(Source: ECI/ABP News/ABP Majha)
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక
BSEలో ఉన్న అన్ని లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (market capitalisation) ఈ మూడు సెషన్లలో రూ. 266.6 లక్షల కోట్లకు తగ్గింది. ఈ కాలంలో సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా నష్టపోయింది.
Adani vs Hindenburg: అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) బయట పెట్టిన నివేదికలో 32,000 పదాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన కేవలం మూడు వరుస ట్రేడింగ్ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం, సోమవారం) దలాల్ స్ట్రీట్ దారుణంగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను రూ. 13.8 లక్షల కోట్ల మేర కోల్పోయారు. బ్యాంకు స్టాక్స్ చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి.
BSEలో ఉన్న అన్ని లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (market capitalisation) ఈ మూడు సెషన్లలో రూ. 266.6 లక్షల కోట్లకు తగ్గింది. ఈ కాలంలో సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా నష్టపోయింది. అదానీ స్టాక్స్‌లోని అమ్మకాల ఒత్తిడి ప్రభావం మిగిలిన స్టాక్స్ మీదా పడింది, మొత్తం మార్కెట్‌ను కిందకు లాగేసింది.
నిఫ్టీ ఇప్పుడు (సోమవారం, 30 జనవరి 2023 నాడు) 3 నెలల కనిష్టంలో ట్రేడ్ అవుతోంది, ఒక దశలో 17,500 మార్కును కూడా దాటి కిందకు దిగి వచ్చింది. ఆ తర్వాత పుంజుకుంది.
అదానీ కంపెనీలు అప్పులు ఎలా చెల్లిస్తాయి?
అదానీ గ్రూప్‌లోని కంపెనీల నెత్తిన లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఆ రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమైన నగదును అదానీ కంపెనీ సృష్టించలేకపోతున్నాయని US పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ హైలైట్ చేసింది. దీంతో పెట్టుబడిదారులు బ్యాంకు స్టాక్స్‌ను కూడా డంప్ చేస్తున్నారు.
నివేదిక విడుదలైనప్పటి (బుధవారం, 25 జనవరి 2023) నుంచి చూస్తే, నిఫ్టీ బ్యాంక్ 3,000 పాయింట్లు లేదా 7.2% పైగా పడిపోయింది. ప్రైవేట్ & PSU బ్యాంకులు రెండూ ఇన్వెస్టర్ల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇవాళ, బ్యాంకింగ్ ఇండెక్స్‌లో 5% పైగా నష్టపోయిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) టాప్ లూజర్‌గా ఉంది. ఇతర టాప్ లూజర్స్‌లో స్టేట్ బ్యాంక్ (SBI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఉన్నాయి.
రూ.5 లక్షల కోట్లు కోల్పోయిన అదానీ స్టాక్స్
ఈ 3 రోజుల్లో, అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani Group stocks) తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 5 లక్షల కోట్లను లేదా మొత్తం విలువలో నాలుగింట ఒక వంతును కోల్పోయాయి. ఇవాళ.. అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) కొత్త 52 వారాల కనిష్ట స్థాయిలను తాకాయి, 20% వరకు తగ్గాయి. ఎక్కువ అదానీ స్టాక్స్‌లో షార్ట్ సెల్లర్స్ చెలరేగిపోతున్నారు.
ఇవాళ మధ్యాహ్నానికి, మొత్తం 10 అదానీ కౌంటర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) ఒక్కటే గ్రీన్‌లో ట్రేడవుతోంది.
మరోవైపు.. శుక్రవారం ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) టైమ్ లైన్ లేదా ప్రైస్ బ్యాండ్‌ను మార్చబోమని ఆ కంపెనీ స్పష్టం చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సబ్‌స్క్రిప్షన్ మంగళవారంతో (31 జనవరి 2023) ముగుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 2% మాత్రమే ఇది సబ్‌స్క్రయిబ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.