Shark Tank India: మీ బిజినెస్ ఐడియాకు ఇన్వెస్ట్‌మెంట్ కావాలా? పెట్టుబడితో పాటు ఫేమస్ కూడా అవ్వవచ్చు!
షార్క్ ట్యాంక్ ఇండియా ద్వారా మీ బిజినెస్ ఐడియాలకు పెట్టుబడి పొందవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలంటే?
సాధారణంగా మనం టీవీల్లో రకరకాల రియాలిటీ షోలు చూస్తూ ఉంటాం. బిగ్ బాస్, క్యాష్, ఎవరు మీలో కోటీశ్వరులు వంటి షోలు మనకు పరిచయమే. కచ్చితంగా వర్కవుట్ అయ్యే వినూత్నమైన వ్యాపార ఆలోచనలు ఉన్నా.. పెట్టుబడులు లేక ఆగిపోయే యువత మనదేశంలో ఎందరో ఉన్నారు. దేశంలోని పెద్ద వ్యాపార వేత్తలకు తమ ఐడియాలు వినిపించే అవకాశం ఒక రియాలిటీ షో ద్వారా వస్తే.. అనే సరికొత్త ఆలోచనే ఈ షార్క్ ట్యాంక్ రియాలిటీ షో.
ఈ షార్క్ ట్యాంక్ షో ద్వారా వినూత్నమైన ఐడియాలు ఉన్న యువత తమ ఆలోచనలను దేశంలోని బడా వ్యాపారవేత్తలకు వినిపించి వారిని మెప్పించి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది. ఈ షో 30వ ఎపిసోడ్‌లో ఔత్సాహికులు వినిపించిన వ్యాపార ఆలోచనలు వీక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తాయి.
కొంతమంది ఔత్సాహిక వ్యాపారులు బలమైన వ్యాపార ఆలోచనలను వినిపించగా.. మరి కొందరు విచిత్రమైన ఆలోచనలతో విమర్శకులను, అలాగే పెట్టుబడి దారులను కూడా ఆకర్షించారు. ఈ షోను మొదట 2001లో జపాన్‌లో లాంచ్ చేశారు. నిపోన్ టీవీలో ‘టైగర్స్ ఆఫ్ మనీ’ పేరుతో ఈ షో ఎయిర్ అయింది. ఆ తర్వాత 2005లో డ్రాగన్స్ డెన్ పేరుతో యూకేలో 2005లో రూపొందించారు. ఆ తర్వాత 2009లో అమెరికాలో కూడా ప్రారంభించారు. 13 సీజన్ల నుంచి నిర్విరామంగా ఈ షో అమెరికాలో జరుగుతూనే ఉంది.
దీని హక్కులను మనదేశంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ దక్కించుకుంది. వినియోగదారులను ఎంటర్‌టైన్ చేస్తూనే.. వారికి విభిన్నమైన వ్యాపార ఆలోచనలు అందిస్తూ ఉండటంతో..ఈ షోకి మంచి ఆదరణ లభించింది. ‘బదల్తే భారత్ కీ నయీ సోచ్’ అనే ట్యాగ్ లైన్‌తో సోనీ ఈ షోను ప్రమోట్ చేస్తుంది.
ఈ షో మనదేశంలో ప్రస్తుతం చివరి దశలో ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఔత్సాహిక వ్యాపారులకు ఇది మంచి వేదికగా మారింది. ఇందులో పెట్టుబడులు పెట్టే వారిని ‘జడ్జిలు’ లేదా ‘షార్క్’లుగా పిలుస్తారు. ఎవరైనా మంచి వ్యాపార ఆలోచనలు ఉన్నవారు ఈ షోకు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు.
ఈ బిజినెస్ షోకి రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
1. మొదటగా www.sharktank.sonyliv.com వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి. లేదా సోనీ లివ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. అక్కడ మీ మొబైల్ నంబర్ టైప్ చేసి ఆరు అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
3. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మీకు కావాల్సిన భాషను ఎంచుకోవచ్చు.
4. నియమ నిబంధనలు అంగీకరించాక.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
5. మీ వ్యాపార మోడల్‌కు సంబంధించిన వివరాలను అక్కడ అందించాలి. అందులో మీ వ్యాపారానికి సంబంధించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించాలి.
6. అయితే మీ బిజినెస్ ఐడియాను ఒక్క వాక్యంలోనే అందించాలి. బిజినెస్ ప్లాన్‌కు సంబంధించిన సమ్మరీ 250 పదాల లోపే ఉండాలి. అయితే మీరు ఏవైనా ఫొటోలు కావాలంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు.
అశ్నీర్ గ్రోవర్ (భారత్ పే యజమాని), నమితా థాపర్ (ఎంక్యూర్ ఫార్మా), అనుపమ్ మిట్టల్ (షాదీ.కాం), వినీతా సింగ్ (సుగర్ కాస్మొటిక్స్), ఘజల్ అలగ్ (మామాఎర్త్), పీయూష్ బన్సల్ (లెన్స్‌కార్ట్), అమన్ గుప్తా (బోట్)లు ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరిని మెప్పిస్తే మీ వ్యాపారానికి పెట్టుబడి దొరికినట్లే అన్నమాట.