Intel Layoffs: వ్యాపారం లేక వేలాది ఉద్యోగాల్లో కోత పెడుతున్న ఇంటెల్
ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ సెగ్మెంట్లలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం వరకు సిబ్బందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Intel Layoffs: గ్లోబల్ ఎలక్ట్రానిక్ చిప్‌లు లేదా సెమీకండక్టర్ల (Semiconductor) తయారీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ (Intel Corporation), భారీ సంఖ్యలో ఉద్యోగులను శాశ్వతంగా ఇళ్లకు పంపే యోచనలో ఉందట!. ఈ సంఖ్య వేలల్లో ఉండొచ్చంటూ బ్లూమ్‌బెర్గ్ (Bloomberg News) వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపుపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొంది. ఈ నెలలోనే ఉద్యోగులకు రాంరాం (layoffs) చెప్పే ప్రక్రియ మొదలవుతుందని కూడా వెల్లడించింది.
20 శాతం కోత
కంపెనీకి చెందిన చాలా విభాగాల్లో, ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ సెగ్మెంట్లలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం వరకు సిబ్బందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్లోబల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల మీద స్పందించడానికి ఇంటెల్ నిరాకరించడం విశేషం. అంటే, ఆ వార్తలు అబద్ధం అని గానీ, నిజం అని గానీ తేల్చలేదు. దీంతో, ఉద్యోగుల ఉద్వాసన ఖరారైందని మార్కెట్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంటెల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది ఒక అమెరికన్ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ. ఆదాయ ప్రాతిపదికన... ప్రపంచంలోనే అతి పెద్ద సెమీకండక్టర్ చిప్ తయారీ కంపెనీ ఇది. ప్రపంచంలోని సింహభాగం పర్సనల్ కంప్యూటర్లలో ఉండే ఇన్‌స్ట్రక్షన్ సెట్ x86 సిరీస్ (x86 series) డెవలపర్లలో ఇది ఒకటి.
ఇంటెల్ కంపెనీకి, ఈ ఏడాది జులై నెల నాటికి, ప్రపంచవ్యాప్తంగా 1,13,700 మంది ఉద్యోగులు ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది రెండో త్రైమాసికం ఫలితాల్లో, మార్కెట్ అంచనాలను ఇంటెల్ కార్ప్ అందుకోలేకపోయింది. అంతేకాదు, మేనేజ్‌మెంట్ కాల్‌లో.. పూర్తి ఆర్థిక సంవత్సరం విక్రయాలు, లాభాల అంచనాలను కుదించింది. మందగమనం ఇంకా కొనసాగుతుందని పరోక్షంగా సంకేతం ఇచ్చింది.
పీసీలకు తగ్గిన గిరాకీ
కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు (PCలు) గిరాకీ భారీగా పెరిగింది. ఇప్పుడు కంపెనీలు తిరిగి తెరుచుకుని, యథావిధిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మొదలైంది. ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. దీంతో PCలకు గిరాకీ పడిపోయింది. అంతేకాగు, PCలకు కీలక మార్కెట్ అయిన చైనాలో విధించిన కఠినమైన కొవిడ్ ఆంక్షలు కూడా ఇంటెల్ చిప్‌ల అమ్మకాలను దెబ్బకొట్టాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల సరఫరా గొలుసు వ్యవస్థల్లో తలెత్తిన ఇబ్బందులు సైతం ప్రతికూలంగా మారాయి.
ఇలా వివిధ కారణాల వల్ల అమ్మకాలు పడిపోయి పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో ప్రస్తుతం మందగమన పరిస్థితులు నెలకొనడంతో వ్యయాలు తగ్గించుకోవడానికి ఇంటెల్ కార్ప్ ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే భారీ సంఖ్యలో తన ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది.
సొంత ఉత్పత్తులతోపాటు, ఇతర కంపెనీలు డిజైన్ చేసిన చిప్‌లను సైతం ఇంటెల్‌లో తయారు చేసేందుకు ఒక ఫెసిలిటీని (Internal Foundry Model) ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాట్ గెల్సింగర్ (Pat Gelsinger) మంగళవారం ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.