Oil Companies: ఆయిల్ కంపెనీలకు ₹20,000 కోట్లు - మార్కెట్ ఫోకస్‌లో షేర్లు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు ప్రయోజనం
Oil Companies: ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు పెరిగి, మన దేశంలో ఆ స్థాయిలో పెంచలేక నష్టాలను నెత్తిన వేసుకుని తిరుగుతున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి చల్లని వార్త అందుతోంది. ఆయా కంపెనీల నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేయడానికి సుమారు రూ.20,000 కోట్ల ($2.5 బిలియన్లు) సాయం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. వంట గ్యాస్ ధరలు పెరగకుండా చెక్ పెట్టడానికి కూడా ఈ సాయాన్ని అందిస్తోంది.
ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు ప్రయోజనం
ప్రభుత్వ సాయం వల్ల భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు ప్రయోజనం ఉంటుంది.
వాస్తవానికి, చమురు మంత్రిత్వ శాఖ రూ.28,000 కోట్ల నష్ట పరిహారాన్ని కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం కేవలం రూ.20,000 కోట్ల నగదు చెల్లింపునకు మాత్రమే అంగీకరిస్తోందని సమాచారం. చర్చలు రహస్యంగా సాగుతున్నాయి కాబట్టి, అధికారికంగా న్యూస్ ఇంకా బయటకు రాలేదు. చర్చలు చివరి దశలో ఉన్నాయని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయిలో పెరగడం వల్ల, మన దేశ అవసరాల్లో 90 శాతం పైగా పెట్రోలియం ఇంధనాలను సరఫరా చేసే మూడు అతి పెద్ద ప్రభుత్వ రంగ రిటైలర్లు అత్యంత దారుణమైన త్రైమాసిక నష్టాలను చవి చూశాయి. ఈ కంపెనీలు ప్రాసెస్ చేస్తున్న ముడి చమురులో 85 శాతాన్ని దిగుమతుల ద్వారా తెప్పించుకుంటున్నాయి. అంటే, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అధిక రేట్ల ప్రకారం ముడి చమురును దిగుమతి చేసుకుని, వాటిని శుద్ధి చేస్తున్నాయి. సాధారణ ప్రజల మీద భారం పడకుండా చూడాలన్న ప్రభుత్వ విధానాల వల్ల అదే స్థాయి రేటుకు అమ్మలేకపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలను కొంతమేర తప్ప భారీగా పెంచలేకపోయాయి. ఆ గ్యాప్‌ను తామే భరిస్తున్నాయి. ఇప్పటికీ నష్టాలకే పెట్రోలు, డీజిల్‌ను అమ్ముతున్నాయి.
మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చమురు సబ్సిడీ కోసం రూ.5,800 కోట్లను కేటాయించింది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నష్టాలను భరిస్తున్నా; రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వంటి ప్రైవేట్ కంపెనీలు అమ్మే పెట్రోలు, డీజిల్ రేట్ల మీద ఆంక్షలు లేవు కాబట్టి, ధరలు పెంచి అవి నష్టాల నుంచి కొంతమేర గట్టెక్కాయి.
అదుపులో LPG ధర
మన దేశ అవసరాల్లో దాదాపు సగం ద్రవీకృత పెట్రోలియం వాయువును (LPG) భారత్ దిగుమతి చేసుకుంటుంది, దీనిని సాధారణంగా వంట గ్యాస్‌గా ఉపయోగిస్తున్నారు. భారత్‌లో LPG దిగుమతి బెంచ్‌మార్క్‌గా చూసే సౌదీ కాంట్రాక్ట్ ధర గత రెండేళ్ల కాలంలో 303 శాతం పెరిగగా, దిల్లీలో రిటైల్ ధర కేవలం 28 శాతం పెరిగింది.
ధరల పెంపు లేదా ప్రభుత్వ పరిహారం ద్వారా చమురు కంపెనీల నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వ జోక్యం అవసరం అని భారత్ పెట్రోలియం చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ గత నెలలో కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి సాయం ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ రిపోర్ట్ నేపథ్యంలో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్స్ ఇవాళ్టి (మంగళవారం) ట్రేడ్‌లో ఫోకస్‌లోకి వచ్చాయి. కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో, ఆయా షేర్ల ధరలు తీవ్రంగా చలిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.