PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన పేరిట మెసేజ్ - ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అంతే సంగతులు!
PM Kisan Yojana Scam: ఈ పథకం కింద లబ్ధి పొందే పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. మోసం ఎలా జరుగుతోందో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.

Fraudulent Links Of PM Kisan Kisan Yojana: భారత ప్రభుత్వం దేశ ప్రజలకు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం అందజేస్తోంది. వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విభిన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు కూడా కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తోంది. దీనిలో భాగంగా, భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన'ను ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హుడైన ప్రతి రైతుకు ఏటా రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోంది.
రైతులకు అందజేసే రూ. 6,000 మొత్తాన్ని మూడు విడతలుగా, ఒక్కో విడతలో రూ. 2,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ పథకం కింద, ఇప్పటి వరకు, మొత్తం 18 వాయిదాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు 19వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ పథకాన్ని ఉపయోగించుకుని రైతులను మోసం చేస్తున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా వినవస్తున్నాయి. రైతులంతా గ్రామీణ ప్రాంత వాసులు కావడంతో వాళ్ల అమాయకత్వం నేరగాళ్లకు అలుసుగా మారుతోంది. మోసం ఎలా జరుగుతోందో తెలుసుకుంటే మీ డబ్బును ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో తెలుస్తుంది.
రైతులను ఇలా మోసం చేస్తున్నారు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు ఇంకా విడుదల కాకపోయినప్పటికీ, కొందరు రైతుల మొబైల్ ఫోన్ నంబర్లకు సైబర్ దుండగులు మోసపూరిత లింక్‌లతో కూడిన SMSలు, వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. 'పీఎం కిసాన్ యోజన కింద ప్రయోజనాలను పొందేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి' అని ఆ సందేశాల్లో రాసి ఉంటుంది. ఆ లింక్ ప్రభుత్వం నుంచి వచ్చిందేనని నమ్ముతున్న చాలా మంది రైతులు, ఆ లింక్‌పై క్లిక్ చేస్తున్నారు. లింక్ మీద నొక్కిన వెంటనే, వారి స్క్రీన్ మీద ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలని ఉంటుంది. అందులో అడిగిన వివరాలను నింపితే, దుండగులు OTP కూడా అడుగుతారు. OTPని అవతలి వ్యక్తికి షేర్ చేసిన వెంటనే ఆ రైతు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది. తాజాగా, హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఈ విధంగా మోసపోయి దాదాపు రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.
మోసాన్ని ఈ విధంగా నివారించండి..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరిట భారత ప్రభుత్వం ఏ రైతుకు లేదా ఏ వ్యక్తికి సందేశాలు పంపదు. కిసాన్ యోజన పేరుతో మీకు ఇలాంటి మెసేజ్ వస్తే ఏదో మోసం జరుగుతోందని వెంటనే అర్థం చేసుకోండి. మీకు తెలియని ఫోన్ నంబర్ నుంచి వచ్చే ఎలాంటి అనుమానిత లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎవరికీ, ఎప్పుడూ షేర్ చేయవద్దు. ఏ బ్యాంక్ అధికారి గానీ, ప్రభుత్వ అధికారి గానీ ఎప్పుడూ OTPని అడగరు అని గుర్తుంచుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. మీకు తెలియని లింక్‌ను క్లిక్ చేయవద్దు, మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయవద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఎయిర్‌టెల్ యాప్‌లో బజాజ్ ఫైనాన్స్ లోన్లు - రుణం తీసుకోవడం ఇంకా ఈజీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

