FPIs: ఫారిన్ ఇన్వెస్టర్లలో పూనకాలు, ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు
సెన్సెక్స్ దాదాపు 2,121 పాయింట్లు లేదా 3.60 శాతం లాభపడగా, నిఫ్టీ50 705 పాయింట్లు లేదా 4.06 శాతానికి పైగా లాభపడింది.
FPIs Investment in April: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో (Foreign portfolio investors) పూనకాలు లోడ్ అవుతున్నాయి. గత నెల, ఏప్రిల్‌లో షేర్ మార్కెట్‌లో విపరీతంగా కొనుగోళ్లు జరిపారు. మొత్తంగా, ఏప్రిల్ నెలలో గరిష్టంగా రూ. 11,631 కోట్ల పెట్టుబడులు పెట్టారు, నెట్ బయ్యర్స్‌గా నిలిచారు. గత నాలుగు నెలల్లో ఇది గరిష్ట మొత్తం. అంతేకాదు, విదేశీ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్స్‌గా ఉండడం వరుసగా ఇది రెండో నెల.
ఐటీ రంగంలోని టెక్ దిగ్గజ కంపెనీల స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరిగినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరిచారు. స్థూలంగా, ఏప్రిల్ నెలలో భారతీయ మార్కెట్లో FPI పెట్టుబడుల స్థూల విలువ రూ. 13,545 కోట్లు. ఇందులో ఈక్విటీలతో పాటు డెట్, డెట్-VRR వంటివి కలిసి ఉన్నాయి.
బలం చూపించిన ఇండెక్స్‌లు
FPIల సాయంతో, ఏప్రిల్ నెలలో సెన్సెక్స్ & నిఫ్టీ50 రెండూ స్థితిస్థాపక పనితీరు కనబరిచాయి. ఆ నెలలో సెన్సెక్స్ దాదాపు 2,121 పాయింట్లు లేదా 3.60 శాతం లాభపడగా, నిఫ్టీ50 705 పాయింట్లు లేదా 4.06 శాతానికి పైగా లాభపడింది.
FPI కొనుగోళ్ల ఫలితంగా... 50 స్టాక్స్ ఉన్న నిఫ్టీ50 ఇండెక్స్‌ను 12 స్టాక్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అధిగమించింది. ప్రస్తుతం, నిఫ్టీ50 దాని రికార్డు గరిష్ట స్థాయి 18,887.6 పాయింట్లకు 4.55% దూరంలో ట్రేడవుతుండగా, బ్యాంక్ నిఫ్టీ దాని రికార్డు గరిష్ట స్థాయి 44,151.8కి కేవలం 2.2% దూరంలో మాత్రమే ఉంది.
గత నవంబర్‌లో ఫారిన్ ఇన్వెస్టర్ల ₹36,239 కోట్ల పెట్టుబడి తర్వాత, మళ్లీ ఏప్రిల్ కొనుగోళ్లు అత్యధికం. నవంబర్ కొనుగోళ్ల ప్రభావం కొనసాగి, డిసెంబర్ 1న నిఫ్టీ రికార్డు స్థాయిలో 18,887.6కి చేరింది.
షార్ట్స్ కవరింగ్ కూడా కారణం
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ర్యాలీకి ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో FPIల షార్ట్స్ కవరింగ్ కూడా కారణం. ఎఫ్‌పీఐల లాంగ్-షార్ట్ రేషియో కొన్ని వారాల క్రితం చూసిన 90% ప్లస్ స్థాయి నుంచి ఇప్పుడు 55%కు పడిపోయింది.
2022 డిసెంబరులో ₹11,119 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన తర్వాత, 2023 జనవరి & ఫిబ్రవరి నెలల్లో FPIలు నికర అమ్మకందార్లుగా మారారు. జనవరిలో ₹28,852 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, ఫిబ్రవరిలో ₹5,294 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. దీంతో, మార్చి 20న నిఫ్టీ 16,828 కనిష్ట స్థాయికి పడిపోయింది. రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి 11% వరకు పతనం అయింది. ఇది, FPIల కొనుగోళ్లను మరోసారి ప్రోత్సహించింది. అప్పటి నుంచి ఏప్రిల్ 28 వరకు, నిఫ్టీ 7% కోలుకుని 18,065 వద్ద ముగిసింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు పెద్ద పీట
ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో, FPI ఇన్‌ఫ్లోస్‌లో ఎక్కువ భాగం ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోకి (బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ లెండర్స్) వెళ్లాయి. ఆ 15 రోజుల్లో ₹4410 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆటో & ఆటో కాంపోనెంట్స్ (₹1,259 కోట్లు), IT (₹1,002 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (₹408 కోట్లు) ఉన్నాయి.
రూపాయి బలపడటం కూడా విదేశీ పెట్టుబడిదార్లను ఆకర్షించింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో డాలర్‌తో పోలిస్తే 82.94 కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి, ఇప్పుడు లాభపడి 81.75 వద్ద ఉంది. భారతదేశ కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పడుతోంది, ఇదే ధోరణి కొనసాగితే రూపాయి విలువ మరింత పెరగవచ్చు. ఈ నేపథ్యంలో FPIలు భారతదేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే అవకాశం ఉంది.
మార్కెట్ మూడ్‌ను ప్రతిబింబించే ఇండియా విక్స్ (India Vix), ఒక నెల క్రితం స్థాయి 13.63 నుంచి ప్రస్తుతం 10.95 స్థాయికి, 20% క్షీణించింది. 52 వారాల కనిష్ట స్థాయి 10.17కి సమీపంలో ఉంది. కాబట్టి, సెంటిమెంట్ పరంగా ఇన్వెస్టర్లు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.