Landmark Cars IPO: ల్యాండ్‌మార్క్ కార్స్ అప్‌డేట్ - ఐపీవో తేదీ, ప్రైస్‌బ్యాండ్ ఖరారు
ఈ నెల (డిసెంబర్, 2022) 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు (మంగళ, బుధ, గురువారాల్లో) ఈ పబ్లిక్ ఇష్యూ ఓపెన్‌లో ఉంటుంది.
Landmark Cars IPO: మార్కెట్‌లో ఉన్న సెంటిమెంట్ ఆవిరి కాకముందే, పాజిటివ్ బయాస్‌ను క్యాష్ చేసుకోవడానికి కొత్త IPO కంపెనీలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో, ఆటోమొబైల్ సెక్టార్ నుంచి ఒక పబ్లిక్ ఇష్యూ సిద్ధంగా ఉంది. మెర్సిడెస్ కార్లను విక్రయించే ప్రీమియం ఆటోమోటివ్ రిటైలర్ ల్యాండ్‌మార్క్ కార్స్ కంపెనీ IPOతో వస్తోంది. తాజాగా, ప్రైస్ బ్యాండ్‌ను ఈ కంపెనీ నిర్ణయించింది. ఈ నెల (డిసెంబర్, 2022) 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు (మంగళ, బుధ, గురువారాల్లో) ఈ పబ్లిక్ ఇష్యూ ఓపెన్‌లో ఉంటుంది.
ఎవరికి ఎంత రిజర్వ్?
ల్యాండ్‌మార్క్స్ కార్స్ IPOలో రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువ పెట్టుబడి పెట్టేవాళ్లు) 35 శాతం, అధిక నికర విలువ (హై నెట్ వర్త్) కలిగిన నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్) 50 శాతం షేర్లు కేటాయించారు.
షేర్ ధర
అన్ని IPOల్లో తరహాలోనే ఈ IPOలోనూ పెట్టుబడి పెట్టాలంటే లాట్ల రూపంలో షేర్లు కొనాలి. ఒక్కో లాట్‌కు 29 షేర్లు నిర్ణయించారు. ఇలా 29 గుణిజాల్లో షేర్ల కోసం బిడ్ వేయవచ్చు. తాజాగా, IPO ప్రైస్ బ్యాండ్ నిర్ణయించారు. ఒక్కో షేరుకు రూ. 481- 506 ధర నిర్ణయించారు.
IPO ద్వారా రూ. 552 కోట్లను కంపెనీ సమీకరిస్తుంది. ఇందులో ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ. 150 కోట్లు; ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో రూ. 402 కోట్లు సేకరిస్తుంది. ఈ మొత్తంలో ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. ఈ సొమ్ముతో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చేందుకు, కార్పొరేట్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. ఆఫర్ ఫర్ సేల్ డబ్బు ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల జేబుల్లోకి వెళ్తుంది.
కంపెనీ బిజినెస్
ల్యాండ్‌మార్క్ గ్రూప్ భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్, హోండా, జీప్, వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ డీలర్‌షిప్‌లతో ప్రీమియం ఆటోమోటివ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అశోక్ లేలాండ్ వాణిజ్య వాహనాల రిటైల్ వ్యాపారాన్ని కూడా చూసుకుంటోంది. వీటికి అదనంగా... కొత్త వాహనాల విక్రయం, వాటి సేవలు, మరమ్మత్తు, విడిభాగాల విక్రయం, చమురు, ఉపకరణాలు, బీమా వంటివి సహా ఆటోమోటివ్ రిటైల్ వాల్యూ చైన్‌లో ప్రెజెన్స్ ఉంది.
కంపెనీ ఆదాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం 52 శాతం వార్షిక పెరుగుదలతో రూ. 2,989 కోట్లుగా ఉంది. నికర లాభం రూ. 66 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.11 కోట్లతో పోలిస్తే 6 రెట్లు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ. 18 కోట్ల లాభంతో రూ. 802 కోట్ల ఆదాయం సంపాదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.