2000 Rupees Note: 8 నవంబర్ 2016 Vs 19 మే 2023 – రెండు నిర్ణయాల పూర్తి కథనం
8 నవంబర్ 2016న మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు.
2000 Rupees Note: 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం (19 మే 2023) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత దేశంలో కలకలం రేగింది. రూ. 2000 నోటును తక్షణం రద్దు చేయలేదు. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ మధ్య కాలంలో ప్రజలు ఏ బ్యాంకుకు వెళ్లి అయినా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి RBI గడువు ఇచ్చింది. దీxతో పాటు, సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2000 రూపాయల నోట్లు చెలామణిలో ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒకవిధంగా దీనిని పాక్షిక రద్దుగా పరిగణించాలి. ఈ వార్త తర్వాత, 8 నవంబర్ 2016న మోదీ ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు.
నోట్ల రద్దు ప్రకటించిన ప్రధాని
2016 నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు అకస్మాత్తుగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాతి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు పనికిరావని, వాటికి విలువ ఉండదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. కొత్త 500, 2000 నోట్లను తీసుకొస్తామని కూడా మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
డీమోనిటైజేషన్ ప్రభావం ప్రజలపై ఎలా ఉంది?
పెద్ద నోట్ల రద్దుపై అకస్మాత్తుగా ప్రకటన వెలువడిన తర్వాత ప్రజల్లో హడావిడి మొదలైంది. అందరూ, తమ వద్ద ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ఎలాగైనా మార్చుకోవాలని తొందరపడ్డారు. బ్యాంకుల బయట పొడవాటి క్యూలు కనిపించాయి. ఇంత పెద్ద ఎత్తున నోట్ల మార్పిడికి ఆర్బీఐ కూడా సిద్ధంగా లేకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో నోట్ల కొరత ఏర్పడింది. దీంతో పాటు ఏటీఎం బయట కూడా గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చింది, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలా ఎండల్లో నిలబడి కొందరు మృతి చెందారనే వార్తలు కూడా అప్పట్లో తెరపైకి వచ్చాయి.
2023 మార్చిలో, అంటే పెద్ద నోట్ల రద్దు చేసిన 7 సంవత్సరాల తర్వాత, TMC సభ్యుడు అబిర్ రంజన్ బిస్వాస్, 2016 సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ప్రభుత్వం తెలిపింది. 2018లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ, నోట్ల రద్దు కారణంగా దేశంలో నలుగురు చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త నోట్లను తీసుకువచ్చింది. అయితే, నోట్ల సైజులో మార్పు రావడంతో ఏటీఎం వ్యవస్థను కూడా మార్చాల్సి వచ్చింది.
సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవచ్చు
2016 తర్వాత, ఇప్పుడు, మే 19, 2023న RBI మరోసారి అదే తరహా ప్రకటన చేసింది. రూ. 2000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ నోటు ఇప్పటికిప్పుడు రద్దు చేయలేదు కాబట్టి, దీనిని మినీ డీమోనిటైజేషన్‌గా ఆర్థికవేత్తలు పిలుస్తున్నారు.
2023 సెప్టెంబర్ 30 వరకు రూ. 2000 నోటు చెల్లుబాటులోనే ఉంటుందని, ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను ఆ గడువులోగా ఏ బ్యాంక్‌కు వెళ్లి అయినా మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. RBIకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో సైతం రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక విడతలో గరిష్ఠంగా రూ. 20 వేల వరకు మాత్రమే మార్పిడికి అవకాశం కల్పించింది. లావాదేవీల కోసం ఇప్పటికీ ఈ నోట్లను వినియోగించుకోవచ్చని ఆర్‌బీఐ స్పష్టంచేసింది.
రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్, మరో కొత్త నోటును తీసుకువస్తుందా, లేదా అన్నది మాత్రం ప్రకటించలేదు. భవిష్యత్తులో కొత్త నోటును తీసుకువస్తే, దేశవ్యాప్తంగా ఉన్న ATMలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.