Hurun India Rich List 2022: అదానీ దూకుడు.. సాటెవ్వరు! అంబానీని వెనక్కి నెట్టేసిన గౌతమ్.. రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం
Gautam Adani Beats Mukesh Ambani: గతేడాది నుంచి గౌతమ్ అదానీ ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోనూ ఆయన రికార్డులు సృష్టిస్తున్నారు.
Hurun India Rich List 2022: సంపద సృష్టిలో గౌతమ్ అదానీకి తిరుగులేదు! గతేడాది నుంచి ఆయన ఇంట్లో కనక వర్షం కురుస్తూనే ఉంది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ రిచ్ లిస్టులో ఇప్పటికే ఆయన ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోనూ ఆయన రికార్డులు సృష్టించారు. భారత్‌లో అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఏడాది నుంచి ఆయన రోజుకు రూ.1612 కోట్లు ఆర్జిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని రెండో స్థానానికి నెట్టేశారు.
ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు రూ.10,94,400 కోట్లకు చేరుకుంది. ముకేశ్ అంబానీ కన్నా రూ.3 లక్షల కోట్లు ఎక్కువగా ఉన్నారు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ వృద్ధిరేటు మొత్తంగా 9 శాతం ఉండగా అదానీని తొలగించి చూస్తే కేవలం 2.67 శాతానికే పరిమితమవ్వడం గమనార్హం. ఒకప్పుడు కమోడిటీ వ్యాపారం చేసే గౌతమ్ అదానీ ఇప్పుడు బొగ్గు గనులు, ఎగుమతులు, పోర్టులు, ఇంధనం సహా అనేక వ్యాపారాలను విస్తరించారు. ఆయనకున్న ఏడు కంపెనీల్లో ప్రతి కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు పైగానే ఉండటం ప్రత్యేకం.
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ పదేళ్లుగా ఆధిపత్యం చెలాయించారు. అలాంటిది రూ.7.94 లక్షల కోట్ల సంపదతో తొలిసారి ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ర్యాంకు సంగతి పక్కన పెడితే గతేడాది ఆయన సంపద 11 శాతం వృద్ధి చెందింది. రోజు రూ.210 కోట్లను ఆర్జించారు. దేశంలోని టాప్ 10 ధనవంతుల సంపదలో అదానీ, అంబానీల వాటానే 59 శాతం కావడం గమనార్హం.
అంబానీ సంపదలో 2012లో అదానీ సంపద విలువ 1/6 వంతు మాత్రమే ఉండేది. అలాంటిది పదేళ్లలో ఆయనను వెనక్కి నెట్టి గౌతమ్ తొలి స్థానానికి చేరుకున్నారు. నిజానికి గతేడాది అదానీ కన్నా అంబానీ సంపద రూ.లక్ష కోట్లు ఎక్కువ. కేవలం ఒక ఏడాదిలో రూ.3 లక్షల కోట్ల తేడాతో అదానీ ఆయన్ను మించిపోయారు. 'గౌతమ్ అదానీ ఎక్కువగా పవర్, పోర్టులు, రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి సారించారు. ముకేశ్ అంబానీ టెలికాం, పెట్రో కెమికల్స్‌ను నమ్ముకున్నారు. మూడో స్థానంలోని సైరస్ పూనావాలా వ్యాక్సిన్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆ తర్వాత టాప్ -10లో ఫార్మా, రిటైల్, ఆర్థిక సేవల వ్యాపారులు ఉన్నారు' అని హురూన్ నివేదిక వెల్లడించింది.
Unveiling the most comprehensive rich list from India!
— HURUN INDIA (@HurunReportInd) September 21, 2022
Know who is the richest Indian, the top ten wealthiest individuals in India, and which industry contributes the most to wealth creation. Hurun India and IIFL Wealth bring to you the IIFL Wealth Hurun India Rich List 2022. pic.twitter.com/nxIbeuHtVg