Trillionaire: బిలియనీర్లను చూశాం, తొలి ట్రిలియనీర్ ఎప్పుడు పుడతాడో తెలుసా?
ఈ సంపద ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల GDP కంటే ఎక్కువ.
First Trillionaire In The World: ప్రపంచంలోని ధనవంతుల ఆస్తిపాస్తులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం, చాలా మంది సంపన్నులు బిలియన్ల డాలర్లు సంపాదించి బిలియనీర్లుగా మారారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకోలేదు, ట్రిలియనీర్‌గా మారలేదు. అయితే, మొట్టమొదటి ట్రిలియనీర్‌ను ఈ ప్రపంచం త్వరలోనే చూడబోతున్నట్లు చెబుతూ ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. మరో పదేళ్లలో, ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్ అవతరిస్తాడని ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ (Oxfam Report) పేర్కొంది.
టాప్-5 బిలియనీర్ల మొత్తం సంపద 869 బిలియన్ డాలర్లు
ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం... టెస్లా CEO ఎలాన్ మస్క్ (Elon Musk), LVMH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison), సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) మొత్తం సంపద 2023 నవంబర్ నాటికి 869 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2020 మార్చిలో ఇది 405 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ప్రకారం, ఈ పంచ సంపన్నుల డబ్బు ప్రతి గంటకు 14 మిలియన్ డాలర్లు పెరిగింది.
టాప్-10లోని 7 కంపెనీల బాస్‌లు బిలియనీర్లు
ప్రపంచంలోని 10 అతి పెద్ద కంపెనీల్లో, 7 కంపెనీల CEOలు లేదా ప్రధాన వాటాదార్లు బిలియనీర్లుగా ఉన్నారు. ఈ కంపెనీల మొత్తం సంపద 10.2 ట్రిలియన్ డాలర్లు. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ప్రకారం, ఈ సంపద ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల GDP కంటే ఎక్కువ.
బిలియనీర్ల బొక్కసాలు నింపిన సంక్షోభాలు
ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ చెప్పిన ప్రకారం... ఇది విభజన దశాబ్దానికి నాంది. మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఆ తర్వాత వచ్చిన యుద్ధాలు కోటీశ్వరులకు (Billionaires in the world) కలిసి వచ్చాయి, వారి ఖజానాలు నింపాయి, శ్రీమంతుల ఇళ్లను బంగారుమయం చేశాయి. పేదలను మరింత నిరుపేదలుగా మార్చాయి. సంక్షోభ సమయాల్లో చవకగా మారిన పెట్టుబడి సాధనాలను ధనవంతులు తెలివిగా ఉపయోగించుకున్నారు. వారి దగ్గర డబ్బుంది కాబట్టి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. సంక్షోభ కాలం సమసిపోగానే ఆ పెట్టుబడుల విలువ అనూహ్యంగా పెరిగింది. సంపద గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు.. ఎంత మూల్యం చెల్లించైనా సరే, ఎక్కువ సంపద తమ వద్దకు చేరేలా చూసుకుంటున్నారు. డబ్బు లేని వ్యక్తులు పెట్టుబడులు పెట్టలేక ఎప్పటికీ పేదలుగానే బతుకుతున్నారు.
కొవిడ్-19 తర్వాత 3.3 ట్రిలియన్లు పెరిగిన బిలియనీర్ల సంపద
2020 నుంచి ఇప్పటి వరకు, ప్రపంచంలోని టాప్ 5 ధనవంతుల సంపద దాదాపు రెట్టింపు అయ్యింది. గత 229 ఏళ్లుగా పేదరికం నిర్మూలన జరగలేదని కూడా నివేదిక వెల్లడించింది. నోచుకోవడం లేదు. కొవిడ్-19 మహమ్మారి ముందు, ఇప్పుడు కూడా పేదల పరిస్థితి అలాగే ఉంది. బిలియనీర్ల సంపద 2020 నుంచి ఇప్పటి వరకు రూ. 3.3 ట్రిలియన్లు పెరిగింది, ద్రవ్యోల్బణం కంటే మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ ఆకాశంలోకి గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే