CWD Shares: ధనలక్ష్మికి జిరాక్స్ లాంటి స్టాక్ ఇది, ఏడాదిలో ఏకంగా 1100% పెరిగింది!
ఇష్యూ ప్రైస్ రూ.180తో పోలిస్తే ఇప్పటివరకు 1,078 శాతం పెరిగింది.
CWD Shares: ఇవాళ్టి (శుక్రవారం) వీక్ మార్కెట్‌లోనూ సీడబ్ల్యూడీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (CWD Manufacturing Private Limited) షేర్లు 5 శాతం పెరిగి రూ.2,121 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 7న తాకిన మునుపటి గరిష్టం రూ.2,040ని తాజాగా అధిగమించింది.
గతేడాది అక్టోబర్ 13న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇష్యూ ప్రైస్ రూ.180తో పోలిస్తే ఇప్పటివరకు 1,078 శాతం పెరిగింది.
ఈ స్టాక్ గత నెల రోజుల్లో 11 శాతం పెరిగింది. గత ఆరు నెలల కాలంలో 200 శాతం పైగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 800 శాతం పైగా లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది.
ధనలక్ష్మి ఆధార్ కార్డ్
ఈ లెక్కలు చదువుతుంటే, ధనలక్ష్మి ఆధార్ కార్డ్‌లా ఈ స్టాక్ కనిపిస్తోంది కదా. దీనిని కొనేద్దామని ఆలోచిస్తున్నారా? తొందరపడకుండా ముందీ విషయం తెలుసుకోండి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE) "MS" గ్రూప్ కింద, SME సెగ్మెంట్‌లో CWD ట్రేడ్ అవుతోంది. BSE SME స్క్రిప్‌లను "M" గ్రూప్ (నికర ప్రాతిపదికన ట్రేడింగ్, క్లియరింగ్ & సెటిల్‌మెంట్ జరుగుతుంది) కింద, "MT" గ్రూప్ కింద (స్థూల ప్రాతిపదికన వ్యాపారం మరియు క్లియరింగ్ & సెటిల్‌మెంట్ జరుగుతుంది) లిస్ట్ అవుతాయి.
CWD అంటే కనెక్టెడ్ వైర్‌లెస్ డివైసెస్. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ఆధారిత కంపెనీ. సాఫ్ట్‌వేర్ & ఎలక్ట్రానిక్స్ శక్తిని కలిపే ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్‌ను ఇది డిజైన్ చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, విక్రయిస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే అన్ని ఉత్పత్తులు వైర్‌లెస్ సాంకేతికత ఆధారంగా పని చేస్తాయి. NFC, బ్లూటూత్ BLE, WiFi, Zigbee వంటి షార్ట్ రేంజ్ రేడియో టెక్నాలజీ, LORA వంటి మిడ్ రేంజ్ సిస్టమ్స్, 5G LTE, NB-IOT, LTE CAT M1 వంటి లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ దీని ప్రొడక్ట్స్‌లో కొన్ని.
ప్రధానంగా.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్పేస్‌లో CWD బిజినెస్ చేస్తోంది. వివిధ సంస్థలు, వ్యాపారాల కోసం సాంకేతిక పరిష్కారాలను రూపొందించి, అభివృద్ధి చేసి అందిస్తోంది.
స్మార్ట్ మెడికల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, వ్యాక్సిన్ ట్రాకింగ్ &డెలివరీ, వ్యవసాయ పశువుల కదలికలు, ఆరోగ్యం రెండింటి మీద నిఘా పెట్టే ట్రాకింగ్ డివైజ్‌లు, ఎలక్ట్రిక్ పవర్ మీటర్‌ను స్మార్ట్ పవర్ మీటర్‌గా మార్చే ఎలక్ట్రానిక్స్, ఇంకా చాలా ఉత్పత్తులతో కూడిన డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను కంపెనీ రన్ చేస్తోంది.
పాజిజివ్ ట్రిగ్గర్స్
ఇంటర్నెట్ వ్యాప్తిలో వేగం కారణంగా మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. CWD షేర్లను రాకెట్లలా మార్చిన ట్రిగ్గర్స్‌లో ఇదొక కారణం.
'మేక్ ఇన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'స్టార్ట్ అప్ ఇండియా' కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీకి భారత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల కూడా CWD విపరీతమైన లబ్ధి పొందుతోంది.
2022 మార్చి 31 నాటికి ఉన్న లెక్క ప్రకారం CWD ఔట్ స్టాండింగ్ ఈక్విటీ షేర్లు (ప్రమోటర్లు కాకుండా ఇతరుల చేతుల్లో ఉన్న షేర్లు) చాలా తక్కువగా, 3.61 మిలియన్లుగా ఉన్నాయి. ప్రమోటర్లకు కంపెనీలో 72.29 శాతం వాటా ఉంది. మిగిలిన 27.71 శాతం... వ్యక్తిగత వాటాదారుల వద్ద (14.40 శాతం), సంస్థాగత పెట్టుబడిదారుల వద్ద (13.31 శాతం) ఉంది. వ్యక్తిగత పెట్టుబడిదారుల్లో పొపట్ లాల్ తారాచంద్ జైన్ & కుటుంబానికి 7.76 శాతం వాటా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.