Currency In Circulation: చేతులు మారుతున్న కరెన్సీ విలువ ₹32 లక్షల కోట్లు, డిజిటల్ పేమెంట్స్ ఫలితం ఎక్కడ?
ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల స్థాయి సహా అనేక స్థూల ఆర్థిక అంశాల మీద కరెన్సీ డిమాండ్ ఆధారపడి ఉంటుందని తన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
Currency In Circulation: దేశంలో కరెన్సీ చలామణి ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే కరెన్సీ చలామణిలో దాదాపు 8 శాతం (కచ్చితంగా చెప్పాలంటే 7.98 శాతం) వృద్ధి నమోదైంది.
2021 డిసెంబర్ 3వ తేదీ నాటికి మన దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదు నోట్ల విలువ 29 లక్షల 56 వేల 672 కోట్ల రూపాయలు (రూ. 29.56 లక్షల కోట్లు). సరిగ్గా ఏడాది తర్వాత, 2022 డిసెంబర్ 2వ తేదీ నాటికి ఇది 7.98 శాతం పెరుగుదలతో 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయలకు (దాదాపు రూ. 32 లక్షల కోట్లు) చేరుకుంది.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి!
దేశంలో చలామణీలో ఉన్న నగదు (Currency In Circulation - CIC) వివరాలను, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం రూపంలో తెలిపారు. ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్ల స్థాయి సహా అనేక స్థూల ఆర్థిక అంశాల మీద కరెన్సీ డిమాండ్ ఆధారపడి ఉంటుందని తన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, తద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించవచ్చని ఆర్థిక మంత్రి వివరించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత పెరిగిన కరెన్సీ చలామణి
2016 మార్చి 31వ తేదీ నాటికి 16 కోట్ల 41 లక్షల 571 కోట్ల రూపాయలు (రూ. 16.41 లక్షల కోట్లు) చలామణిలో ఉన్నాయని వెల్లడించిన ఆర్థిక మంత్రి... నోట్ల రద్దు తర్వాత, 2017 మార్చి 31 నాటికి చలామణీలో ఉన్న నోట్ల విలువ 13 కోట్ల 10 లక్షల 193 కోట్ల రూపాయలకు (రూ. 13.10 లక్షల కోట్లు) తగ్గిందని తన సమాధానంలో తెలిపారు.
అయితే, విచిత్రంగా, దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ అప్పటి నుంచి పెరుగుతూనే వస్తోంది. 2018 మార్చి 31 నాటికి, 18 లక్షల 03 వేల 709 కోట్ల రూపాయలకు (రూ. 18.03 లక్షల కోట్లు); 2019 మార్చి 31 నాటికి, 21 లక్షల 10 వేల 892 కోట్ల రూపాయలకు (రూ. 21.10 లక్షల కోట్లు) చలామణీలో ఉన్న నోట్ల విలువ పెరిగింది. 2020 మార్చి 31 నాటికి, 24 లక్షల 20 వేల 975 కోట్ల రూపాయలకు (రూ. 24.20 లక్షల కోట్లు), 2021 మార్చి 31 నాటికి, రూ. 28 లక్షల 26 వేల 863 కోట్ల రూపాయలకు (రూ. 28.26 లక్షల కోట్లు), 2022 మార్చి 31 నాటికి 31 లక్షల 05 వేల 721 కోట్ల రూపాయలకు (రూ. 31.05 లక్షల కోట్లు) ఈ విలువ పెరిగింది.
మన దేశంలో 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నల్లధనాన్ని నిరోధించడానికి ఈ చర్యలు చేపట్టామని, దేశంలో చలామణీలో ఉన్న నోట్లు ఇకపై తగ్గిపోతాయని ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి నుంచి కూడా చలామణీలో ఉన్న నోట్ల విలువ పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం... 2017 మార్చి నుంచి 2022 డిసెంబర్ వరకు చూస్తే, దేశంలో చలామణీలో ఉన్న నోట్ల విలువ రెండున్నర రెట్లకు పైగా (రూ. 13.10 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 32 లక్షల కోట్లకు) పెరిగింది.
ఇంత భారీ స్థాయి కరెన్సీ దేశ ప్రజల చేతుల్లో మారుతుంటే.. మరి పెద్ద నోట్ల రద్దు & ఏటా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల ఫలితాలు ఎటు పోయాయో?