Internship Scheme: పది పాసైతే చాలు, టాప్-500 కంపెనీల్లో ఛాన్స్ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్'
Internship Opportunity: దేశంలోని కోట్లాది మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు & ప్రత్యక్ష వ్యాపార అనుభవాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ఇది.
Internship Opportunities In Top-500 Companies In India: భారతీయ యువతకు బంపర్ ఆఫర్‌గా చెప్పుకునే ఇంటర్న్‌షిప్ స్కీమ్ మరికొన్ని రోజుల్లో ఓపెన్ అవుతుంది. 2024-25 బడ్జెట్‌లో, దేశంలోని అగ్రగామి సంస్థల్లో "ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం"ను (స్కీమ్) ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా, దేశంలోని అగ్రశ్రేణి-500 కంపెనీల్లో, ఐదేళ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలన్నది టార్గెట్. ఈ పథకం ద్వారా, విభిన్న వృత్తులు & ఉపాధి రంగాల్లో వాస్తవ వ్యాపార వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం యువతకు లభిస్తుంది. తద్వారా, ఇండస్ట్రీకి ఏం కావాలో అర్ధం చేసుకుని, దానికి అనుగుణంగా రెడీ అవుతారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఒక పైలట్ ప్రాజెక్టును 03 అక్టోబర్ 2024న ప్రారంభించారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ పోర్టల్ www.pminternship.mca.gov.in ద్వారా ఇది అమలవుతుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించే టాప్-500 కంపెనీలు రిజిస్టర్ చేసుకునేందుకు ఈ పోర్టల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అభ్యర్థుల కోసం ఈ నెల 12 నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది.
కంపెనీల ఎంపిక విధానం
గత మూడు సంవత్సరాల సగటు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' (CSR) వ్యయం ఆధారంగా అగ్రశ్రేణి కంపెనీలను గుర్తిస్తారు. భాగస్వామ్య సంస్థ, తన సొంత కంపెనీలో ఇంటర్న్‌షిప్ అందించలేకపోతే, దాని విలువ గొలుసులో ఉన్న సంస్థలు (ఉదా: సరఫరాదార్లు/ఖాతాదార్లు/వెండర్లు) లేదా దాని గ్రూప్‌లోని ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించొచ్చు.
కాల వ్యవధి
ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి 12 నెలలు. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా, తప్పనిసరిగా వాస్తవ పని/ఉద్యోగ వాతావరణంలో నేర్చుకోవాలి.
ఆర్థిక సాయం
ఎంపికైనా అభ్యర్థులకు నెలకు రూ.5,000 ఆర్థిక సాయం అందుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.4,500 ఇస్తుంది. సదరు సంస్థ తన సీఎస్‌ఆర్ నిధుల నుంచి నెలకు రూ.500 చెల్లిస్తుంది. ఒకవేళ, ఏదైనా సంస్థ రూ.500 కంటే ఎక్కువ నెలవారీ సాయం అందించాలనుకుంటే, తన సొంత నిధుల నుంచి ఇవ్వొచ్చు. దీనికి అదనంగా, ఇంటర్న్‌షిప్ ప్రారంభ సమయంలో ప్రతి అభ్యర్థికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.6,000 ఇస్తుంది. ఇది, ఒక్కసారి సాయం మాత్రమే, నెలనెలా ఇవ్వదు.
బీమా కవరేజీ
భారత ప్రభుత్వ బీమా పథకాలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి అభ్యర్థికి బీమా చేస్తారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. కంపెనీ కూడా అదనపు ప్రమాద బీమా కవరేజీని అందించొచ్చు.
అభ్యర్థుల అర్హతలు
వయస్సు 21-24 సంవత్సరాల మధ్య (దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి) ఉండాలి
భారతదేశంలో నివశించాలి
ఫుల్ టైమ్ జాబ్/విద్యాభ్యాసంలో ఉండకూడదు
ఆన్‌లైన్/దూరవిద్య ద్వారా చదువుతున్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు
విద్యార్హతలు
హైస్కూల్ లేదా హైయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉత్తీర్ణత
ఐటీఐ సర్టిఫికేట్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా
బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీలు.
ఈ అభ్యర్థులు అనర్హులు
ఐఐటీ, ఐఐఎం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐడీ, ఐఐఐటీ ఉత్తీర్ణులు
సీఏ, ఎంసీఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్నవాళ్లు
కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద నైపుణ్యం, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ లేదా విద్యార్థి శిక్షణ కార్యక్రమం పొందుతున్నవాళ్లు
'నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్' (నాట్స్) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (నాప్స్) కింద శిక్షణ పూర్తి చేసినవాళ్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో అభ్యర్థి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి ఆదాయమైనా రూ.8 లక్షలు దాటితే
కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా శాశ్వత/రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి అయితే
పథకం అమలు
భాగస్వామ్య సంస్థలకు పోర్టల్‌లో ప్రత్యేకమైన డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అవకాశాలు, పని ప్రాంతం, పని స్వభావం, అర్హతలు, అందించే సౌకర్యాల వంటి వివరాలను ఆ డాష్‌బోర్డ్‌లో నమోదు చేస్తాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యత రంగాలు, ఉద్యోగ స్వభావం, ప్రాంతాల ఆధారంగా ఇంటర్న్‌షిప్ కోసం శోధించవచ్చు. గరిష్టంగా ఐదు అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సమాచార సహాయం
ఈ పథకం కింద, ప్రత్యేకంగా ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం పని చేస్తుంది. సమస్యలను సకాలంలో పరిష్కరించేలా ఇది పని చేస్తుంది. మీ మాతృభాషలో సాయం కోరడానికి 1800-116-090 హెల్ప్‌లైన్ నంబర్ ఉపయోగించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: కేంద్ర ఉద్యోగులకు దసరా ధమాకా ఆఫర్ - కొత్త స్కీమ్‌కు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్!