Bitcoin Price: దూసుకుపోతున్న బిట్ కాయిన్-చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్కుకు చేరిక
Bitcoin: అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ గతనెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచాక బిట్ కాయిన్ దూసుకు పోతోంది. కేవలం నెలలోనే దాదాపు 45 శాతం పెరిగింది.
Bitcoin News: క్రిప్టో కాయిన్ దిగ్గజం బిట్ కాయిన్ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా లక్ష డాలర్ల మార్కును చేరుకుంది. గురువారం ఉదయం లక్ష డాలర్ల మార్కును చేరుకున్నట్లు క్రిప్టో కరెన్సీ ప్రకటించింది. ప్రస్తుతం లక్షా 2వేల డాలర్ల ఆల్ టైమ్ హైని కూడా తాకింది. రాబోయే రోజుల్లో మరింతగా బిట్ కాయిన్ పెరుగుతుంది. వచ్చే క్రిస్ మస్ కల్లా లక్షా 20 వేల డాలర్ల మార్కును తాకుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ట్రంప్ రాకతో..
నిజానికి అమెరికా అధ్యక్షునిగా గతనెల జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో బిట్ కాయిన్ కి ఊపు వచ్చింది. గత నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం బిట్ కాయిన్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి ఈ ఏడాది క్రిప్టో మార్కెట్ కి బాగా కలిసి వచ్చింది. యూఎస్ లో క్రిప్టో అనుకూల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఊహగానాలు చేలరేగడంతో అప్పటి నుంచి క్రిప్టో మార్కెట్ సానుకూలంగా స్పందించింది.
క్రిప్టో రాజధానిగా అమెరికా..
మరోవైపు తను అధ్యక్షునిగా గెలిస్తే అమెరికాను క్రిప్టో కరెన్సీ రాజధానిగా చేస్తానని ట్రంప్ హామీ ఇవ్వడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ను పెంచింది. తను అధికారంలోకి వస్తే అమెరికా ఎక్సెంజీ కమిషన్ (ఎస్ఈసీ) చీఫ్ గా పాల్ అట్కిన్ష్ ను నామినేట్ చేస్తానని ప్రకటించారు. ఆయన క్రిప్టో కరెన్సీకి చాలా అనుకూలంగా ఉంటారు. అలాగే క్రిప్టోకు అనుకూలమైన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి అధిపతిగా చేయడం కూడా కలిసొచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో అనుకూల పాలసీలను రూపొందిస్తామని ట్రంప్ పేర్కొంటుండంతో బిట్ కాయిన్ ఈ లెవల్ కు పెరిగి చరిత్రాత్మకమైన మార్కును దాటింది.
క్రిప్టో అడ్వైసర్ కౌన్సిల్..
క్రిప్టో కరెన్సీకి సంబంధించి ట్రంప్ నిర్ణయాలు దూకుడుగా ఉన్నాయి. రిపిల్, క్రాకెన్, సర్కిల్ లాంటి క్రిప్టో సంస్థలతో కలిసి క్రిప్టో సలహా మండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికాకు సంబంధించి క్రిప్టో పాలసీకి ఈ మండలి తుది మెరుగులు దిద్దుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు క్రిప్టో మార్కెట్ పై ట్రంప్ కు వ్యక్తిగత ఆసక్తి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరుస్తోంది. గత సెప్టెంబర్ లో క్రిప్టో వెంచర్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ను ట్రంప్ ఏర్పాటు చేశారు. అలాగే క్రిప్టో ట్రేడింగ్ ఫ్లాట్ఫాం భక్త్ ను ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూపు కొనుగోలుకు చర్చలు జరపడం కూడా బిట్ కాయిన్ వృద్ధిపై సానుకూల ప్రభావం చూపించింది.
హెచ్చుతగ్గులు ఉండొచ్చు..
మరోవైపు బిట్ కాయిన్ చరిత్రాత్మక లక్ష డాలర్ల స్థాయికి చేరుకున్న క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశముందని విశ్లేషకులు సూచిస్తున్నారు. త్వరలోనే బిట్ కాయిన్ లో ఫ్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని, తద్వారా బిట్ కాయిన్ ధరలో కాస్త మార్పులు ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు. ఒక్కసారి సెల్ ఆర్డర్స్ క్లియర్ అయిన తర్వాత మళ్లీ తారాజువ్వలా బిట్ కాయిన్ దూసుకుపోయి, ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ వరకల్లా లక్షా 20 వేల డాలర్ల మార్కును తాకుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న క్రిప్టో మార్కెట్.. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా గెలవడంతోపాటు బిట్ కాయిన్ లక్షా డాలర్ల స్థాయిని తాకడంతో ఉత్సాహంగా ఉంది.
Also Read: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం