Gold Rates: పసిడి కోసం ఎగబడుతున్న కేంద్ర బ్యాంక్‌లు - బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం!
Gold Reserves: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 81 శాతం సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను ఎప్పటికప్పుడు పెంచుకుంటామని ప్రకటించాయి.
Gold Price: బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి, రాబోయే రోజుల్లో మరింత బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంక్‌లన్నీ పసిడి కోసం పాకులాడడమే దీనికి కారణం. తీవ్రమైన ఆర్థిక తుపాన్లను సరిహద్దుల అవతలే అడ్డుకుని, మొత్తం దేశాన్ని రక్షించే శక్తి స్వర్ణానికి ఉంది. అందుకే పసిడి గిరాకీ నానాటికీ పెరుగుతోంది.
భారతదేశంలో బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు 2023 సంవత్సరంలో 1037 టన్నుల బంగారం కొన్నాయి. 2022లో రికార్డ్ స్థాయిలో కొన్న 1082 టన్నుల తర్వాత ఇదే రెండో అతి పెద్ద కొనుగోలు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఆర్థిక అస్థిరతల కారణంగా ఎల్లో మెటల్‌కు డిమాండ్ పెరుగుతోంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, రాబోయే 12 నెలల్లో వివిధ సెంట్రల్ బ్యాంకులు మరింత బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ సప్లై-డిమాండ్ మధ్య ఇప్పటికే భారీ గ్యాప్ ఉంది. సెంట్రల్ బ్యాంక్‌ల ఆసక్తి ఫలితంగా ఆ డిమాండ్ నానాటికీ పెరుగుతోంది గానీ, అదే స్థాయిలో సప్లై పెరగడం లేదు. ఫలితంగా, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2024
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఈ ఏడాది ఫిబ్రవరి 19 - ఏప్రిల్ 30 తేదీల మధ్య నిర్వహించిన "సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే 2024" రిపోర్ట్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ సర్వేలో 69 కేంద్ర బ్యాంక్‌లు పాల్గొని, తమ ప్లాన్స్ గురించి చెప్పాయి. వాటిలో.. 29 శాతం సెంట్రల్ బ్యాంకులు రాబోయే 12 నెలల్లో మరింత పసిడి కొని, తమ బంగారం నిల్వలను (Gold Reserves) పెంచుకుంటామని చెప్పాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇలాంటి సర్వేలను 2018లో ప్రారంభించింది. ఈ సర్వే ప్రారంభమైన తర్వాత, ఎల్లో మెటల్ నిల్వల పెంపు గురించి సెంట్రల్ బ్యాంకులు ఇంత పెద్ద సంఖ్యలో రెస్పాండ్ కావడం ఇది రెండోసారి.
అయితే, సెంట్రల్ బ్యాంక్‌లు ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనడం లేదు. ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఆయా దేశాల్లో ఉత్పత్తి అవుతున్న పసిడి పరిమాణం, ఆర్థిక ఆందోళనలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. ఒక పక్కా ప్లాన్ రూపొందించుకుని, దాని ప్రకారమే గ్లోబల్ మార్కెట్ నుంచి పసిడిని కైవసం చేసుకుంటున్నాయి.
పసిడి నిల్వల పెంపు వైపు మొగ్గిన సెంట్రల్ బ్యాంకులు
సర్వేలో పాల్గొన్న 69 సెంట్రల్ బ్యాంకుల్లో 81 శాతం బ్యాంక్‌లు బంగారం నిల్వలు పెంచుకుంటామని చెప్పగా, 19 శాతం బ్యాంక్‌లు తమ నిల్వల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 2023లో పెంచుకున్న పసిడి భాండాగారం గురించి 71 శాతం సెంట్రల్ బ్యాంకులు వివరించాయి. వచ్చే ఐదేళ్లలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటాను పెంచుతామని 69 శాతం కేంద్ర బ్యాంకులు తెలిపాయి.
బంగారం కొనుగోళ్ల పరంగా, ప్రపంచంలోని టాప్-5 సెంట్రల్ బ్యాంకుల్లో మన దేశ కేంద్ర బ్యాంక్ (RBI) ఒకటి.
మరో ఆసక్తికర కథనం: బంగారం కొనేవాళ్లకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి