2000 Rupee Notes: ₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా, డిపాజిట్ చేయవచ్చా?
రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు.
2000 Rupee Notes Exchange: రెండు వేల రూపాయల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి మంగళవారం (23 మే 2023) నుంచి ప్రారంభమైంది. అన్ని బ్యాంకుల బ్రాంచ్‌ల్లో పింక్ నోట్లను మార్చుకోవచ్చు. రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి ఎన్నిసార్లయినా క్యూలో నిలబడవచ్చు. పెద్ద నోట్లను బ్యాంక్ ఖాతాల్లోనూ డిపాజిట్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా?
మరి, రూ. 2 వేల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చా అంటే, ఈసారి నోట్ల మార్పిడికి పోస్టాఫీసులను దూరంగా పెట్టారు. 2000 రూపాయల నోట్లను తీసుకుని పోస్టాఫీస్‌కు వెళితే, ఆ విలువకు సరిపడా చిన్న నోట్లు ఇవ్వరు. కానీ, రెండు వేల రూపాయల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన నగదే కాబట్టి, వాటిని పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. దీని కోసం, పోస్టాఫీసులోని మీ ఖాతాకు KYC పూర్తి చేసి ఉండాలి.
రూ.2 వేల నోట్లను మార్చుకునే ఫెసిలిటీ కేవలం బ్యాంకులు & ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకే పరిమితమని, పోస్టాఫీసుల్లో అది కుదరదని అధికార వర్గాలు ప్రకటించాయి.
ఆంక్షలు లేవు - ఫారం నింపాల్సిన అవసరం లేదు
రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. దీనికి సంబంధించి ఎలాంటి ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదు. నోట్ల మార్పిడి విషయంలో, ఒక లావాదేవీలో గరిష్టంగా 10 రెండు వేల రూపాయల నోట్లు లేదా రూ. 20,000 వరకు మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను బ్యాంకు ఖాతాలో కూడా జమ చేయవచ్చు, దీనికి ఎటువంటి కొత్త నిబంధనలు లేవు. 2 వేల నోట్ల డిపాజిట్ల విలువ రూ. 50 వేలకు మించితే, బ్యాంక్‌కు కచ్చితంగా పాన్ కార్డు ఇవ్వాలి. ఇది పాత నిబంధనే.
ఇది కూడా చదవండి: టాక్స్ ఫైలింగ్ కోసం ఆన్‌లైన్ ITR-1, ITR-4 ఫారాలు రెడీ
2000 రూపాయల నోటును మార్చుకోవడానికి లేదా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. 4 నెలల సమయం ఉంది కాబట్టి, నోట్ల మార్పిడి లేదా జమ కోసం ప్రజలు తొందరపడవద్దని, ప్రశాంతంగా వచ్చి లావాదేవీలు పూర్తి చేసుకోవాలని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది.
ఏపీఎస్ ఆర్‌టీసీ కీలక నిర్ణయం
రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో, ఏపీఎస్‌ఆర్‌టీసీ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి రూ. 2 వేల నోట్లు తీసుకోవద్దని ఉద్యోగులను ఆదేశిస్తూ, ఆర్టీసీ యాజమాన్యం ఒక ఆర్డర్ పాస్ చేసింది. రూ. 2 వేల నోట్లు కాకుండా ఇతర నోట్లు మాత్రమే తీసుకోవాలని, వీలైతే డిజిటల్ చెల్లింపులు స్వీకరించాలని ఆర్‌టీసీ సిబ్బందికి సూచించింది. బస్ కండక్టర్లు రూ. 2 వేల నోట్లను డిపోల్లో జమ కోసం తీసుకువస్తే, అది అక్రమ లావాదేవీలను ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని డిపోలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్?