Indian Stock Market: నిఫ్టీలో 114% లాభం, గ్లోబల్ మార్కెట్లలో మనల్ని కొట్టినవాళ్లు లేరు
నిఫ్టీతో పోలిస్తే, అమెరికన్ డౌ జోన్స్ సగం కంటే తక్కువలో ఉంది, కేవలం 42 రాబడిని ఇచ్చింది.
Indian Stock Market: స్టాక్ మార్కెట్లను రోజూ ట్రాక్ చేసేవాళ్లు ఒక విషయాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటారు. అది.. ఇండియన్ మార్కెట్లలో కనిపిస్తున్న బలం. ప్రపంచ మార్కెట్లు నానాటికీ కృంగి కృశించి పోతుంటే, భారతీయ మార్కెట్లు మాత్రం బలపడుతున్నాయి.
టాప్ 20లో మనమే బెస్ట్
2020 ఏప్రిల్ 1 నుంచి, టాప్ 20 ప్రపంచ మార్కెట్లోని బెంచ్‌మార్క్‌ల కదలికలను పరిగణనలోకి తీసుకుంటే, భారతదేశ మార్కెట్లు బలంగా నిలదొక్కుకున్నాయి. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం.. ఇలా రకరకాల కారణాలతో మిగిలిన మార్కెట్లు మంటల్లో మాడిపోతుంటే, మనకు మాత్రం ఆ సెగ తగల్లేదు. 2020 ఏప్రిల్ 1 నుంచి, ఈ రెండున్నరేళ్ల కాలంలో, నిఫ్టీ 50 114% లాభపడింది. టాప్ 20 మార్కెట్లలో ఇదే అత్యధిక రాబడిగా బ్లూమ్‌బెర్గ్ డేటా చెబుతోంది.
వెనుకబడ్డ అమెరికా
డాలర్‌తో సర్దుబాటు చేసి చూసినా కూడా, టాప్ 20 ఇండెక్స్‌ల్లో నిఫ్టీ మాత్రమే నిలదొక్కుంది, రెండింతలు లేదా 101 శాతం రాబడిని ఇచ్చింది. ఇండోనేషియా, రష్యన్ మార్కెట్ సూచీలు (JCI, RTSI) వరుసగా 76 శాతం, 67 శాతం రాబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిఫ్టీతో పోలిస్తే, అమెరికన్ డౌ జోన్స్ సగం కంటే తక్కువలో ఉంది, కేవలం 42 రాబడిని ఇచ్చింది. జర్మనీ, యుకే, ఫ్రాన్స్ సహా యూరోపియన్ మార్కెట్లు 20 నుంచి 28 శాతం వరకు లాభపడగా; చైనా, కొరియా, జపాన్ సహా ప్రముఖ ఆసియా మార్కెట్లు ఇదే కాలంలో 13 నుంచి 24 శాతం లాభపడ్డాయి.
కీలక ట్రిగ్గర్లు
వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ ఆర్థిక వ్యవస్థ, కేంద్రంలో స్థిరమైన రాజకీయ ప్రభుత్వం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల వృద్ధికి చొరవ, దేశీయ & రిటైల్ పెట్టుబడిదారుల పెరుగుతున్న ఆసక్తి వంటివి భారతీయ ఈక్విటీల అద్భుత పనితీరుకు ప్రధాన డ్రైవర్లుగా పని చేశాయి.
రెండు, మూడు, ఐదు, పదేళ్ల వ్యవధిలో (time periods) చూసినా భారత్‌దే అత్యుత్తమ ప్రదర్శన. అయితే, గత 12 నెలల రిటర్న్స్ ఆధారంగా చూస్తే మాత్రం ఇండోనేషియా, బ్రెజిల్ మార్కెట్ల కంటే వెనుకబడి ఉంది. గత 12 నెలల రిటర్న్స్‌లో నిఫ్టీ 3 శాతం క్షీణించగా; బ్రెజిల్ ఫ్లాట్‌గా ఉంది, ఇండోనేషియా 16 శాతం లాభపడింది.
బుధవారం కూడా సేమ్ సీన్
బుధవారం నాడు, యుఎస్ సూచీల్లో బాగా పతనంతో పోలిస్తే మన నిఫ్టీ కేవలం 0.4% తగ్గి 18,003.8 వద్ద ముగిసింది, అత్యంత కీలకమైన 18K మార్కును నిలబెట్టుకుంది. బుధవారం డౌ జోన్స్ 4 శాతం, నాస్‌డాక్ 5 శాతం పడిపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.