India Post Accident Policy: ఏడాది ₹399 చెల్లిస్తే చాలు, ₹10 లక్షల ప్రమాద బీమా కవరేజ్
టాటా ఏఐజీతో (Tata AIG General Insurance Company) కలిసి, తన కస్టమర్ల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది.
India Post Accident Policy: వాన రాకడ - ప్రాణం పోకడ (అమంగళం ప్రతిహతమవుగాక) ఎవ్వరూ చెప్పలేరంటారు. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలోకి తెచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ కూడా వాన రాకడను - ప్రాణం పోకడను అంచనా వేయలేకపోతోంది. రోడ్డెక్కనిదే మనకు కుటుంబం గడవదు. రోడ్ల మీద చూస్తే వాహనాల రద్దీ ఏటికేడు పెరుగుతూనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటి వ్యక్తి అజాగ్రత్త వల్లో, మరో కారణం చేతో రోడ్డు ప్రమాదం జరిగితే..! (అమంగళం మళ్లీ ప్రతిహతమవుగాక). ఇది ఊహించడానికే భయంకరమైన విషయం. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి ప్రాణాల్నే కాదు, మొత్తం కుటుంబాన్నే నడిరోడ్డు మీద నిలబెడుతుంది. సంపాదించే వ్యక్తి ఒకవేళ రోడ్డు ప్రమాదం బారిన పడితే, ఆ కుటుంబం మొత్తం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. అందుకే ప్రమాద బీమా చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం.
399 రూపాయలకే..
ప్రమాద బీమా పట్ల ప్రజల్లో ఇటీవల, ముఖ్యంగా కరోనా తర్వాత అవగాహన బాగా పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా తరహాలో ప్రమాద బీమా కూడా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇతర సంస్థల తరహాలోనే, తపాలా శాఖ (postal department) కూడా ఓ బీమా పథకాన్ని ప్రారంభించింది. టాటా ఏఐజీతో (Tata AIG General Insurance Company) కలిసి, తన కస్టమర్ల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. ఏడాదికి కేవలం 399 రూపాయలతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఎవరు అర్హులు?
18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే, ఈ బీమా తీసుకోవాలంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే, ఐపీడీ (ఇన్ పేషెంట్) కింద 60 వేల రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్ పేషెంట్ విషయంలో.. 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు.
ఇతర ప్రయోజనాలు
ఈ పాలసీలో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ఇద్దరు పిల్లలకు, ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో, రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.
రూ.299కి కూడా..
ఇదే పథకాన్ని 299 రూపాయల ఆప్షన్‌తోనూ తపాలా శాఖ అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే, ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్‌లో కవర్ అవుతాయి. పైన చెప్పుకున్న అదనపు ప్రయోజనాలు మాత్రం అందవు.