అన్వేషించండి

TDP Lokesh: వైసీపీ కంచుకోట అయిన రాయలసీమలో టీడీపీ పట్టు సాధించగలదా ? లోకేష్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?

Lokesh :   3/67
ఇదేమీ ఇంటి నెంబర్ కాదు.. స్కూల్లో పిల్లలకు వచ్చిన మార్కులూ కాదు. నెల్లూరు, ప్రకాశంలు  కలగలిసిన గ్రేటర్ రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లు అవి. ఓ రకంగా చెప్పాలంటే 2019లో రాయలసీమ పూర్తిగా వాషవుట్.  వైకాపా బలం బలగం.. తెలుగుదేశం బలహీనత రాయలసీమ. చావో రేవో అన్నట్లు మారిన 2024 సంగ్రామంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత టఫ్ బాటిల్ ఫీల్డ్ సీమ..! తలపడటం అటుంచితే.. నిలబడటమే కష్టమనిపించిన సీమను గెలవకపోతే... టీడీపీకి అధికారం అందకుండా పోతుంది. అది గుర్తించారు కాబట్టే టీడీపీ టార్గెట్ రాయలసీమ టాస్క్ చేపట్టింది. యువగళం అంటూ లోకేష్ సీమగడ్డపై గళం విప్పితే.. నేనూ మీ సీమ బిడ్డనే అంటూ చంద్రబాబు అదే సీమలో గర్జించారు. మంద్రంగా మొదలై సంద్రంగా మారిన లోకేష్ యాత్ర సీమలో జోష్ పెంచితే.. చంద్రబాబు ప్రాజెక్టు యాత్ర పేరుతో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మరి తండ్రీ కొడుకులు సీమ సింహద్వారాన్ని బద్ధలు కొడతారా.. అదే ఇవాల్టి వ్యూ పాయింట్ 

రాయలసీమలో పట్టు కోసం టీడీపీ ప్రయత్నం 
రాయలసీమ రాయలేలిన సీమ.. ఇప్పుడు రాయలసీమను గెలిచినవారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లుంటే.. ఐదున్నర జిల్లాల గ్రేటర్ రాయలసీమలో 67 స్థానాలున్నాయి. ప్రస్తుత వ్యవహారికంలో ఉన్న రాయలసీమతో పాటు.. నెల్లూరు జిల్లాను, నల్లమల సరిహద్దుల్లో ఉన్న ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కందుకూరు ప్రాంతాలను కలిపి గ్రేటర్ రాయలసీమ అంటారు. అనంతపురం 14, కర్నూల్ 14, కడప 10, చిత్తూరు 14, నెల్లూరు 10 స్థానాలతో పాటు ప్రకాశంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాంతంలో కిందటి ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది కేవలం 3 సీట్లు. అందులో ఒకటి ముఖ్యమంత్రి , పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు గెలిచిన కుప్పం ఇంకోటి ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గెలిచిన హిందూపురం, మరొకటి అదే జిల్లాలో పయ్యావుల కేశవ్ గెలిచిన ఉరవకొండ. ఇంతే.. వైసీపీ భాషలో చెప్పాలంటే  ఆ కులం వాళ్లు ముగ్గురు.. గెలిచినట్లు..! ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ సీమ వాసులే. కానీ చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ పూర్తిగా వేరు. లోకేష్ పుట్టిపెరిగిందంతా హైదరాబాద్. కాబట్టి సీమ బ్రాండింగ్ ను జగన్ మోహనరెడ్డి సొంతం చేసుకున్నారు. రాజధానుల నిర్ణయంపై కోస్తాలో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతతో ఓట్లు తగ్గినా... తనను తిరిగులేని స్థానంలో నిలబెట్టేది సీమేనని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్నే వమ్ముచేయాలని టీడీపీ ఇంకాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది. నేనూ రాయలసీమ వాసినే అని చంద్రబాబు ఎలుగెత్తి చాటటం వెనుక... నారా లోకేష్ యువగళాన్ని కుప్పంలో ప్రారంభించడం వెనుకూ ఆంతర్యం అదే.

గ్రేటర్ సీమలో దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర
కొన్నాళ్ల క్రితం.. లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాక మునుపు ఆయనతో మాట్లాడినప్పుడు..  గ్రేటర్ రాయలసీమలోని పరిస్థితని ఆయనకు వివరిస్తే... ఇక మీదట ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా అన్నారు. అన్నట్లుగానే సీమ మీద ఎక్కువగా కాన్సట్రేట్ చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కవ్వింపులకు పాల్పడితే లోకేష్ యువగళం  యాత్రను అక్కడి నుంచే మొదలుపెట్టారు. మొదట్లో కాస్త వెనుకబడినట్లు కనిపించినా క్రమ క్రమంగా ఊపందుకుంది. లోకేష్ పాదయాత్ర మొత్తం 4000 కిలోమీటర్లు అయితే.. ఐదు జిల్లాల సీమలోనే 2000కిలోమీటర్లకుపైగా నడిచారు. 170 రోజుల పాటు ఈ యాత్ర సీమలో సాగింది. గ్రేటర్ రాయలసీమ 67 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 60 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగిందంటే రాయలసీమను వాళ్లు ఎంత టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 

వైసీపీ లెక్కలు వైసీపీకి ! 
కిందటి ఎన్నికల్లో 67 స్థానాల్లో 64 కొట్టిన ప్రాంతంలో ఈసారి అదే ఫలితం అని వైసీపీ ధీమాగా ఉంది. 64 కాకపోతే.. 60 రావా... మరీ తీసేసినా 50ఖాయం అనైతే వాళ్ల లెక్కలు ఉన్నాయి. పైగా రెడ్డి ప్రాబల్యం ఉన్న సీమలో బీసీలను నించోబెట్టి.. జగన్ పోయిన సారి సోషల్ ఇంజనీరింగ్ చేసేశారు. ఈసారి ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆ బీసీ ఓట్లు భర్తీ చేస్తాయన్నది వైసీపీ లెక్క. అక్కడ 50 వస్తే.. మిగిలిన 110 చోట్ల కనీసం 40 సాధించలేమా అన్నది  వాళ్ల ధీమాకు కారణం. రాజధాని వ్యవహారంతో కృష్ణ, గుంటూరులో తగ్గినా, పవన్ కల్యాణ్ ప్రాబల్యంతో గోదావరి జిల్లాలు పోయినా.. గిరిజన, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ద్వారా మిగిలిన సీట్లను సంపాదించొచ్చు అన్నదే వైసీపీ అంతరంగం. 

క్రమంగా బల ప్రదర్శన చేస్తున్న టీడీపీ
మరి టీడీపీ సంగతి.. రాయలసీమ రాజకీయంగా రెడ్లు ప్రాబల్యం ఉన్నా.. జనాభా పరంగా అక్కడ బీసీల సంఖ్య ఎక్కువ. బీసీ పార్టీగా ముద్ర ఉన్న టీడీపీని దెబ్బతీయడానికి పోయిన సారి సీఎం జగన్.. అదే ట్యాగ్ వాడారు. సక్సెస్ అయ్యారు కూడా. మరీ ఈసారి తెలుగుదేశం ఆ స్థాయిలో చేయకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓ సారి జిల్లాల వారీగా లెక్కలు చూసుకుంటే..

చిత్తూరు.. చంద్రబాబు సొంత జిల్లా. ఇక్కడ ఎప్పుడూ ఒక పార్టీ ఆధిపత్యం ఉండదు. చెరిసగం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. 2019 జగన్ సునామీలా చుట్టేయడం వల్ల చంద్రబాబు తప్ప.. ఎవరూ గెలవలేదు. అధికారం మారిన తర్వాత వైకాపా దూకుడుగా వ్యవహరించింది. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. పైగా చంద్రబాబు పుట్టిన ఊరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి కూడా గెలవడం లేదన్న విమర్శను ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. ఓ రకంగా టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిన యువగళం.. అక్కడ నుంచే మొదలైంది. వరుసగా ఏడుసార్లు చంద్రబాబు గెలిచిన స్థానంలో  తమను ఇబ్బంది పెట్టే రాజకీయం చేస్తున్నారని భావించిన లోకేష్ .. యాత్ర అక్కడ నుంచే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. యాత్ర మొదటి రోజు మొత్తం పార్టీ అంతా హాజరైంది కాబట్టి జనసమీకరణ ఎక్కువుగానే ఉంది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులు జనాలు ఆ స్థాయిలో లేని మాట నిజం. చాలా మంది జగన్ మోహన్ రెడ్డి యాత్రతో పోల్చి.. ఆ స్థాయిలో లేదని చెప్పడం మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజులకే  యువవగళం రూపు మారింది. జనం పొటెత్తడం మొదలైంది.

నియోజవర్గాల వారీగా స్పెసిఫిక్ గా ఇష్యూలను లోకేష్ మాట్లాడటం స్థానికంగా కలిసొచ్చింది. చిత్తూరు జిల్లాలో పీలేరు, నగరి వంటి నియోజకవర్గాలు కొద్దిపాటి తేడాతో టీడీపీ చేజారిపోయాయి. వాటితో పాటు మొదటి నుంచి బలం ఉన్న పలమనేరు, చిత్తూరు, తిరుపతి, సత్యవేడు స్థానాలను ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకుంటున్నామని టీడీపీ కేడర్ చెబుతోంది. కనీసం సగం స్థానాలు చేతికి వస్తాయనే నమ్మకంతో ఉంది. ఇక చిత్తూరు మొత్తాన్ని శాసిస్తున్న పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డిని ఆయన నియోజకవర్గంలో ఎదుర్కొవడంతో టీడీపీకి కేడర్ కు ఊపొచ్చింది. కుప్పంలో తమను ఇబ్బంది పెడుతున్న పెద్దిరెడ్డిని నేరుగా ఎదుర్కొంటున్నామని చెప్పడంతో పాటు.. జిల్లాలో వైసీపీకి బలం అయిన ఆయన్ను ఢీకొడతాం అని సంకేతాలు ఇవ్వడం ఇందులో ఉంది. 

అనంతలో అసలు టాస్క్..
అనంతపురంలో 14 స్థానాలు ఉన్నాయి. రెండు పార్లమెంట్ స్థానాలను కూడా రాజకీయంగా ప్రాబల్యం లేని బీసీ కులాలకు ఇచ్చి జగన్ పోయినసారి సక్సెస్ కొట్టారు. అంతే కాదు అన్ రిజర్వుడ్ అయిన హిందూపూర్, పుట్టపర్తి మునిసిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకే కేటాయించారు. నిమ్మల కిష్టప్ప, పార్థసారథి, కాలవ శ్రీనివాసులు ఇలాంటి బీసీ నేతలతో తెలుగుదేశం రాజకీయం నడిచింది. ఇప్పటికీ ఈ నేతలే ఉన్నారు. అయినా టీడీపీ దెబ్బతింది. వైసీపీ తాము ఎప్పుడూ వెళ్లే పంథాలో కాకుండా బీసీ జపం చేయడం వల్ల, కొత్త బీసీ నేతలను తెరపైకి తీసుకురావడం వల్లనో వచ్చింది. వైసీపీ ఎంత కచ్చితంగా ఉందంటే.. తీవ్ర ఆరోపణలు వచ్చిన బీసీ మంత్రులు, వీడియో ద్వారా పాపులర్ అయిన గోరంట్ల మాదవ్ వంటి వారి జోలికి వెళ్లడానికి కూడా వెనుకంజ వేసింది. లోకేష్ పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో టీడీపీ జోష్ నింపింది. దీనిని ఓట్లుగా మలుచుకోవలసి ఉంది. తాడిపత్రి, ధర్మవరం వంటి చోట్ల లోకేష్ పాదయాత్రకు భారీ స్పందన కనిపించింది. కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా ప్రతీచోట ఆయా ముఖ్యమైన వర్గాలు, వైసీపీ క్యాడర్ తో దెబ్బతిన్న వాళ్లని కలవడం వంటివి స్థానికంగా టీడీపీకి మేలు చేశాయి. వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. అలాగే తెలుగేదేశానికి కూడా సమన్వయ లోపం ఉంది. వాళ్ల లోపాన్ని ఉపయోగించుకుని.. సొంత సమస్యలు తీర్చుకుంటే... కిందటి ఎన్నికల కంటే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి కనీసం 10 సీట్లు ఇక్కడ కొట్టి తీరతామని టీడీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. 

కర్నూలులో యువగళం పాదయాత్రతో నమ్మకం.. 
కర్నూలు మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్సీపీకి ఎక్కువ బలం ఉన్న జిల్లా. పోయిన ఎన్నికల్లో కడప, కర్నూలు జిల్లాల్లో తెలుగుదేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాలేదు. అలాంటి జిల్లాలో తాము ఈసారి మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని తెలుగుదేశం చెబుతోంది. కొత్తగా జిల్లా నాయకత్వం మారింది లేదు. కొత్తవాళ్లు వచ్చి చేరింది లేదు. కానీ ఏంటి ధీమా అంటే.. లోకేష్ పాదయాత్రను చూసే. ఓరకంగా కర్నూలు జిల్లాలో లోకేష్ యాత్ర ప్రత్యర్థులకే కాదు.. సొంత పార్టీ వాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆదోని, ఆలూరు,కోడమూరు, మంత్రాలయం, కర్నూలు నగరం ఇలా అన్నీచోట్లా పాదయాత్రకు భారీగా జనస్పందన కనిపించింది.  మంత్రులపై ఉన్న వ్యతిరేకత, వైఎస్సార్సీపీ నాయకుల్లో ఉన్న అనైక్యత వల్ల ఈసారి టీడీపీకి లాభం జరుగుతుందని అనుకుంటున్నారు. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని అని చెప్పినప్పటకీ అది చేతల్లో కొంచం కూడా ముందుకు కదలకపోవడం స్థానికంగా అసంతృప్తి కలగజేసింది. 

ప్రభుత్వ బాధితులకు ధైర్యం చెబుతున్న లోకేష్ 
లోకేష్ ప్రతీ వర్గాన్ని కలిసే ప్రయత్నం చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులను.. వైకాపా వేధింపులకు గురైన మరికొందరి ముస్లింలను ఆయన పర్సనల్ గా కలవడం ఆయా వర్గాల్లో టీడీపీ పట్టును పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమే. న్యాయరాజధాని విషయంలో ఈ ప్రాంత వాసులు అసంతృప్తిగా ఉన్నందున తాము అధికారంలోకి వస్తే... హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ నేతల బలం.. తెదేపాపై సానుకూలత కన్నా.. ఈ ప్రాంతంలో ఉపాధి పెరగలేదు. మూడు రాజధానుల పేరుతో ఒరిగింది ఏం లేదు అనే భావన ప్రజల్లో ఉంది. విద్యుత్  చార్జీల పెంపుపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. 

కడపలో ఈసారి గట్టి పోటీ ఇస్తామనే నమ్మకం
ఇక తర్వాత కడప. అసలు కడపలో నిలబడగలుగుతుందా అన్న పరిస్థితి నుంచి పులివెందుల వైకాపా కార్యకర్తలను తరిమే వరకూ వచ్చింది. ఎన్ని గెలుస్తారు అన్నవిషయం పక్కన పెడితే.. ఈ సారి కడపలో టీడీపీ గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని చెప్పినా వివేకానందరెడ్డి హత్యోదంతం కచ్చితంగా వైఎస్సార్పీపీపై ప్రభావం చూపక మానదు. ఈ విషయంలో జగన్ మోహనరెడ్డి వైఖరిపై అంత సానుకూలత అయితే లేదు. లోకేష్ పాదయాత్రకు అయినా.. చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రకు అయినా కడప జిల్లాలో వాళ్లు ఊహించిన దానికన్నా ఎక్కువ జనాలు వచ్చారు. లోకేష్ యాత్రలో బద్వేలు అయితే జనసంద్రంగా మారిపోయింది. పది స్థానాలున్న కడపలో అన్ని చోట్లా గట్టి పోటీ ఇవ్వగలం అని టీడీపీ భావిస్తోంది. ఇక్కడ కనీసం మూడు సీట్లు గెలిస్తే.. అది ఆ పార్టీకి బోనస్ కిందే లెక్క. అయితే అంతకు మించే కొట్టి చూపిస్తామంటున్నారు.. టీడీపీ లీడర్లు. చూడాలి ఏమవుతుందో..

నెల్లూరులో పరిస్థితి మరిపోయిందని ధీమా ! 
నెల్లూరులో కూడా పోయినసారి జీరో. అయితే లోకేష్ అక్కడ యాత్రకు అడుగు పెట్టే ముందే.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చారు. నెల్లూరు రాజకీయాల్లో బలమైన నేత ఆనం రామనారాయణరెడ్డి రావడం కచ్చితంగా టీడీపీ అవకాశాలను మెరుగుపరుస్తుంది. కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా నగర పరిధిలో పట్టున్న నాయకుడే. రెండు రిజర్వుడ్ నియోజకవర్గాల్లో తెదేపా బలంగా కనిపిస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్ మావే అంటోంది. ఆనం ఎలాగూ గెలుస్తారు అని చెబుతోంది. కావలిలో వైకాపాపై ఉన్న వ్యతిరేకత గెలిపిస్తుంది అనే భావన ఉంది. కాబట్టి కనీసం సగం సీట్లు కచ్చితంగా గెలుస్తామన్నది వాళ్ల ధీమా. ఇక ప్రకాశం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆ జిల్లానేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో ప్రకాశం జిల్లాలో టీం స్పిరిట్ బాగుంది. పార్టీ గెలుపే ముఖ్యం అన్నట్లుగా అక్కడ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సంతనూతలపాటు, మార్కాపురం, గిద్లలూరు, కనిగిరి, కందుకూరులో కనీసం మూడు చోట్ల తాము జెండా ఎగరేస్తామంటోంది టీడీపీ. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీలో జోష్ ! 
ఓ రకంగా లోకేష్ యాత్రతోనే టీడీపీ ఎన్నికల కాంపెయిన్ మొదలుపెట్టింది. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఈసారి ప్రచార పగ్గాలను కొడుక్కి అప్పగించారు. అయితే అంత వాగ్ధాటి, మాస్ అప్పీల్ లేని లోకేష్ ఎంత వరకూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు అన్న సందేహాలు ఉండేవి. రిజల్ట్ సంగతి పక్కన పెడితే లోకేష్ యాత్రకు క్రమక్రమంగా ఆదరణ పెరిగింది. అనంతపురం దాటాక అది బాగా కనిపిస్తూ వచ్చింది. పాదయాత్ర, బహిరంగ సభలను పక్కన పెడితే.. ఆయన వ్యక్తిగతంగా కొన్నివేల మందిని కలుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో సమావేశం అవుతూ వచ్చారు. ఇవన్నీ స్థానికంగా ఇంపాక్ట్ చూపించే పనులు. లోకేష్ యాత్ర సీమలో ముగిసే టైమ్ కు చంద్రబాబు అక్కడ ఎంట్రీ ఇచ్చి.. ఆ ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. 
2019 లెక్కలు చూసుకుంటే.. 95శాతం సీట్లు వైసీపీ- 5శాతం టీడీపీ ఉన్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా 80శాతం సీట్లు వస్తాయన్నది వైసీపీ ధీమా. అంటే  67లో 50సీట్లు.. టీడీపీ ఈ లెక్క తలకిందులవుతుంది అంటోంది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలుపై ఆ పార్టీ బాగా ఆశలు పెట్టుకుంది. కడప మినహా మిగిలిన చోట్ల సగానికి పైగా సాధించినా టీడీపీ అధికారం సాధించినట్లే.  ఇక్కడ 20 సీట్లకుపైగా వస్తే.. టీడీపీ గెలుస్తుంది అని లెక్కేసుకోవచ్చు 

ఫైనల్ గా ఓ విషయం చెప్పుకోవాలి. లోకేష్ టూర్ రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్నప్పుడే తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. అనూహ్యంగా ఈ రెండు సీట్లను టీడీపీ గెలుచుకుంది. 60 నియోజకవర్గాల పరిధిలో 3లక్షలకు పైగా పట్టభద్రుల ఓట్లు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యుర్థులు గెలుచుకున్నారు. ప్రజల నాడి ఎలా ఉందో దీనితోనే తేలిపోయిందని టీడీపీ చెబుతోంది.  సీమ కోటను బద్దలు కొడుతున్నామని సవాలు చేస్తోంది. ఇది కచ్చితంగా వైసీపీకి వార్నింగ్ సిగ్నలే.  పోయినసారి సోషల్ ఇంజనీరింగ్ చేసిన జగన్ ఇప్పుడేం చేస్తారో చూడాలి.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Jani Master: త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
త్వరలో అసలు నిజాలు బయటకు వస్తాయి... జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి కేసుపై మాట్లాడిన జానీ మాస్టర్
Embed widget