FIFA World Cup 2022: ఫుట్‌బాల్ ప్రపంచ కప్! ఇది కేవలం ఆట కాదు అంతకుమించి!
FIFA World Cup 2022: ఒక వారం కిందటే ఖతార్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ప్లేయర్లు గోల్ కొడుతున్నప్పుడు ఫ్యాన్స్ కొట్టే చప్పట్లు, వేసే విజిల్స్ కంటే.. మరో ఆనందం ఏమైనా ఉంటుందా? ప్రపంచ కప్ అంటే అట్లుంటది మరి!
ఇదీ ప్రపంచకప్ అంటే!
నిజానికి ప్రపంచకప్ ఒక్కటే ఉంది. భారత్ సహా కొన్ని ఇతర దేశాలు మినహా క్రికెట్‌లో ఆలస్యంగా ప్రవేశించిన నెదర్లాండ్స్ వరకూ అంతా ఇంగ్లాండ్ నుంచి ఈ ఆటను వారసత్వంగా పొందాయి. ఇటీవలే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కూడా నెదర్లాండ్స్ పాల్గొంది. అదే విధంగా ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్‌లో కూడా జరుగుతుంది.
అమెరికా తన బేస్ బాల్ ఫైనల్స్‌ను "వరల్డ్ సిరీస్" అని పిలుస్తుంది. అదే విధంగా అమెరికాకే పరిమితమైన (అక్కడక్కడా కెనడాలో) నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA).. తన ఫైనల్స్ విజేతలను "ప్రపంచ ఛాంపియన్స్"గా అభివర్ణిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఇందులో యూఎస్ యేతర ఆటగాళ్లు కూడా లేరు. కానీ ఇవన్ని కాదనలేని నిజాలే. కానీ నిజమైన ప్రపంచ కప్ అంటే ఫుట్‌బాల్‌దే. ఎందుకంటే ఈ ప్రపంచ కప్‌లో ఆటగాళ్లను చూస్తే వాళ్లు ఆట ఆడుతున్నట్లు అనిపించదు.. యుద్ధం చేస్తున్నట్లే ఉంటుంది.
ఈ రోజుల్లో దేశభక్తి, క్రీడలకు విడదీయరాని సంబంధం ముడిపడింది. క్వాలిఫైయింగ్ రౌండ్లను దాటి 32 జట్లు ఈ సంవత్సరం ఖతార్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. 2026లో ఈ దేశాల సంఖ్య 48కి పెరగనుంది. అభిమానులు తమ దేశ జెండాలను చేత పట్టుకొని మైదానాలకు వస్తున్నారు. వారి దేశం గోల్ కొట్టినప్పుడు, స్కోర్ పెరిగినప్పుడు అభిమానులు ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే బ్రెజిలియన్లు దీన్ని "అందమైన ఆట"గా పిలుస్తారు.
దీనికే సాధ్యం
తమ దేశం ఆడే మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఎంతో ఖర్చు పెట్టి, టికెట్లు కొనుక్కొని, వేల మైళ్లు ట్రావెల్ చేసి మైదానాలకు వస్తారు. ఎందుకోసమో తెలుశా.. ఇది ప్రపంచ కప్ కనుక. అయితే చాలా మంది ప్రపంచ కప్ కంటే ఒలింపిక్స్ గొప్ప కదా అంటారు. కానీ అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే ఒలింపిక్స్ బోరింగ్‌గా చాలా అఫీషియల్‌గా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడప్పుడూ ఉసేన్ బోల్ట్ లాంటి వాళ్లు మెరుపు తీగలా కనిపించి వెళ్లిపోతారు. అయితే అందులో పాల్గొనే ప్లేయర్లు తమకు మాత్రమే కాకుండా వారివారి దేశాలకు కీర్తిని తెచ్చి పెడతారు. కానీ సీట్లలో కూర్చోనివ్వకుండా, చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపుతూ, ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిల్చునేలా చేసే సత్తా ప్రపంచ కప్‌కు మాత్రమే ఉంది.
గత రెండు దశాబ్దాలుగా ఒలింపిక్స్ పతకాలలో గణనీయమైన వృద్ధి సాధించి యునైటెడ్ స్టేట్స్‌తో పాటు సమానంగా చైనా రాణించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ప్రపంచ కప్‌లో మాత్రం చైనా ఇప్పటి వరకు అడుగే పెట్టలేదు.
ఖతార్‌లో జరుగుతోన్న ఈ ప్రపంచ కప్ ఎడిషన్‌లో కుంభకోణాలు, ఆసక్తికర పరిణామాలు, కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.. బ్రెజిల్ ఇంకా తన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ పుకార్లు మాత్రం లోకాన్ని చుట్టేస్తున్నాయి. ఖతార్ వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. అందుకోసమే ప్రపంచ కప్‌ను నవంబర్-డిసెంబర్‌కి మార్చారు. ఖతార్‌లో ఈ సమయమే చల్లగా ఉంటుంది.
రూల్స్‌పై
LGBTQ+ హక్కుల కోసం మద్దతుగా ఆర్మ్‌బ్యాండ్‌లను ధరించడానికి అభిమానులను ఖతార్ అనుమతించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అలానే ప్రపంచ కప్ స్టేడియాలలో బీర్ అమ్మకాలను నిషేధించడాన్ని యూరోపియన్ అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రపంచ కప్ నిర్వహించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ పాలకమండలి (ఫిఫా) $5 బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. చాలా మంది ఆటగాళ్ళు ప్రతి సంవత్సరం మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు.
అద్భుతం
టోర్నీ ప్రారంభ దశలోనే ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంజాయ్‌మెంట్ దక్కింది. కొన్ని మ్యాచ్‌లు అభిమానులతో పాటు ప్లేయర్లను కూడా ఆశ్చర్యపరిచాయి. ఒక్కొక్క మ్యాచ్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేస్తుంది. కోస్టారికాపై స్పెయిన్ 6-0 తేడాతో ఈజీ గెలుపు సాధించింది. ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లే స్పెయిన్ ప్లేయర్లు కనిపించారు. హిజాబ్ నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌పై ఇంగ్లాండ్ 6-2తో విజయం సాధించింది. ఫ్రాన్స్‌కు టోర్నీలో అద్భుత ఆరంభం దక్కింది. ఆస్ట్రేలియాపై 4-1 స్కోరుతో ఫ్రాన్స్ గెలిచింది. అయితే ఈ ప్రపంచ కప్‌లో ఊహకందని షాక్‌లు కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్‌లో పవర్‌హౌస్‌గా పేరున్న జర్మనీపై 2-1 తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. దీంతో జపనీయులు.. దేశానికి నేషనల్ హాలీడే ఇవ్వాలని కోరుతున్నారు.
మరోవైపు ఈ టోర్నీలో సౌదీ అరేబియా మామూలు షాక్ ఇవ్వలేదు. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను 51వ ర్యాంకర్ అయిన సౌదీ అరేబియా ఓడించడం సాకర్ ప్రపంచానికే పెద్ద షాక్. అర్జెంటినాను సౌదీ అరేబియా ఓడించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు అర్జెంటినా విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. లుసాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌తో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు వరుసగా 36 మ్యాచ్‌లలో విజయం సాధించిన అర్జెంటినా చివరికి ఓ చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైంది. సౌదీ అరేబియా జట్టు సాధించిన ఈ ఘనతకు ఆ దేశం మురిసిపోయింది. ఏకంగా ఒకరోజు నేషనల్ హాలీడే ప్రకటించింది.
ఇంతటి ఘన విజయం సాధించిన సౌదీ అరేబియా జట్టు.. ఈ ప్రపంచ కప్‌లో ఎంత వరకు ముందుకు వెళ్తుందని ఊహించగలరా? ఒక దశాబ్దం క్రితం, అరబ్ స్ప్రింగ్-ప్రపంచ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఏది ఏమైనా అర్జెంటీనాపై సౌదీ అరేబియా సాధించిన విజయం ఒక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. దాదాపు అరబ్ ప్రపంచానికి ఈ విజయం ఓ మేల్కొలుపు లాంటిది. దక్షిణ అమెరికా లేదా యూరోపియన్ జట్టు కాకుండా మరో జట్టు ప్రపంచ కప్‌ను గెలిచే రోజు ఎంతో దూరంలో లేదు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆఫ్రికన్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు కూడా ఈ మధ్య సత్తా చాటుతున్నాయి.
అర్జెంటీనాపై సౌదీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు సాధించిన విజయాన్ని యావత్ దేశం గెలుపుగా అభివర్ణిస్తూ వేడుకలు జరుపుకున్నారు. అందుకే ప్రపంచ కప్ అంటే కేవలం ఫుట్‌బాల్ కాదు.. అధికారం, రాజకీయాలు, జాతీయవాదం, దేశ భక్తి ఇలా అన్నీ ఆటలో అంతర్భాగమై ఉన్నాయి. ఏది ఏమైనా ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. అంతకుమించి!
- వినయ్ లాల్, రచయిత, బ్లాగర్, కల్చరల్ క్రిటిక్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (యూసీఎల్ఏ)
[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]