Family Pension: ఫ్యామిలీ పెన్షన్ రూల్స్‌లో సంచలన మార్పు, భర్తలకు భారీ షాక్
మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు మరణాంతరం భర్తకు ఫ్యామిలీ పెన్షన్ అందుతోంది. అతడి తదనంతరం వారి పిల్లలకు చెందుతుంది.
Family Pension Nomination Rules Changed: సార్వత్రిక ఎన్నికలకు ముందు, మహిళా ఉద్యోగులకు కొత్త శక్తిని అందిస్తూ, మోదీ ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. సామాజిక-ఆర్థిక చిక్కులకు పరిష్కారం చూపే సంచలన నిర్ణయంగా దీనిని అభివర్ణించొచ్చు. అయితే, మహిళా ఉద్యోగుల భర్తలకు మాత్రం ఇది భారీ షాక్ అవుతుంది.
మారిన ఫ్యామిలీ పెన్షన్ రూల్
కుటుంబ పెన్షన్ల (Family Pension) విషయంలో.. మహిళా ఉద్యోగులు ఇకపై భర్తలకు బదులుగా తమ సంతానానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అంటే.. భర్తను పక్కకు నెట్టి, తన కుమారులు లేదా కుమార్తెలను ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెన్షనర్లకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021లో ఇటీవల చేసిన సవరణ ప్రకారం, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు.. తమ మరణాంతరం కుటుంబ పింఛను పొందేందుకు వారి పిల్లలను నామినేట్ చేయవచ్చు. ఇప్పటి వరకు, మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు మరణాంతరం భర్తకు ఫ్యామిలీ పెన్షన్ అందుతోంది. అతడి తదనంతరం వారి పిల్లలకు చెందుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రకారమే పేర్లను నామినేట్ చేసే వీలుండేది.
తన కష్టార్జితం ఎవరికి చెందాలో నిర్ణయం తీసుకునే సమాన హక్కు మహిళలకు ఉండాలన్న ఉద్దేశంతో, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పు తీసుకొచ్చినట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
మహిళ ఉద్యోగులు లేదా పెన్షనర్లు, ఇకపై, తమ భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛను వచ్చేలా పేర్లు సూచించొచ్చు. దీనికి వీలుగా, 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల (కుటుంబ పింఛను) నిబంధనలను 'కేంద్ర పింఛను, పింఛనుదార్ల సంక్షేమ విభాగం' (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్) సవరించింది.
విభేదాలతో విడిగా ఉంటున్న, విడాకులు తీసుకున్న జంటల విషయంలో కుటుంబ పింఛను అంశం చాలా క్లిష్టంగా మారుతోంది. గృహ హింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, IPC కింద కేసులు నమోదైన సందర్భాల్లోనూ, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటినీ తాజా సవరణ పరిష్కరిస్తుంది.
ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి, ఎప్పుడు చెందుతుంది?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) ప్రకారం, తన మరణానంతరం భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛను అందేలా చూడంలంటే, సదరు మహిళా ఉద్యోగి లిఖితపూర్వకంగా ఆ విషయాన్ని (written request) రాసి ఇవ్వాలి. సంబంధిత ఆఫీస్‌లో దానిని సమర్పించాలి. అప్పుడు, ఆమె తదనంతరం, భర్త జీవించి ఉన్నా, అర్హత గల ఆమె పిల్లలకే ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది. ఒకవేళ, ఆమె మరణించే సమయానికి పిల్లలు మైనర్లు అయినా, మానసిక వైకల్యంతో ఉన్నా.. సంరక్షకుడి స్థానంలో ఉండే ఆ పిల్లల తండ్రికి (ఆమె భర్తకు) పింఛను వెళుతుంది. పిల్లలు మేజర్లు అయిన తర్వాత నేరుగా ఆ పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది.
వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలకు న్యాయమైన, చట్టబద్ధమైన హక్కులను అందించాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా & లింగ సమానత్వం, సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. మహిళలకు చట్టపరమైన సంక్లిష్టతలను తొలగించడమే కాకుండా, స్త్రీ శ్రామిక శక్తికి మరింత సహాయక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: వారంలో 4 రోజులు పని - 3 రోజులు సెలవులు