Rs 2000 Notes: రూ.2,000 నోట్లను ఇంకా మార్చుకోలేదా?, కొత్త ప్రకటన చేసిన ఆర్‌బీఐ
ప్రజల సమయం వృథా కాకుండా కేంద్ర బ్యాంక్ ఒక ఉపాయం చెప్పింది.
RBI Latest Update on Rs 2000 Notes: ప్రజల వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక మార్గాన్ని సూచించింది. పింక్ నోట్లను మార్పుకోవడానికి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో RBI ప్రాంతీయ కార్యాలయాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి తాజా ప్రకటన (RBI latest announcement on 2000 rupees notes) వచ్చింది.
మన దేశంలో 2 వేల రూపాయల నోట్లను వ్యవస్థ నుంచి రిజర్వ్ బ్యాంక్ వెనక్కు తీసుకున్న తర్వాత (withdrawal of Rs 2000 bank notes), 97 శాతం పైగా నోట్లు బ్యాంక్‌ల వద్దకు తిరిగి వచ్చాయి. మిగిలిన దాదాపు 3 శాతం పింక్ నోట్లు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. రూ.2,000 నోట్ల చట్టబద్ధతను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేయకపోయినా, వాటిని ఇప్పుడు ఎవరూ లావాదేవీల కోసం వినియోగించడం లేదు. ఏ సంస్థ/వ్యక్తి పింక్ నోట్లను స్వీకరించడం లేదు. కాబట్టి, రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ ఎవరి దగ్గరైనా ఉంటే... వాటిని గుర్తుగా దాచుకోవడమో లేదా చలామణీలో ఉన్న చిన్న కరెన్సీ నోట్లుగా మార్చుకోవడమో చేయాలి.
రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి/ఖాతాలో జమ చేసేందుకు (deposit/exchange Rs 2,000 notes), ప్రజలు ఇప్పటికీ ఆర్‌బీఐ రీజినల్ ఆఫీస్‌ల దగ్గర భారీ క్యూ కడుతున్నారు, గంటల తరబడి లైన్‌లో నిలబడుతున్నారు. ఈ పని కోసం ప్రజల సమయం వృథా కాకుండా, కేంద్ర బ్యాంక్ ఒక ఉపాయం చెప్పింది. రూ.2000 నోట్ల జమ కోసం దేశంలోని ఏ పోస్టాఫీసునైనా ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.
పోస్టాఫీస్‌ల ద్వారా రూ.2 వేల నోట్ల జమ (deposit of Rs 2,000 notes through post offices)
మీకు దగ్గరలోని పోస్టాఫీస్ నుంచి, దేశంలోని 19 RBI ఇష్యూ ఆఫీసుల్లో దేనికైనా ప్రజలు 2 వేల రూపాయల నోట్లను పంపవచ్చు. ఆన్‌లైన్‌లో లభించే అప్లికేషన్‌ను పూర్తి చేసి, ఆ దరఖాస్తును & ఖాతాలో జమ చేయాలనుకున్న రూ.2 వేల నోట్లను పోస్టాఫీస్‌లో ఇస్తే చాలు. తపాలా సిబ్బంది వాటిని ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు (RBI Issue Office) పంపుతారు. ఆ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. పోస్టాఫీస్ ద్వారా జరిగే ప్రక్రియ కాబట్టి, మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. దీనివల్ల, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది, సమయం మిగులుతుంది.
సెంట్రల్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, రూ.2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి విత్‌డ్రా చేస్తున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. నోట్లను వెనక్కు తీసుకుంది గానీ రద్దు చేయలేదు కాబట్టి అవి ఇప్పటికీ చెల్లుతాయి. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా (Rs 2,000 notes are still legal tender) కొనసాగుతాయని ఆర్‌బీఐ కూడా చాలాసార్లు స్పష్టం చేసింది.
ప్రజల దగ్గర రూ.9,330 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు
RBI రీసెంట్ అప్‌డేట్ ప్రకారం, 2023 చివరి నాటికి పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లు వెనక్కు వచ్చాయి. 2023 మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 డిసెంబర్ 29 నాటికి, 97.38% నోట్లు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంటే, 2023 డిసెంబర్ 29 నాటికి, 2.62% రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. వాటి విలువ రూ.9,330 కోట్ల అని ఆర్‌బీఐ తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి