Laxmi Ganesh on Currency Notes: ధనలక్ష్మి, వినాయకుడి బొమ్మలతో కరెన్సీ నోట్లు! మరి గాంధీ తాత?
కరెన్సీ నోట్ల మీద ధనలక్ష్మి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల డిమాండ్ చేశారు.
Laxmi Ganesh on Currency Notes: భారత దేశ కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మ ఉంటుందని మన దేశంలో ఎవర్ని అడిగినా, గాంధీ తాత బొమ్మ ఉంటుందని చెబుతారు. ఇకపై, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (మహాత్మా గాంధీ అసలు పేరు) గారి ఫొటో లేకుండా కరెన్సీ నోట్లు తీసుకొస్తారా? జాతి పిత ఫొటో స్థానంలో ఎవరి బొమ్మను ముద్రిస్తారు? ఈ మధ్యకాలంలో, మన దేశంలో ఈ విషయం మీద కాస్త చర్చ జరిగింది.
కరెన్సీ నోట్ల మీద ధనలక్ష్మి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల డిమాండ్ చేశారు. అప్పుడు కూడా ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
పార్లమెంటుకు పాకిన చర్చ
కరెన్సీ నోట్ల మీద ధనలక్ష్మి, వినాయకుడి బొమ్మలను ముద్రించాలా, వద్దా అన్న వాదన పార్లమెంట్ దాకా పాకింది. ఈ విషయం మీద ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక వివరణ కూడా ఇచ్చింది. భారత దేశ కరెన్సీ నోట్ల మీద స్వాతంత్ర్య సమరయోధులు ఫొటోలు ముద్రించాలన్న డిమాండ్ మొదలుకొని, ఇతర రంగాల్లోని ప్రముఖ వ్యక్తులు, దేవుళ్లు, దేవతల చిత్రాలను ముద్రించాలన్న అభ్యర్థనలు తమకు అందాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
RBI చట్టం ఏం చెబుతోంది?
మన దేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముద్రిస్తుంది. కరెన్సీ నోటు ముద్రణకు ఉపయోగించే పేపర్, నోటు సైజ్, వినియోగించాల్సిన రంగులు, నోట్ల మీద వేయాల్సిన డిజైన్స్, ముద్రించాల్సిన బొమ్మలు, నోట్ల రూపకల్పనకు వాడాల్సిన సాంకేతికత.. ఇలా ప్రతి విషయానికి సంబంధించి RBI చట్టంలో నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారమే నోట్లను ముద్రిస్తారు. భారత దేశ కరెన్సీ నోట్ల మీద స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ వ్యక్తులు, దేవుళ్లు, దేవతలు, జంతువుల చిత్రాలను ముద్రించాలన్న డిమాండ్లు కొత్తవేమీ కాదు. దశాబ్దాల నుంచి ఇవి ఉన్నాయి. అయితే... RBI చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం... బ్యాంక్ నోట్ డిజైన్, ఫారం, మెటీరియల్ వినియోగానికి సంబంధించి RBI సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేయాలి. ఆ సిఫార్సును పరిశీలించి, జాతి ప్రయోజనాలకు భంగం రాదని, ఎలాంటి వివాదాలకు తావు ఉండదని నిర్ధరించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మార్పులు సాధ్యమవుతాయి.
కరెన్సీ నోట్ల మీద జాతి పిత చిత్రాన్ని తొలగించడంపై స్పష్టత
భారత కరెన్సీ నోట్ల మీద జాతి పిత మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించే విషయం మీద పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటన చేశారు. భారత కరెన్సీ నోట్ల మీద ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించే ఆలోచన గానీ, ప్రణాళిక గానీ ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న గాంధీ సిరీస్ నోట్లే ఇకపైనా కొనసాగుతాయని తేల్చి చెప్పారు.
భారత దేశంలో ప్రస్తుతం చలామణీలో కరెన్సీ నోట్ల మీద ఉన్న మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగిస్తారనే పుకార్లను RBI కూడా గతంలో తిప్పికొట్టింది. అలాంటి ఆలోచనేదీ లేదంటూ ఈ ఏడాది జూన్ 6న ట్వీట్ చేసింది.