(Source: ECI/ABP News/ABP Majha)
Income Tax: పాన్-ఆధార్ లింక్ చేయలేదా?, రెట్టింపు కోతను తప్పించుకునేందుకు ఇంకొన్ని రోజులే గడువు
Income Tax Deadline: రెట్టింపు టీడీఎస్ లేదా టీసీఎస్ సామాన్యులకు భారంగా మారడంతో, కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డ్ మరో ఛాన్స్ ఇచ్చింది. మే 31వ తేదీతో పాన్, ఆధార్ లింక్ చేసుకునే డెడ్ లైన్ ముగియనుంది.
Aadhar Number-PAN Linking: ఇప్పటికీ పాన్-ఆధార్ నంబర్ లింక్ చేయని టాక్స్‌పేయర్ల కోసం ఆదాయ పన్ను విభాగం ఇటీవల ప్రకటించిన రిలీఫ్ తాలూకు డెడ్‌లైన్ అతి సమీపంలోకి వచ్చింది. ఈ నెల 31తో ఆ గడువు ముగుస్తుంది. ఈ డెడ్‌లైన్ దాటిన తర్వాత కూడా పాన్-ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే రెట్టింపు పన్ను + జరిమానా తప్పదు.
వాస్తవానికి, ఆధార్ నంబర్-పాన్‌ను ఉచితంగా అనుసంధానించే గడువు (Aadhar-PAN Linking Deadline) ఎప్పుడో ముగిసింది. చాలా మంది టాక్స్‌పేయర్లు ఇప్పటికీ ఈ పనిని పూర్తి చేయలేదు. ఇప్పుడు, పాన్-ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలంటే కొంత జరిమానా చెల్లించాలి. అంతేకాదు, ఆధార్‌తో లింక్ చేయని పాన్ తాత్కాలికంగా నిష్క్రియంగా (PAN card Deactivation) మారుతుంది. డీయాక్టివేట్ అయిన పాన్ కార్డ్ హోల్డర్ల నుంచి రెట్టింపు TDS (Tax Deducted at Source) లేదా TCS (Tax Collected at Source) వసూలు చేస్తున్నారు.
పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే రెట్టింపు రేటుతో TDS కోత విధించాలన్న నిబంధన ఉన్నప్పటికీ చాలాచోట్ల అలా జరగడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డుకు (Central Board of Direct Taxes - CBDT) ఫిర్యాదులు అందాయి. పాన్ నిష్క్రియంగా మారిన కేసుల్లోనూ నియమ నిబంధనల ప్రకారం TDS లేదా TCS తీసివేయలేదని కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. సీబీడీటీ రంగంలోకి దిగింది. 31 మే 2024 లోపు ఆధార్ - పాన్ లింక్ చేయడం వల్ల పాన్ తిరిగి యాక్టివేట్ అయితే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి రెట్టింపు TDS లేదా TCS వసూలు చేయరని స్పష్టం చేసింది.
మరో ఛాన్స్ ఇచ్చిన సీబీడీటీ
అంతేకాదు, రెట్టింపు టీడీఎస్ లేదా టీసీఎస్ సామాన్యులకు భారంగా మారడంతో, కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డ్ మరో ఛాన్స్ ఇచ్చింది. పన్ను చెల్లింపుదార్లు ఈ ఏడాది మే చివరిలోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చంటూ వెసులుబాటు ప్రకటించింది. 2024 మే 31 లోగా ఆధార్ నంబర్‌తో పాన్‌ను జత చేసిన వ్యక్తుల నుంచి మామూలు పద్ధతిలోనే టీడీఎస్ లేదా టీసీఎస్ వసూలు చేయాలని కంపెనీ యాజమాన్యాలు/ ఇతర సంస్థలకు సీబీడీటీ సూచించింది. ఒకవేళ, మే 31లోగా ఆధార్-పాన్ అనుసంధానం పూర్తి కాకపోయినా రెట్టింపు టీడీఎస్ లేదా టీసీఎస్ కట్ కాకపోతే.. అలాంటి వ్యక్తుల నుంచి జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
ఈ ఏడాది జనవరి 29 నాటికి, ఇంకా 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ గతంలో స్పష్టం చేసింది.
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా? (How to link Aadhaar-Pan?)
1. పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి.
2. వెబ్‌సైట్‌లో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోనట్లయితే, ముందుగా రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ, యూజర్ ఐడీగా మీ పాన్ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
4. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
5. మీ పుట్టిన తేదీ, జెండర్ వివరాలను ఇప్పుడు నమోదు చేయాలి.
6. మీ మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. పెనాల్టీగా రూ. 1,000 చెల్లించడం ద్వారా మీ పాన్ - ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
8. పాన్ - ఆధార్ లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ తెర పైకి సంపద పన్ను, అమల్లోకి వచ్చిందంటే 2 శాతం బాదుడు