Retail Inflation: దేశంలో ధరలు తగ్గాయి, 15 నెలల కనిష్టానికి దిగొచ్చిన ద్రవ్యోల్బణం
అంతకు ముందు నెల ఫిబ్రవరిలో 6.44 శాతంగా ఉంది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉంది.
Retail Inflation March 2023 Data: దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) వరుసగా రెండో నెల కూడా తగ్గింది. 2023 మార్చి నెలలో, వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index - CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతంగా నమోదైంది. ముఖ్యంగా, ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది, 15 నెలల కనిష్ట స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గరిష్ట లక్ష్యమైన 6 శాతం లోపే ఈసారి ఇన్‌ఫ్లేషన్ నమోదైంది.
అంతకు ముందు నెల ఫిబ్రవరిలో 6.44 శాతంగా ఉంది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉంది. ఏడాది క్రితం (2022) మార్చి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 6.95 శాతంగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం ( National statistical Office) ఈ లెక్కలను విడుదల చేసింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో 5.7 శాతానికి దిగి వచ్చి ఆశలు రేపిన చిల్లర ద్రవ్యోల్బణం.. ఆ తర్వాత ఆహార పదార్థాలు, పాలు, పాల పదార్థాల ద్రవ్యోల్బణం పెరగడంతో వరుసగా రెండు నెలల (2023 జనవరి, ఫిబ్రవరి) పెరిగింది.
తగ్గిన ఆహార పదార్థాలు, పాల ద్రవ్యోల్బణం
2023 మార్చి నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గింది, 4.79 శాతానికి దిగి వచ్చింది. 2023 ఫిబ్రవరి నెలలో ఇది 5.95 శాతంగా, 2022 మార్చి నెలలో (ఏడాది క్రితం) 7.68 శాతంగా ఉంది. ఫిబ్రవరితో పోలిస్తే పాలు, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణంలోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది. పాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలోని 9.65 శాతం నుంచి మార్చిలో 9.31 శాతానికి తగ్గింది.
2023 మార్చి నెలలో తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం పెరిగింది, 15.27 శాతంగా ఉంది. మసాల దినుసుల ద్రవ్యోల్బణం రేటు 18.21 శాతం, పప్పుల ద్రవ్యోల్బణం రేటు 4.33 శాతం, పండ్ల ద్రవ్యోల్బణం రేటు 7.55 శాతం చొప్పున పెరిగాయి. కూరగాయల ద్రవ్యోల్బణం రేటు -8.51 శాతం, మాంసం & చేపల ద్రవ్యోల్బణం రేటు -1.42 శాతం, నూనెలు & కొవ్వుల ద్రవ్యోల్బణం రేటు -7.86 శాతం మేర తగ్గాయి.
ఖరీదైన అప్పుల నుంచి ఉపశమనం లభించవచ్చు
2023 మార్చిలో, రిటైల్ ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ అప్పర్ బ్యాండ్ అయిన 6 శాతం లోపునకు తగ్గడం ఉపశమనం కలిగించే విషయం. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీన, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి ద్రవ్య విధానాన్ని RBI ప్రకటించింది, వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్బణం రేటు తదుపరి నెలల్లోనూ తగ్గుతూ వస్తే, రాబోయే రోజుల్లో ఖరీదైన రుణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతకుముందు, 2022-23లో జరిగిన ఏడు ద్రవ్య విధాన సమావేశాల్లోని ఆరు పాలసీల ప్రకటనల్లో కలిపి రెపో రేటును 2.50 శాతం RBI పెంచింది, 4 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.20 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో 5.1 శాతం, రెండో త్రైమాసికంలో 5.4 శాతం, మూడో త్రైమాసికంలో 5.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా ఉండొచ్చని లెక్కలు వెలువరించింది.