Sadhguru on Temples: దేవాలయాలు షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మారుతున్నాయి, ప్రతిదీ వ్యాపారమే - సద్గురు
Sadhguru on Temples:
సద్గురు: తనకు తెలిసిందే నిజం అనుకోవడం మనిషి స్వభావం. తన తెలిసింది మాత్రమే సత్యంగా కనిపిస్తుంది. భౌతికంగా అనుభూతి చెందే వాటిని మాత్రమే మనిషి నమ్ముతాడు. కేవలం పంచేద్రియాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ..ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..పంచేంద్రియాలు కేవలం భౌతిక అంశాలను మాత్రమే గ్రహించగలవు. అంటే...మీరు జీవితం అనుకునేదంతా భౌతికమైందే. మీ శరీరం, మీ మనసు, భావోద్వేగం ఇలా ప్రతిదీ భౌతికమే. మనిషి ఉనికిని ఓ క్లాత్‌తో పోల్చుకుందాం. ఆ బట్టపై నడుస్తూ అదే జీవితం అనుకుంటారు. కానీ ఒక్కసారిపై ఆకాశం వైపు చూస్తే అప్పుడర్థమవుతుంది విశాలమైన శూన్యం ఆవరించి ఉందని. కానీ అక్కడ కూడా మీరు భౌతికతను మాత్రమే గుర్తిస్తారు. నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని మాత్రమే చూస్తారు - ఇవన్నీ భౌతికమైనవే. భౌతికం కాని వాటిని మీరు చూడరు.
మీరు నడుస్తున్న ఆ బట్టకు రంధ్రం చేసి భౌతిక అనుభూతులన్నింటినీ పక్కన పెట్టి అంతకు మించి ఆలోచించడానికి ఉపకరించేవే ఆలయాలు. ఇవాళ, దేవాలయాలు షాపింగ్ కాంప్లెక్స్‌ల్లా కడుతుండవచ్చు - కాంక్రీటు, స్టీలు ఇంకా మిగతా వాటన్నిటితో; బహుశా అదే ఉద్దేశంతో కాబోలు, ఎందుకంటే నేడు ప్రతిదీ వ్యాపారమైపోయింది. నేను గుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, ప్రాచీన ఆలయాలు కట్టిన విధానం గురించి మాట్లాడతాను. ఈ దేశంలో, ప్రాచీన కాలంలో, ఆలయాలను కేవలం శివుడికి మాత్రమే కట్టేవారు, ఇంకెవరికి కాదు. తర్వాతి కాలంలో మాత్రమే, ఇతర గుళ్ళు పుట్టుకొచ్చాయి, ఎందుకంటే ప్రజలు తాత్కాలిక శ్రేయస్సుపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని - ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు ఇంకా ఇతర అంశాల్లో ఎన్నో విధాలుగా తమకి లబ్ధి చేకూర్చుకునేందుకు - ఎన్నో ఇతర రకాల రూపాల్ని సృష్టించడం మొదలుపెట్టారు. వాళ్ళు వివిధ రకాల శక్తుల్ని,రూపాల్ని సృష్టించారు. ధనం కావాలంటే, ఆ విధమైన అవసరానికి తోడ్పడే నిర్దిష్ట రకమైన రూపాన్ని సృష్టిస్తారు; లేదా భయంతో నిండిపోయిన వారికి, మరొక రకమైన రూపాన్ని సృష్టిస్తారు. ఇలాంటి ఆలయాలన్నీ, గత 1100 లేదా 1200 ఏళ్ళల్లో పుట్టుకొచ్చాయి, కానీ అంతకుముందు, ఈ దేశంలో శివాలయాలు తప్ప వేరే ఆలయాలు ఉండేవి కావు.
‘శివ’ అన్న పదానికి ఆక్షరార్ధం - ‘ఏదైతే లేదో అది’ అని. కాబట్టి, ‘ఏదైతే లేదో’ దానికి గుళ్ళు కట్టేవారు. అందువల్ల దేవాలయం అనేది ఒక రంధ్రం లాంటిది. దాని ద్వారా మీరు ‘ఏదైతే లేదో’ ఆ ప్రదేశంలోకి ప్రవేశించవచ్చు. మన దేశంలో కొన్ని వేల శివాలయాలు ఉన్నాయి, అయితే చాలా వాటిల్లో ఎలాంటి మూర్తీ ఉండదు. కేవలం ఒక సూచక రూపం మాత్రమే ఉంటుంది, సాధారణంగా అది లింగం అయ్యింటుంది. ‘లింగం’ అంటే ‘రూపం’ అని అర్థం. మనం దాన్ని ‘రూపం’ అని ఎందుకంటున్నామంటే, అభివ్యక్తం కానిది అభివ్యక్తమవ్వడం మొదలు పెట్టినప్పుడు, లేదా మరోలా చెప్పాలంటే, సృష్టి ఆవిర్భావం మొదలైనప్పుడు, అది తీసుకున్న మొట్టమొదటి రూపం దీర్ఘవృత్తాకారం. పరిపూర్ణమైన దీర్ఘవృత్తాకార రూపాన్నే లింగంగా పేర్కొంటాం. నేడు ఆధునిక కాస్మాలజీస్టులు ఈ విషయాన్ని ఎన్నో విధాలుగా గుర్తించారు. ఒకటేమిటంటే, ప్రతి పాలపుంతలోని ప్రధాన భాగం దీర్ఘవృత్తాకార రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ, మొదట అది దీర్ఘవృత్తాకార రూపం లేదా లింగంతో మొదలై, ఆ తర్వాత ఎన్నో రూపాల్లో అభివ్యక్తమవుతుంది. అలాగే మాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం ఏంటంటే, మీరు గనుక గాఢమైన ధ్యానస్థితిలోకి వెళితే, పరిపూర్ణంగా విలీనమయ్యే దశ వచ్చే ముందు, శక్తి తీసుకునే రూపం దీర్ఘవృత్తాకారం లేదా లింగాకారమే. మొట్టమొదటి రూపం లింగం, అలాగే చిట్టచివరి రూపం కూడా లింగమే; మధ్యలోనిది సృష్టి; వీటికి అతీతమైనది శివ. లింగాకారం అనేది సృష్టి అనే బట్టలో ఒక రంధ్రం లాంటిది. భౌతిక సృష్టి ఇక్కడ ఉన్నది; దాని వెనక ద్వారం లింగం, అలాగే ముందరి ద్వారం కూడా లింగమే. కాబట్టే, నేను గుడిని - మనం దాని గుండా భౌతికతను దాటి, భౌతికాతీతమైన దాన్ని చేరుకోగల - రంధ్రంతో పోలుస్తున్నాను; గుడి యొక్క ప్రాథమిక ఉద్దేశం కూడా అదే.
భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన 50 మంది వ్యక్తుల్లో ఒకరు సద్గురు. ఆయన ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన, విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 3.91 కోట్ల ప్రజలకు చేరువైన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.
[ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు, ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభిప్రాయాలు, నమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపవు. ]