Forex Reserves: రెండున్నరేళ్ల తర్వాత రికార్డ్ బద్ధలు, చారిత్రాత్మక స్థాయిలో ఫారెక్స్ నిల్వలు
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పటిష్టతతో పాటు ఎగుమతుల రంగంలో బలాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు.
Foreign Currency Reserves in India: భారత ప్రభుత్వ ఖజానాలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైనట్లుంది. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు (India's Forex Reserves) సరికొత్త చరిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు గరిష్టంగా 645.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశం అనంతరం ఈ సమాచారాన్ని ప్రకటించారు.
రికార్డ్ స్థాయిలో విదేశీ మారక నిల్వలు
29 మార్చి 2024తో ముగిసిన వారంలో, భారతదేశంలోని విదేశీ మారక నిల్వలు 645.6 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. అంతకుముందు వారంలో (22 మార్చి 2024తో ముగిసిన వారంలో) ఇవి 642.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే, గత వారం రోజుల్లోనే ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపు 3 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పటిష్టతతో పాటు ఎగుమతుల రంగంలో బలాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు.
విదేశీ మారక నిల్వలు 645.6 బిలియన్ డాలర్లకు చేరడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డ్ 645 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 అక్టోబర్ నెలలో ఇది సాధ్యమైంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ రికార్డ్ బద్ధలైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల తగ్గిన నిల్వలు
2021 అక్టోబర్‌లో గరిష్ట స్థాయిలో ఉన్న విదేశీ మారక నిల్వలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశం నుంచి బయటకు డాలర్ల ప్రవాహం కారణంగా నిల్వలు పడిపోయాయి. ఒకదశలో, ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ 524 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయని, ఆర్‌బీఐ ఏం చేస్తోందంటూ అప్పుడు ఆందోళనలు వ్యక్తమయ్యాయని, ప్రశ్నల వర్షం కురిపించారని గవర్నర్ అన్నారు. ఆస్తుల మదింపులో మార్పులు, దేశీయ కరెన్సీని బలోపేతం చేయడానికి మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వంటివి చేస్తున్నట్లు తాము అప్పుడే చెప్పినట్లు దాస్ గుర్తు చేశారు. ఫారెక్స్ రిజర్వ్స్ పెంచడానికి చాలా మంచి పద్ధతులు ఉపయోగిస్తున్నట్లు అప్పుడే వివరించామన అన్నారు.
భారత్‌లోకి డాలర్ల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కొనసాగుతుందని చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్.. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ నిల్వలు ఉండాలని ఆర్‌బీఐ కోరుకుంటోందని వివరించారు.
రూపాయి మారకం విలువను మార్కెట్ నిర్ణయిస్తుందన్న వైఖరికి ఆర్‌బీఐ కట్టుబడి ఉందని దాస్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో, కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు & అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల్లోని హెచ్చుతగ్గులతో పోలిస్తే భారత రూపాయి చాలా గట్టిగా నిలబడిందని, దాదాపుగా ఒక శ్రేణికి లోబడే కదలాడిందని అన్నారు. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి అత్యంత స్థితిస్థాపకత ప్రదర్శించిందని వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: రూ.71,000 దాటిన గోల్డ్, వెండిదీ అదే స్పీడ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి