Budget 2023: మిడిల్ క్లాస్‌కే కాదు రిచ్ క్లాస్‌కూ పన్ను తగ్గింపు! కోటీశ్వరుల పన్ను కోసేసిన మోదీ!
Budget 2023: మధ్య తరగతికే కాదు అధికాదాయ వర్గాలకూ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు చెల్లించాల్సిన పన్నులను తగ్గించింది. అత్యధిక సర్‌ఛార్జీని 25 శాతానికి పరిమితం చేసింది.
Budget 2023:
మధ్య తరగతికే కాదు అధికాదాయ వర్గాలకూ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు చెల్లించాల్సిన పన్నులను తగ్గించింది. అత్యధిక సర్‌ఛార్జీని 25 శాతానికి పరిమితం చేసింది. రూ.7 లక్షల లోపు వారికి 'జీరో' టాక్స్ అమలు చేసిన మోదీ సర్కారు రూ.2 కోట్లకు పైగా సంపన్నులకు సుంకాలను తగ్గించింది.
ప్రపంచంలోనే గరిష్ఠ రేటు
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వ్యక్తిగత పన్నురేటు అమలు చేస్తున్న ఏకైక దేశం భారత్. రూ.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి పన్ను రేటుకు అదనంగా సర్‌ఛార్జీని వసూలు చేస్తారు. ఏకంగా 42.74 శాతం పన్ను వేస్తుంది. ఈ భారం నుంచి మోదీ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. కొత్త పన్ను విధానంలో సర్‌ఛార్జ్ రేటును 37 శాతం నుంచి 25 శాతానికి కుదించింది. ఫలితంగా భారత్‌లో గరిష్ఠ పన్ను రేటు 39 శాతానికి చేరుకుంది.
42.74 నుంచి 25 శాతానికి తగ్గింపు
ఇప్పుడు రెండు పన్ను విధానాల్లో ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం ఉన్నవారికి 10 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ఉన్నవారికి 15 శాతం, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వారికి 25 శాతం, రూ.5 కోట్లకు పైగా ఆదాయ వర్గాలకు 37 శాతం సర్‌ఛార్జ్ అమలు చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో రూ.2 కోట్లకు పైగా ఆదాయ వర్గాలకు అత్యధిక సర్‌ఛార్జ్ 25 శాతమే అమలు చేస్తామని ప్రకటించారు. వారు 42.74 శాతానికి బదులు 25 శాతం కట్టేస్తే చాలు!
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితి పెంపు
లీవ్ ఎన్‌క్యాష్‌మెంటుకు సంబంధించీ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకే సెలవు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండేది. దీనిని 2002లో చివరిసారిగా సవరించారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం రూ.30,000గా ఉండేది. ఇప్పుడు వేతనాలు భారీగా పెరగడంతో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచారు.
ప్రభుత్వానికి ఎంత నష్టం
ప్రస్తుత ఆదాయ పన్ను ప్రదిపాదనలతో ప్రభుత్వానికి ఏటా రూ.38,000 కోట్ల భారం పడుతోంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.37,000 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.1000 కోట్ల వరకు ఆదాయం నష్టపోతోంది. అయితే అదనంగా రూ.3000 కోట్ల ఆదాయాన్ని ఇతర మార్గాల్లో రాబట్టడంతో నష్టం రూ.35,000 కోట్లకు తగ్గుతుంది.