News
News
X

Janasena 10 Years Journey : ఎదురు గాలిలో పవన్ ప్రయాణం- తీరమెక్కడో, గమ్యమేమిటో!

FOLLOW US: 

జనసేన పెట్టి పదేళ్లైందా.. అలా అనిపించడం లేదే అంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... ఆదివారం మంగళగిరిలో జరిగిన కాపుల సదస్సులో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ.. దానిని ఆయన వ్యతిరేకులు నెగటివ్ గా మలిచే అవకాశాన్ని ఇచ్చారు. జనసేన పార్టీ మంగళవారానికి పదేళ్లు పూర్తిచేసుకుని మచిలీపట్నం వేదికగా పదో ఆవిర్భావ జరుపుకుంటోంది. ఓ పార్టీకి పదేళ్ల ప్రయాణం అంటే చాలా కీలకమైన దశ. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులుంటాయి. ఎత్తుపల్లాలుంటాయ్.. జ్ఞాపకాలుంటాయ్. అలాగే తమ లక్ష్యంలో ఏ మేరకు సాధించగలిగామనే సమీక్ష కూడా ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ పదేళ్లు అయినట్లుగానే లేదు అనగానే ఇంకో రకమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఈ పదేళ్ల ప్రయాణం చాలా తొందరగా.. కార్యకర్తల మధ్య గడిచిపోయిందని ఆయన భావన కావొచ్చు. కానీ ప్రత్యర్థులకు... విమర్శనాత్మకంగా చూసే వాళ్లకి మాత్రం .. పార్టీ విషయాలను ఎప్పుడూ సీరియస్ గా తీసుకుంటే కదా అనే ఎత్తిపొడుపు కూడా కనిపిస్తుంది. 

పదేళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు గుర్తుందా.. దారంతా... చీకటి... రోడ్డంతా గోతులు.. చేతిలో చిరుదీపం.. గుండెల నిండా ధైర్యంతో ముందడుగు వేస్తున్నా అని ప్రకటించారు. కానీ ఆ చీకటి.. గతుకులు.. గోతులలో ఎంతకాలం నడుస్తారు. ఆయన కంటే రెండేళ్లు ముందు పార్టీ పెట్టిన జగన్ మోహనరెడ్డి కనీవినీ ఎరుగని మెజార్టీతో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జగన్ కు వైఎస్ అనే బ్రాండ్ ఇమేజ్... కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ అనే బాకింగ్ ఉన్నాయి నిజమే. కానీ తనకు తాను కూడా సొంతగా నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. ఓ నాయకుడిగా పవన్ కల్యాణ్ సామర్థ్యం, స్టామినా.. చరిష్మా  మీద ఎవరికీ అనుమానం లేదు. ఆ మాట కొస్తే... రాష్ట్రంలోని నాయకులందరి కంటే చరిష్మాటిక్ లీడర్ పవన్ కల్యాణ్. కానీ పవన్ కల్యాణ్ వేరు.. జనసేన వేరు కదా... పవన్ కల్యాణ్ గా ఉన్న చరిష్మా జనసేనానిగా కూడా ఉండాలి కదా.. అక్కడే ఏదో తేడా జరుగుతోంది. 

కొంచం క్రిటికల్ గా చూస్తే.. పదేళ్ల తర్వాత కూడా పవన్ పార్టీ ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉంది.  అధికారం మనదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో “అధికారంలోకి  రాకుండా అడ్డుకుంటాం..” అనే దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికీ ఓ పార్టీని ఆపడానికి ఇంకోపార్టీతో కలిసి వెళ్లాలా.. లేక ఇంకో పార్టీని ఆపి తానే ముందుకు రావాలా అన్న సందిగ్ధం దగ్గరే జనసేనాని ఆగిపోయారు. అసలు పార్టీని ఇన్నాళ్లు నడిపించిన విధానంపైనా చాలా మందికి అభ్యంతరాలున్నాయి. 2014లో ఎన్నికలకు ముందు హడావిడిగా పార్టీ ప్రకటన చేసిన పవన్ ఎన్నికల్లో పోటీ మాత్రం చేయనన్నారు. అప్పట్లో పవన్ వ్యూహం ఏంటన్నది అర్థం కాలేదు. ఓ రాజకీయ పార్టీ రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు.. కొన్నిసార్లు వ్యూహాత్మకంగా కొందరికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అది రాజకీయాల్లో అనివార్యత కూడా. కానీ ఆ మద్దతు ద్వారా తాము ఏం పొందుతున్నామన్నది కూడా ముఖ్యమే. 2014 లో తెలుగుదేశం-బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ తాను మాత్రం సీట్లు తీసుకోకుండా ఉండిపోయారు. అప్పుడే కొన్ని సీట్లు తీసుకుంటే కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. పార్టీ బలోపేతానికి కూడా పనికొచ్చేది. కానీ విభజన ద్వారా దెబ్బ తిన్న రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడిని ఇవ్వాలన్నఉద్దేశ్యంతో.. ఉదారంగా మద్దతిస్తున్నానంటూ తానో ఉదాత్తమైన రాజకీయ నేత అని చెప్పుకునే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేశారు. కానీ అందరూ ఆ కోణంలో చూడలేదు. ఓ రకంగా ఆదిలోనే మొదటి తప్పు జరిగిపోయింది. 

ఆ తర్వాత తెలుగుదేశంతో కూడా చివరి వరకూ పవన్ కల్యాణ్ లేరు. ఎన్నికలకు ఏడాది ముందు అకస్మాత్తుగా స్వరం మార్చారు. తెలుగుదేశంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని.. వాళ్లూ.. వీళ్లూ చెప్పుకుంటుంటే విన్నానంటూ.. తెలుగుదేశంపై పోరాటానికి దిగారు. బీజేపీ కూడా రాష్ట్రానికి ద్రోహం చేసిందని.. హోదా ఇవ్వకుండా పాచిపోయిన లడ్లు పంచిందంటూ విరుచుకుపడ్డారు. ఓ రాజకీయ నేతగా ఓ మిత్రపక్షం నుంచి దూరంగా జరగాలనే స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు.. దానికి ముందుగానే కొంత వర్క్ చేసుకోవాలి. తన పార్టీని నిర్మించుకోవాలి. నాయకులను సమీకరించుకోవాలి. లేదా మరో పెద్ద పార్టీ చెంతకైనా వెళ్లాలి.  కానీ ఆయన తనకన్నా ఓట్లు తక్కువ ఉన్న కమ్యూనిస్టులతో కలిశారు. 


సాధారణ రాజకీయ హామీలు కాకుండా.. కులాలు లేని సమాజం... కాలుష్యం లేని పర్యావరణం అంటూ సరికొత్త రాజకీయ అజెండాను కూడా ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కొందరు మేధావులతో కమిటీ  వేసి 70వేల కోట్లకు పైగా రాష్ట్రానికి రావాలి అని ఓ పత్రాన్ని ప్రచురించారు. ఆ తర్వాత అది ఏమైందో తెలీదు. కమ్యూనిజం దూరమైంది.  కాషాయం దగ్గరైంది.  కొన్ని రోజులుగా అత్యంత దుర్గార్గమైన ఈ ప్రభుత్వాన్ని దింపడానికి అన్ని పార్టీలు ఏకం కావాలి అని చెబుతూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధకాండపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు- జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరస్పరం సంఘీభావం కూడా తెలుపుకున్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందనే అంచనాలు మిన్నగా కనిపిస్తున్నాయి. 

ఎన్నికలకు ముందు అవినీతి పార్టీ అని తిరస్కరించిన తెలుగుదేశం తర్వాత అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రూవ్ చేసుకుంది ఏం లేదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న బీజేపీ రాష్ట్రానికి మేలు చేసిందీ ఏం లేదు. మరి ఈ రెండు పార్టీలతో మళ్లీ ఎందుకు కలుస్తున్నారు అన్నదానికి జనసేన దగ్గర సరైన సమాధానం లేదు. ప్రస్తుత ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నందున దానిని దింపాలంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీల ఏకీకరణ జరగాలన్నది ఆయన చెబుతున్న భాష్యం. ఈ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాక్ష పార్టీలపై కొనసాగిన నిర్బంధం .. శాంతిభద్రతల సమస్య వంటి వాటిని చూసినప్పుడు.. జనసేన ఈ విషయంలో ప్రజలను కన్విన్స్ చేయగలదు. కానీ పదేళ్లుగా గమనం ఏంటో తెలియకుండా కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ కార్యకర్తలను ఎలా కన్విన్స్ చేయగలుగుతుంది...? 

ఎప్పుడూ ఇంకోపార్టీకి సెకండ్ టీమ్ గా ఉండాల్సిందేనా అన్న భావన కార్యకర్తల్లో ఉంది. దానిని పవన్ కల్యాణ్ కూడా గుర్తించినట్లున్నారు. అందుకే ఆయన మాటల్లో మళ్లీ మార్పు వచ్చింది. మంగళగిరి వేదికగా బీసీ, కాపుల సదస్సులలో పవన్ కల్యాన్ మాటలో మార్పు కనిపిస్తోంది. అది తెలుగుదేశం మీద మరింత ఒత్తిడి పెంచి మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు వేస్తున్న ఎత్తా లేక నిజంగానే విడిగా పోటీ చేయాలన్న ఆలోచన ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు బీజేపీతో ఉన్నారా లేదా.. ఉంటే  బీజేపీ వద్దంటే తెలుగుదేశంతో వెళతారా లేదా ఇలా సందేహాలు చాలా ఉన్నాయి. 

పదేళ్ల తర్వాత కూడా పార్టీని ఇలా సందిగ్ధంలోనే ఉంచడం కచ్చితంగా లోపమే. జనసేనలోనే రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో ఉన్నారో లేదో తెలీదు.  కానీ ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీ వల్ల వాళ్లకి వచ్చే లాభం ఏం లేదు. కిందటి సారి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తేనే వచ్చిన ఓట్లు 5.5శాతం. స్వయంగా పవన్ కల్యాన్ రెండు చోట్లా ఓడిపోయారు. మరి ఇలాంటప్పుడు.. తెలుగుదేశంతో పొత్తుకు అవకాశం ఉన్నప్పుడు... తగినంత భాగస్వామ్యం తీసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నది కొంతమంది సూచన. ఎందుకంటే ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున అది కచ్చితంగా మొదటి ప్రతిపక్షానికే వెళుతుందన్నది వారి అంచనా. ఈసారి ఆ మాత్రం ఓట్లు కూడా రావేమో అన్న బెంగ వారిది. ఇంకో పక్షం ముఖ్యంగా యువతరం... పవన్ కల్యాన్ ను సీఎం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. తెలుగుదేశంతో కలిస్తే.. ఎప్పటికీ వాళ్లకి సెకండ్ టీమ్ గానే ఉండిపోవాల్సి ఉంటుందని.. తాడో పేడో ఒంటరిగానే తేల్చుకోవాలని లేదా. . ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాన్ పేరును ప్రకటించాలని, అదీ కాని పక్షంలో అధికార వాటాను పంచుకోవాలన్నది వీళ్ల ఆలోచన. ఇంతకీ పవన్ కల్యాణ్ ఆలోచన ఏంటో మాత్రం తెలీదు. 

ఇలాంటి సందిగ్ధ పరిస్థిత ఉన్న తరుణంలోనూ.. తాము చాలా క్లియర్ గా ఉన్నాం అని రెండు రోజులుగా మంగళగిరి వేదికగా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. తాము చాలా ఇండిపెండెంట్ అని.. ప్యాకేజీలు నడిపించవ్ అని తన మీద ఉన్న విమర్శలకు కూడా సమాధానం చెప్పారు. జనసేన భావనా వాహినిపై నడుస్తోందంటూ కాస్త కవితాత్మంకంగా కూడా స్పందించారు. కానీ పదేళ్ల నుంచి జనసేన ను నడిపిస్తున్న భావనా వాహిని ఏంటో తెలీదు.  పర్యటనలకోసం అని తయారు చేయించిన వారాహి వాహనాన్ని ఫోటో షూట్ లకోసం తిప్పడం తప్పితే.. ప్రచారం కోసం తిప్పింది లేదు. అసలు కింది స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదు. కనీసం మిగతా పార్టీల్లో ఇమడలేని నాయకులను ఆకట్టుకునే చాతుర్యం కూడా లేదు. పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ ఒక్కరే ఆ పార్టీలో జనాలకు తెలిసిన. రాజకీయ, పాలనా అనుభవం ఉన్న నేత. మిగిలన వారి పరిస్థితి అంతంత మాత్రం. పోనీ అధికారం చేరుకోవడానికి అవసరమైన రోడ్ మ్యాప్ విషయంలో క్లియర్ గా ఉన్నారా అంటే అదీ లేదు. ఎవరూ అవునన్నా కాదన్నా.. జనసేన బలం కాపుల్లో ఎక్కువుగా ఉంది. కాపులు ఎక్కువుగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ ఓ రాష్ట్ర స్థాయి నేతగా ఓ కుల ముద్ర వేసుకునేందుకు పవన్ సిద్ధంగా లేరు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాని సమూహాలు కలవాలని ఆయన చెబుతున్నారు. బీసీలు, కాపులు ఇద్దరూ కావాలనుకుని తెలుగుదేశం పార్టీ కిందటి సారి రెండు వైపుల నుంచీ నష్టపోయింది. వైఎస్ జగన్ క్లియర్ గా బీసీ అజెండాతో వెళుతున్నారు. పై స్థాయి రాజకీయ నాయకులు ఎవరు.. అసలు అధికారం ఎవరికి ఉందన్న సందేహాలు ఉన్నా... పార్టీ టికెట్లు కేటాయింపు .. ఇతర ప్రాధాన్యతల విషయంలో బీసీ ఫస్ట్ అంటూ వెళుతున్నారు.  కానీ రెండు రోజులు వరుసగా జరిగిన బీసీ, కాపుల సదస్సులో పవన్ కల్యాణ్ బీసీలకు రాజ్యాధికారం రావాలని.. వాళ్లంతా కలవాలని.. చెప్పి.. మరుసటి రోజే కాపులు సంఘటితంగా ఉంటే.. అధికారం కాళ్ల దగ్గరకు వస్తుందన్నారు. ఆ వెంటనే బీసీలు, కాపులు కలిసి బలహీన వర్గాల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇదేంటో రాజకీయాల్లో ఉన్న ఎవరికీ అర్థం కావడం లేదు. 
ఇలాంటి కన్ఫ్యూజన్ లు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ కు రాష్రంలో క్లీన్ ఇమేజ్ ఉంది. నిజాయతీగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అన్నభావన కొంతమందిలో ఉంది. కిందటి సారి ఓడిపోయాడు అన్న సానుభూతి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ సరిగ్గా వాడుకోవడం లేదన్న భావన కొంతమంది న్యూట్రల్స్ లో ఉంది. ఇప్పటికీ కాస్త చాన్స్ ఉంది. లేమరి దీన్ని పదేళ్ల ఆవిర్భావం సందర్భంగా అయినా గుర్తించి.. సమీక్షించి.. అవకాశంగా మలుచుకుంటారా లేదా టీడీపీకి టర్మ్స్స్ పెట్టి పొత్తులను ఆహ్వానిస్తారో.. రేపు పవన్ కల్యాణ్ అధ్యక్ష ప్రసంగంలో తెలుస్తుంది

Published at : 13 Mar 2023 04:45 PM (IST) Tags: AP News AP Politics janasenani Pawan Kalyan Janasena Ten Years Tenth Anniversary JSP 10th Formation Meet

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల