Aadhar: పదేళ్లు దాటిన ఆధార్ కార్డ్ పని చేయదా, ఇప్పుడేం చేయాలి?
Aadhar Card Updation: ఆధార్ కార్డ్ తీసుకుని పదేళ్లు దాటితే, దానిలోని వివరాలను ఇప్పటివరకు నవీకరించకపోతే, ఆ కార్డ్‌ను కచ్చితంగా అప్‌డేట్ చేయాలి.
How To Update 10 Year Old Aadhaar Card: మన దేశంలో ఆధార్ కార్డ్ ఒక కీలక గుర్తింపు పత్రం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే... ఆధార్ ఉంటేనే భారతీయుడిగా పరిగణిస్తున్నారు. ఆధార్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హుడిగా మారడం మాత్రమే కాదు, పాఠశాలల్లో ప్రవేశాలు & ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు దొరకడం లేదు.
'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ' (UIDAI లేదా ఉడాయ్) సూచనల ప్రకారం, ఒక వ్యక్తి వ్యక్తిగత వివరాలు మారినప్పుడల్లా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేస్తుండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ తీసుకుని పదేళ్లు దాటితే, దానిలోని వివరాలను ఇప్పటివరకు నవీకరించకపోతే, ఆ కార్డ్‌ను కచ్చితంగా అప్‌డేట్ చేయాలి.
పదేళ్లు దాటిన ఆధార్ కార్డ్‌లు పని చేయవా?
ఆధార్ కార్డ్‌లకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక విషయం చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ తీసుకుని పదేళ్లు దాటితే, 2024 జూన్ 14లోపు ఆ కార్డ్‌లోని వివరాలను అప్‌డేట్ చేయకపోతే, ఆ కార్డు ఇక పని చేయదన్న వార్తలు కనిపిస్తున్నాయి. అయితే.. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఉడాయ్ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మాత్రమే జూన్ 14వ తేదీని గడువుగా నిర్ణయించామని వెల్లడించింది. జూన్ 14 లోగా అప్‌డేట్ చేయకపోయినా ఆధార్ యథాతథంగా పని చేస్తుందని, ఆ తేదీ తర్వాత కూడా వివరాలు సవరించేందుకు అవకాశం ఉంటుందని ఉడాయ్ స్పష్టం చేసింది.
ఆధార్ కార్డ్‌ను ఉచితంగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How To Update Aadhar At Free Of Cost?)
మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి ఈ ఏడాది జూన్ 14వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈ గడువు తర్వాత ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే, ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే మీ ఆధార్ కార్డ్‌లోని వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా ఈ పని పూర్తి చేయొచ్చు.
- ముందుగా, myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఉడాయ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- మీ ఆధార్ నంబర్‌ను సంబంధిత గడిలో పూరించండి.
- మీ ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చే OTPని కూడా పూరించి, లాగిన్ అవ్వండి.
- 'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ, మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న సమాచారంపై క్లిక్ చేయాలి. ఉదాహరణకు, మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే, ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ను, ఇతర వివరాలను అప్‌డేట్ చేసి, దానికి సంబంధించిన గుర్తింపు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- వివరాలు & పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది.
- ఈ నంబర్ సాయంతో మీ ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియను ట్రాక్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి