Gautam Adani: సుప్రీంకోర్టు కీలక ఆదేశంపై గౌతమ్ అదానీ ఏమన్నారంటే?
మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే (AM Sapre) నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశం ఇచ్చింది.
Gautam Adani: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన బ్లాస్టింగ్ నివేదిక నేపథ్యంలో జరిగిన 'అదానీ స్టాక్స్‌లో ధరల పతనం'పై (stock price crash in Adani stocks) విచారణ చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని (SEBI) సుప్రీంకోర్టు ఆదేశించింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత చాలా తలనొప్పులు ఎదుర్కొని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు, హర్షం వ్యక్తం చేశారు.
"గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్ స్వాగతించింది. కాల పరిమిత విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. నిజం గెలుస్తుంది" అని 60 ఏళ్ల అహ్మదాబాద్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
The Adani Group welcomes the order of the Hon'ble Supreme Court. It will bring finality in a time bound manner. Truth will prevail.
— Gautam Adani (@gautam_adani) March 2, 2023
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక & అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరల పతనంపై సుప్రీంకోర్టులో నాలుగు వ్యాజ్యాలు (PILs) దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెంచ్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే (AM Sapre) నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఇవాళ (గురువారం, 02 మార్చి 2023) కీలక ఆదేశం ఇచ్చింది. ఈ కమిటీని సెబీ ఏర్పాటు చేస్తుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన 'మోసం ఆరోపణల'తో జరిగిన అదానీ గ్రూప్ షేర్ల క్రాష్‌పై రెండు నెలల్లోగా విచారణను ముగించాలని సెబీకి సుప్రీంకోర్టు సూచించింది. సెబీ నిబంధనల్లోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే అంశాలు సహా స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వివిధ నిబంధనలపై దర్యాప్తు జరగాలని అత్యున్నత న్యాయస్థానం సెబీని ఆదేశించింది.
ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ
విచారణ కమిటీ నియామకం కోసం సుప్రీంకోర్టు సూచించిన నిపుణుల బృందంలో... సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏఎం సప్రేతో పాటు, వ్యాపార రంగాల్లో దిగ్గజ వ్యక్తులైన కేవీ కామత్ (KV Kamath), నందన్ నీలేకని (Nandan Nilekani) సోమశేఖరన్ సుందరన్ (Somasekharan Sundaran), ఓపీ భట్ (OP Bhat), జేపీ దేవదత్ (JP Devdatt) సభ్యులుగా ఉంటారు. రెండు నెలల్లోగా నివేదికను సమర్పించేందుకు, ఈ ప్యానెల్‌కు అన్ని విధాలా సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక చట్టబద్ధ సంస్థలు, సెబీ చైర్‌పర్సన్‌ను సుప్రీంకోర్ట్ బెంచ్ ఆదేశించింది.
కోర్టు ఆదేశం వెలువడిన తర్వాత, మొత్తం 10 అదానీ స్టాక్‌లు ఇవాళ గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నాలుగు అదానీ స్టాక్స్ - అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ (Adani Green), అదానీ విల్మార్ (Adani Wilmar), అదానీ పవర్ (Adani Power) 5% జంప్ చేసి, అప్పర్ సర్క్యూట్ పరిమితుల్లో లాక్ అయ్యాయి.
అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) ఇవాళ ఉదయం 10% నష్టపోయినా, తిరిగి లాభాల్లోకి వచ్చింది, ప్రస్తుతం 2% గెయిన్స్‌లో ఉంది. ఈ స్టాక్ గత 2 రోజుల్లో 31% ర్యాలీ చేసింది.
2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాతి నుంచి నెల రోజుల వ్యవధిలో, అదానీ గ్రూప్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పైగా తగ్గింది, పెట్టుబడిదార్లు దాదాపు రూ. 12 లక్షల కోట్లు నష్టపోయారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.