యమహా స్కూటర్లలో బ్రేక్ సమస్య, మీ భద్రతపై ప్రభావం - RayZR & Fascino స్కూటర్ల రీకాల్, ఉచితంగా రిపేర్
2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన రెండు మోడళ్లలో ముందు బ్రేక్ సమస్యతో 3,06,635 యూనిట్లకు రీకాల్ యమహా రీకాల్ ప్రకటించింది. ఉచితంగా పార్ట్ మార్పు చేస్తామని వెల్లడించింది.

Yamaha Scooter Recall India 2026: యమహా స్కూటర్లు వాడుతున్న వారికి ఇది చాలా కీలకమైన సమాచారం. భారత మార్కెట్‌లో విస్తృతంగా అమ్ముడుబోతున్న RayZR 125 Fi Hybrid & Fascino 125 Fi Hybrid స్కూటర్లలో బ్రేకింగ్‌కు సంబంధించిన సమస్య బయటపడటంతో, యమహా కంపెనీ పెద్ద ఎత్తున రీకాల్‌కు శ్రీకారం చుట్టింది.
అసలు సమస్య ఏంటి?
మొత్తం 3,06,635 స్కూటర్లను యమహా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తోంది. ఈ స్కూటర్లు 2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైనవి. అంటే, ఈ మధ్యకాలంలో కొన్న RayZR 125 Fi Hybrid లేదా Fascino 125 Fi Hybrid స్కూటర్లు రీకాల్ పరిధిలోకి వస్తాయి. ఈ స్కూటర్లలో బయటపడిన అసలు సమస్య ఏంటంటే - కొన్ని స్కూటర్లలో ముందు బ్రేక్ కాలిపర్ నిర్దిష్ట పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం. ఇది రైడర్ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో యమహా ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.
యమహా అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లోపం అన్ని స్కూటర్లలో ఉండకపోవచ్చు. కానీ, కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న ఉద్దేశంతో, ప్రభావిత యూనిట్లన్నింటికీ ఈ కంపెనీ రీకాల్ ప్రకటించింది. బ్రేక్ వ్యవస్థలో సమస్య ఉంటే, ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ నిర్ణయం వినియోగదారుల భద్రత కోసమే అని యమహా స్పష్టం చేసింది.
పూర్తి ఉచితంగా బ్రేక్ పార్ట్ మార్పిడి
ఈ రీకాల్‌లో భాగంగా లోపభూయిష్టమైన బ్రేక్ పార్ట్‌ను యమహా పూర్తిగా ఉచితంగా మారుస్తుంది. కస్టమర్ల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. సంబంధిత డీలర్‌షిప్‌లలో అవసరమైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచి, వీలైనంత త్వరగా స్కూటర్లను సరిచేస్తామని కంపెనీ చెబుతోంది.
ఎలా చెక్ చేసుకోవాలి?
ఇప్పుడు వినియోగదారులు చేయాల్సింది ఏంటంటే - తమ స్కూటర్ ఈ రీకాల్ పరిధిలోకి వస్తుందా, లేదా అన్నది చెక్ చేసుకోవడం. ఇందుకోసం India Yamaha Motor అధికారిక వెబ్‌సైట్‌లో Service సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ Maintenance ఆప్షన్ ఎంచుకుని, ‘Voluntary Recall Campaign’ మీద క్లిక్ చేయాలి. తరువాత ‘Scooter 125’ సెక్షన్‌లో చాసిస్ నంబర్ నమోదు చేస్తే, మీ స్కూటర్‌కు రీకాల్ వర్తిస్తుందో, లేదో వెంటనే తెలుస్తుంది.
మీ స్కూటర్ కూడా ఈ లిస్ట్‌లోకి వస్తే, ఆలస్యం చేయకుండా దగ్గర్లోని యమహా డీలర్‌ను సంప్రదించి, అవసరమైన రిపేర్‌ను పూర్తి చేయించుకోవడం మంచిది. బ్రేక్‌లకు సంబంధించిన సమస్యలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తాయి. అయితే, యమహా తీసుకున్న ఈ ముందస్తు చర్య కంపెనీ భద్రతపై చూపుతున్న బాధ్యతను స్పష్టంగా చూపిస్తోంది.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి, ఈ రీకాల్ సమాచారం మీకు వర్తిస్తుందా, లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.


















