోసం వాడుకుంటారు. అప్పులు తీర్చడానికో, ఇల్లు కట్టుకోవడానికో, పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్లు చేయడానికో లేదా వివిధ రూపాల్లో పెట్టుబడులుగానో ఉపయోగించుకుంటారు. ఒకవేళ మీరు పెట్టుబడుల కోణంలో ఆలోచిస్తుంటే.. ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా బలమైన రాబడి పొందవచ్చు. ఉద్యోగ జీవితం తర్వాత కూడా, నెలనెలా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడుల కోసం మీరు చూస్తుంటే, మేం మీకు కొన్ని ఆప్షన్లు సూచిస్తాం. అందులో ఏది ఎంచుకోవాలో మీ ఇష్టం.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం ఇది. ఇది పోస్టాఫీస్ స్కీమ్. మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం మొత్తం 1,000 రూపాయలు. గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీ దగ్గరున్న డబ్బును SCSSలో పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి 7.6% వడ్డీని పొందుతారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ కారంలో బలమైన రాబడిని అందించడంలో ఇది ఉత్తమ మార్గం. మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక డిపాజిట్ రేట్లు అమలు చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 7.50% వరకు వడ్డీని అందిస్తున్నాయి.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లేదా నెలవారీ ఆదాయ పథకం కూడా ఒక పోస్టాఫీస్ స్కీమ్. ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెడితే, ప్రతి నెలా స్థిరమైన రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో, మీరు ఒకే (ఇండివిడ్యువల్) ఖాతాలో కనిష్టంగా రూ. 1,000 - గరిష్టంగా రూ. 4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఖాతా తీసుకుని కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఖాతాలపై మీకు గరిష్టంగా 6.6% వడ్డీని పోస్టాఫీసు అందిస్తుంది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన
ప్రధాన మంత్రి వయ వందన యోజనలో (PMVVY) పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా బలమైన రాబడి పొందవచ్చు. 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ పథకానికి అర్హులు. ఇందులో కనీస మొత్తం 1,000 రూపాయలు. గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి ద్వారా, వడ్డీ ఎప్పుడు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు. నెలనెలా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆప్షన్లు ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ ఎంచుకంటే ఆ సమయానికి రావలసిన వడ్డీని మీ ఖాతాలో కలుపుతారు. మీరు 10 సంవత్సరాల పాటు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.