Amazon News: అమెజాన్ ఉద్యోగుల జీతాల్లో 50 శాతందాకా కటింగ్‌లు! బెంబేలెత్తిస్తున్న నివేదిక
2023లో ఉద్యోగులకు అమెజాన్ ఇచ్చిన అంచనా లక్ష్యాల కంటే 15 శాతం నుంచి 50 శాతం మధ్య జీతం తక్కువగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక అంచనా వేసింది.
అమెజాన్ కంపెనీ షేర్లు దీర్ఘకాలంగా తిరోగమనంలో ఉండడం కారణంగా సంస్థ కార్పొరేట్ ఉద్యోగులు వేతన తగ్గింపును ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన బ్లూమ్‌బెర్గ్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. అమెజాన్ ఉద్యోగులను కంపెనీలో ఎక్కువ కాలం కొనసాగించేందుకు వీలుగా, ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (RSUలు) జారీ చేయనుంది. స్టాక్స్ విలువ కంపెనీ అనేది సంస్థకు చెందిన కొన్ని విభాగాల పనితీరుపైన ఆధారపడి ఉండనుంది. ఆర్ఎస్‌యూలు కేటాయించడం వల్ల ఉన్నత స్థాయి ఉద్యోగులు తాము కూడా సంస్థలో భాగస్వామ్యం అనే ఉద్దేశంతో మరింత సమర్థంగా పని చేయడానికి వీలుకలుగుతుంది.
2022లో పేలవమైన స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా Amazon షేర్లు 35 శాతానికి పైగా క్షీణించాయి. దీని ఫలితంగా 2023లో ఉద్యోగులకు అమెజాన్ ఇచ్చిన అంచనా లక్ష్యాల కంటే 15 శాతం నుంచి 50 శాతం మధ్య జీతం తక్కువగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక అంచనా వేసింది. ‘‘2017, 2022 ప్రారంభంలో, స్టాక్ ధర ప్రతి సంవత్సరం సగటున సుమారు 30 శాతం పెరిగింది. కానీ అమెజాన్ యొక్క స్టాక్ ప్రస్తుతం ఒక్కో షేరుకు $ 96 (దాదాపు రూ. 7,950) ట్రేడ్ అవుతోంది. కానీ, కొంత మంది ఉన్నత ఉద్యోగుల వేతన ప్యాకేజీలు మాత్రం.. ఒక్కో షేరుకు దాదాపు $ 170 (దాదాపు రూ. 14,000) ఉండవచ్చనే అంచనాలపై రూపొందించారు. ఈ కారణంగానే 50 శాతం వరకూ కోత విధించే అవకాశం ఉంది.’’ అని నివేదికలో వెల్లడించారు.
జీతం తగ్గింపును పరిష్కరించడానికి అమెజాన్ యొక్క మానవ వనరుల విభాగం మేనేజర్‌లకు ‘‘ట్రైనింగ్ డాక్యుమెంట్స్‌ను’’ పంపిందని నివేదిక పేర్కొంది. స్టాక్ ధరలు రికవరీ అయ్యే వరకు ఉద్యోగులను కొనసాగించాలని మేనేజర్‌లను కూడా కోరుతున్నారు.
అమెజాన్ సాధారణంగా ఉద్యోగులకు దాని ప్రత్యర్థుల కంటే తక్కువ బేస్-పే పరిహారం అందజేస్తుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టులో నివేదించారు. అయితే ఉద్యోగులు ఈ స్టాక్‌లను వెస్టింగ్ చేయడం ద్వారా భర్తీ చేస్తారు. ‘‘అమెజాన్ ఉద్యోగి కంపెనీలో ఎక్కువ కాలం కొనసాగితే, వారి పరిహారం స్టాక్ అవార్డులపై ఆధారపడి ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు, కొంత మందికి మొత్తం ఆదాయంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాలు ఉంటాయి’’ అని నివేదిక పేర్కొంది.
అమెజాన్ యొక్క సీటెల్ హెడ్ ఆఫీసులో జరిగిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సీఈవో ఆండీ జాస్సీ కూడా జీతం తగ్గింపు గురించి ప్రస్తావించారు. మార్కెట్ "ఫంకీ స్పాట్"లో ఉందని, అమెజాన్ ఇప్పటికే 18 వేల మంది ఉద్యోగులను తొలగించేలా కఠినమైన నిర్ణయం తీసుకుందని సీఈవో చెప్పారు. "రిజల్ట్ అనేది పరిహారంపై ఎఫెక్ట్ చూపుతుంది. అది కష్టం. అయితే ఈ ఛాలెంజింగ్ టైం నుంచి మనం బయటపడే దానికంటే సాపేక్షంగా బలమైన స్థితిలో బయటపడే అవకాశం ఉందని నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను’’ అని అన్నారు.
అమెజాన్ ఉద్యోగులకు మరిన్ని RSUలను జారీ చేయడం ఆపేసిందని, తక్కువ హైక్‌లు అందుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. వాటిని అంగీకరించిన కొంతమంది అభ్యర్థుల నుండి జాబ్ ఆఫర్‌లను కూడా అమెజాన్ రద్దు చేసింది. మే నుండి వారానికి కనీసం మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఇటీవల కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.