Work From Office: ఆఫీస్‌లో 100% పని ఇక చరిత్రే! హైబ్రీడ్ మోడల్‌కే కంపెనీల ఓటు!
Work From Office a History: కొవిడ్ కేసులు తగ్గినా ఐటీ కంపెనీలన్నీ హైబ్రీడ్ మోడల్‌కే (Hybrid Model) ఓటేస్తున్నాయి. ఐటీ కంపెనీలు వారానికి 2 రోజులు ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటున్నాయి.
Work From Office a History: ఆఫీసుల్లో ఉద్యోగులు పూర్తి స్థాయిలో పనిచేయడం ఇకపై హిస్టరీగా మిగలబోతోంది! దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైబ్రీడ్ మోడల్‌కే (Hybrid Model) ఓటేస్తున్నాయి. కొన్నాళ్లుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసులు రావడం లేదు. ప్రజల్లోనూ మహమ్మారిపై భయం తగ్గిపోయింది. దాంతో ఐటీ కంపెనీలు (IT Companies) ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మంటున్నాయి. అయితే హైబ్రీడ్ మోడల్‌నే అనుసరించబోతున్నాయి.
వారంలో రెండు రోజులు
ఇన్ఫోసిస్ కంపెనీ (Infosys) ఉద్యోగులను వారంలో ఒకటీ లేదా రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు రమ్మంటోంది. మిగతా రోజుల్లో ఇంటివద్దే పనిచేయాలని సూచిస్తోంది. టెక్ మహీంద్రా (Tech Mahindra) సైతం ఏప్రిల్ నుంచి వారానికి రెండు రోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఇప్పటికే అనుసరిస్తోన్న హైబ్రీడ్ వర్కింగ్ మోడల్‌ను ఇకపైనా కొనసాగిస్తామని హెచ్‌సీఎల్ టెక్నాలజీ (HCL Technology) అంటోంది. మార్చి 3 నుంచి సీనియర్ ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఆఫీసులకు వస్తారని విప్రో తెలిపింది.
హైబ్రీడ్ మోడల్‌పై ఇంట్రెస్ట్
తమ ఉద్యోగులు ప్రతి రోజు 40-50 శాతం మంది కార్యాలయం నుంచే పనిచేసే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ హెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అంటున్నారు. అంటే ఉద్యోగులంతా హైబ్రీడ్ పని విధానంలో ఉంటారు. ప్రస్తుతానికి ఆ కంపెనీలో 96 శాతం మంది రిమోట్ లొకేషన్లలో పనిచేస్తున్నారు. కొవిడ్ పరిస్థితులు బట్టి రాబోయే 3-4 నెలల్లో దశల వారీగా ఆఫీసులకు వస్తారు. కొందరు పూర్తిగా ఇంటి నుంచే చేస్తారు. మరికొందరు హైబ్రీడ్ మోడల్లో ఉంటారు. ప్రస్తుతం మేనేజర్లు, టీమ్ లీడర్లు వారానికి ఒకట్రెండు రోజులు రావాలని ఇన్ఫోసిస్ కోరుతోంది.
మొదట సీనియర్లు
ఇప్పుడు టెక్ మహీంద్రాలో 18 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి వారానికి కనీసం రెండు రోజులు రావాలని చెబుతోంది. మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ పరిస్థితులను గమనిస్తోంది. ఇప్పటికైతే హైబ్రీడ్ పని విధానంపై తమ స్టాండ్‌ను మార్చుకోలేదు. 'ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే హెచ్‌సీఎల్‌కు అత్యంత ప్రాధాన్యం. క్లైయింట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. హైబ్రీడ్ మోడల్‌నే అనుసరిస్తున్నాం' అని కంపెనీ స్పోక్స్‌పర్సన్ తెలిపారు.
టీసీఎస్ కీలక నిర్ణయం
గత నెల్లో రిమోట్ వర్కింగ్‌పై టీసీఎస్ (TCS) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ బేస్ లోకేషన్‌కు రావాలని ఉద్యోగులకు సూచించింది. 25 by 25 దీర్ఘకాల విజన్‌లో భాగంగా 25 శాతం మందిని మాత్రం ఆఫీసులకు రమ్మంటోంది. ఆ తర్వాత హైబ్రీడ్ పని విధానాన్ని అమలు చేయనుంది. మార్చి 3 నుంచి పూర్తి స్థాయిలో వాక్సినేషన్ పొందిన మేనేజర్లు, టీమ్‌లీడర్లు, సీనియర్లను వారానికి రెండు రోజులు రావాలని విప్రో సూచించింది. మంగళ, గురువారాల్లో వారు రావాల్సి ఉంటుంది.