Salaried Employee Budget 2022 Expectations: ప్లీజ్ మేడమ్! టాక్స్ శ్లాబులు పెంచండి.. పన్ను రేటు తగ్గించండి.. ఉద్యోగుల ఆశలివీ!!
ఎప్పుడో 2014లో సవరించిన ఆదాయపన్ను శ్లాబులను మళ్లీ ఇప్పటి దాకా మార్చలేదు. మళ్లీ బడ్జెట్‌కు వేళైంది. ఈ సారైనా ఏదైనా మార్పు చేస్తారా అని ఉద్యోగవర్గాలు ఎదురు చూస్తున్నాయి.
Budget 2022 Telugu, Salaried Employee Budget 2022 Expectations: ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక వర్గం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారు! ప్రభుత్వం తమకు డబ్బులు మిగిలించే పనేదైనా చేసిందా అని! వారే ఉద్యోగులు. ఇంకా చెప్పాలంటే నిజమైన పన్ను చెల్లింపుదారులు!! ఎప్పుడో 2014లో సవరించిన ఆదాయపన్ను శ్లాబులను మళ్లీ ఇప్పటి దాకా మార్చలేదు. మళ్లీ బడ్జెట్‌కు వేళైంది. ఈ సారైనా ఏదైనా మార్పు చేస్తారా అని ఉద్యోగవర్గాలు ఎదురు చూస్తున్నాయి.
* వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును ప్రభుత్వం 2014లో సవరించింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. మళ్లీ పెంచలేదు.
* నిర్మలా సీతారామన్ ఈ సారి పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతారని అంతా భావిస్తున్నారు. రూ.15 లక్షల పైనా శ్లాబులను సవరిస్తారన్న అంచనాలు ఉన్నాయి.
* గతేడాది పరిమితి పెంచనప్పటికీ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ సెక్షన్ 80C తరహాలో ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. పైగా ఇది ఆప్షనల్.
* ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయ వర్గాలకు కొత్త, పాత పన్ను విధానాల్లో మినహాయింపు ఉంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయ వర్గాలు రెండు విధానాల్లోనూ 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* రూ.5,00,000-రూ.7,50,000 ఆదాయ వర్గాలపై పాత విధానంలో 20, కొత్త విధానంలో 10 శాతం పన్ను ఉంటోంది. రూ.7,50,000-రూ.10,00,000 వర్గాలపై పాత విధానంలో 20%, కొత్త విధానంలో 15% పన్ను రేటు అమలు చేస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా ఆదాయ వర్గాలకు పాత విధానంలో 30 శాతం పన్ను విధిస్తున్నారు.
* కొత్త విధానంలో రూ.10-12.5 లక్షలకు 15 శాతం, రూ.12.5-15 లక్షలకు 25 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. వీటిపై సుంకాలు, సర్‌ఛార్జులు విధించడంతో కట్టాల్సిన పన్ను ఎక్కువే అవుతోంది.
* ఇప్పుడు వ్యక్తిగత నికర పన్ను ఆదాయం రూ.5 లక్షలకు వరకు సెక్షన్ 87A కింద రెండు పన్ను విధానాల్లో రూ.12,500 వరకు రిబేటు ఇస్తున్నారు. అంటే రూ.5 లక్షల లోపు వారిపై పన్ను భారం సున్నా మాత్రమే. వీటన్నిటినీ మించి స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.100000 పెంచాలని డిమాండ్ ఉంది.
* 2014 నుంచి సెక్షన్ 80C కింద మినహాయింపులను పెంచలేదు. గతంలో రూ.లక్షగా ఉన్న డిడక్షన్లను రూ.1.5 లక్షలు, ఇంటి రుణంపై వడ్డీ మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈసారి వీటిని వరుసగా రూ.2 లక్షలు, రూ.2.50 లక్షలకు పెంచుతారన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే 2015లో ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్‌కు సెక్షన్ 80CCD కింద అదనంగా రూ.50వేలు, బీమా ప్రీమియం డిడక్షన్‌ను రూ.15000 నుంచి రూ.25,000 పెంచడం కాస్త ఊరట.
* ఈ సారి ఆదాయపన్నును మరింత సరళీకరించాలని, హేతుబద్ధీకరించాలని డిమాండ్లు ఉన్నాయి. 2020-21 బడ్జెట్‌లో దాదాపుగా 70 మినహాయింపులు, డిడక్షన్లను తొలగించారు. రాబోయే సంవత్సరాల్లో మిగిలిన మినహాయింపులను హేతుబద్ధీకరిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. టీడీఎస్, టీసీఎస్ వంటివీ సరళీకరిస్తే మరింత బాగుంటుంది.