ITR: ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ గడువు మరో నెల పొడిగింపు?, నిర్మలమ్మకు రిక్వెస్ట్ లెటర్
'సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్' కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది.
Income Tax Return Filing: 2022-23 ఆర్థిక సంవత్సరం/2023-24 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. ఈ లాస్ట్ డేట్‌కు ఇంకొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈ గడువు పెంచాలన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనికి కారణం.. ప్రకృతి ప్రకోపం.
ప్రస్తుతం, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ నీళ్లలో నానుతోంది. కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు విపరీతమైన వర్షాలకు అడుగు బయట పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల వరద మధ్యలోనే కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ డేట్‌ను జులై 31 కంటే పెంచాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తులు వెళ్లాయి.
ఒక నెల పొడిగింపు కోసం విజ్ఞప్తి
దేశంలో ప్రాచీన & అతి పెద్ద టాక్స్ ఎక్స్‌పర్ట్స్ అసోసియేషన్ అయిన 'సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్', కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. రాజధాని దిల్లీలో వరదల కారణంగా ITOలో ఉన్న ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్ సహా చాలా ఆఫీసులు మూతబడ్డాయని ఆ లెటర్‌లో వివరించింది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలుకు చివరి తేదీ చాలా దగ్గరగా ఉందని సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ గుర్తు చేసింది. ఆదాయాలు డిక్లేర్ చేయాల్సిన టాక్స్ పేయర్లు ఇప్పటికీ భారీ సంఖ్యలో మిగిలున్నారు. ఒకవేళ వరదలు త్వరగా తగ్గినా, చివరి తేదీకి ముందు అంతమంది పత్రాలు సమర్పించడం, ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడం కష్టం. కాబట్టి, ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు చివరి తేదీని ఆగస్టు 31, 2023 వరకు, ఒక నెల పొడిగించాలని బార్ అసోసియేషన్ కేంద్రఆర్థిక మంత్రిని కోరింది.
లాస్ట్ డేట్ ఎక్స్‌టెన్షన్ కోసం, ఆర్థిక మంత్రితో పాటు CBDT చైర్మన్‌కు కూడా తన రిక్వెస్ట్ లెటర్‌ను సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సమర్పించింది. వరద సమస్య కేవలం దిల్లీకే పరిమితం కాదు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల బాధిత రాష్ట్రాల లిస్ట్‌లో ఉత్తర భారతదేశంలోని చాలా స్టేట్స్ పేర్లు ఉన్నాయి. చాలా చోట్ల కరెంటు సమస్య ఉంది. ఆఫీసులు తెరుచుకోవడం లేదు. ట్రాన్స్‌పోర్టేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ITR ఫైలింగ్‌లో పాత రికార్డులు బద్ధలు
ఆదాయ పన్ను ఫైలింగ్‌లో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కీలక మైలురాళ్లు ఈసారి ముందుగానే అధిగమిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సులువుగా ఫైల్ చేసుకోవడం, ఆఖరి వరకు వేచి చూసే ధోరణి తగ్గడం, ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ కావడమే ఇందుకు కారణాలు.
ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు తమ ఐటీఆర్ దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 3 కోట్ల ITR మైలురాయి కోసం గత ఏడాది జులై 25 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈసారి మాత్రం 7 రోజుల ముందుగానే ఈ మైలురాయి కనిపించింది. 3.06 కోట్లలో 2.81 కోట్ల ఐటీఆర్‌లు ఇ-వెరిఫై అయ్యాయి. 1.50 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెస్ పూర్తయింది.
కోటి, రెండు కోట్ల ఐటీఆర్ ఫైలింగ్ రికార్డులు సైతం ఈసారి బద్దలైన సంగతి తెలిసిందే. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి జులై 11 వరకు మొత్తం 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 9 రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకున్నాం. 2022 జులై 8 నాటికి ఒక కోటి నంబర్ కనిపించింది. అంటే, 2022తో పోలిస్తే 2023లో ఒక కోటి ITRల మైలురాయిని 12 రోజుల ముందే చేరుకున్నట్లయింది.
మరో ఆసక్తికర కథనం: మూడేళ్ల ఎఫ్‌డీకి 8% వడ్డీ ఇస్తున్న బ్యాంకులివి, ఏది సెలక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial