Train Tickets Insurance: ట్రైన్ టిక్కెట్ బుకింగ్ సమయంలో చేస్తున్న ఒక్క తప్పుతో ₹10 లక్షలు అందకుండా పోతున్నాయి
55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది.
Train Tickets Insurance: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రతిరోజూ 13,169 ప్యాసింజర్ రైళ్లు (లాంగ్ డిస్టాన్స్, సబర్బన్ మార్గాల్లో) నడుస్తున్నాయి. ఇవి, దేశవ్యాప్తంగా 7,325 స్టేషన్లను కలుపుతూ 1,15,000 కి.మీ. కవర్ చేస్తుంటాయి. ప్రతిరోజూ 2.30 కోట్లకు పైగా ప్రజలు భారతీయ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇది ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు సమానం.
రైల్వేలో సగటున రోజుకు 5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో 55% టిక్కెట్లను రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ప్రజలు కొంటుండగా, 37% టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. 8% టికెటింగ్ ఏజెంట్ల ద్వారా జరుగుతోంది.
మీరు కూడా తరచూ రైలు ప్రయాణం చేస్తున్నా, లేదా ఎప్పుడైనా ప్రయాణం పెట్టుకున్నా, ఇప్పుడు చెప్పబోయే అతి ముఖ్యమైన విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు రైలు ప్రయాణం చేసినా, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకుని ఉండరు. రైలు ప్రయాణం కోసం మీరు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీన్ని టిక్ చేయండి. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే (అమంగళం ప్రతిహతం అవుగాక), ఈ బీమా మీకు లేదా మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను టపాటపా బుక్ చేసుకునే ప్రయాణికుల్లో చాలామంది రైల్వే ప్రయాణ బీమా ఆప్షన్‌ను ఎంచుకోవడం లేదు. దీనికి, నాకు ఏం కాదులే అన్న దీమా ఒక కారణమైతే, అసలు ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందని తెలియకపోవడం ప్రధాన కారణం. బీమా కోసం మీరు చెల్లించాల్సిన మొత్తం ఒక్క రూపాయి కన్నా తక్కువగా (మీరు చదివింది నిజమే) ఉంటుంది. దురదృష్టవశాత్తూ రైలు ప్రమాదం జరిగితే, బీమా తీసుకున్న ప్రయాణీకుడికి 10 లక్షల రూపాయల వరకు కవరేజ్ అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణీకుడికి కలిగే ప్రమాదానికి ప్రతిగా బీమా కంపెనీ పరిహారం ఇస్తుంది.
నామినీ పేరు తప్పనిసరి
రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేస్తున్నప్పుడు.. వెబ్‌సైట్‌లో, యాప్‌లోనూ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి చెల్లించే మొత్తం ఒక్క రూపాయి కన్నా తక్కువ కాబట్టి, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ బీమా ఎంపికను ఎంచుకోండి. ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఈ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటేనే బీమా క్లెయిమ్ పొందడం సులభం.
ఎంత క్లెయిమ్ పొందుతారు?
రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్న సందర్భంలో, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే (అమంగళం మళ్లీ ప్రతిహతం అవుగాక), అతని కుటుంబానికి బీమా మొత్తం రూ.10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తిగా అంగవైకల్యం చెందినా బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయం అయితే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ రైలు ప్రమాదం జరిగితే, గాయపడిన వ్యక్తి, నామినీ లేదా అతని వారసుడు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు.
భారతీయ రైల్వే అందిస్తున్న ఈ ఫెసిలిటీని మీరు గతంలో పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇకపై మాత్రం మరిచిపోవద్దు. మీరు చూపే చిన్నపాటి శ్రద్ధ, మీ కుటుంబానికి రక్ష.