Used Car Market: కొత్త కార్ల కంటే ఎక్కువ స్పీడ్‌లో దూసుకెళ్తున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ - కారణమేమిటో తెలుసా?
కొత్త కార్ల అమ్మకాలు పెరుగుతున్నా, వాడిన/సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ మాత్రం మరింత వేగంగా దూసుకెళ్తోంది. 2025లో వాడిన కార్లు కొత్త కార్లను దాటేశాయి, దానికి ఉన్న కారణాలివే.

Used Cars Sales vs New Car Sales 2025: భారతదేశంలో, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ కొత్త కార్లను మించిపోయే స్థాయిలో వేగంగా ఎదుగుతోందని ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. గత కొన్నేళ్లలో వినియోగదారుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు, “మొదటి కారు అంటే కొత్త కారు” అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది తమ బడ్జెట్‌లోనే పెద్ద సెగ్మెంట్ కారును, వాడినదైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
రేటింగ్ ఏజెన్సీ CRISIL ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూజ్డ్ కార్ల అమ్మకాలు 8-10 శాతం పెరుగుతాయని అంచనా. ఇది కొత్త కార్ల అమ్మకాల కంటే రెట్టింపు వేగం. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్లు దాటింది. అంటే, కొత్త కార్ల మార్కెట్‌తో సమానంగా ఉంది.
మారుతున్న వినియోగదారుల దృష్టి కోణం
ప్రస్తుతం, ప్రతి కొత్త కారు అమ్ముడయ్యే కొద్దీ, దాదాపు 1.4 వాడిన కార్లు అమ్ముడవుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఇది 1 కన్నా తక్కువగా ఉండేది. ఇది, వాడిన కార్లపై మన వాళ్లలో పెరుగుతున్న విశ్వాసాన్ని చూపిస్తోంది. CRISIL సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథీ ప్రకారం, వినియోగదారుల విశ్వాసం పెరగడమే కాకుండా డిజిటల్ అడాప్షన్ పెరగడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు.
వాడిన కార్లపై నమ్మకం ఎలా పెరిగింది?
ఇందుకు ప్రధాన కారణం Spinny, Cars24, CarDekho, Mahindra First Choice, OLX Autos వంటి ఆర్గనైజ్డ్ ప్లేయర్లు మార్కెట్లోకి రావడం. వీరు వాహనాల ఇన్‌స్పెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి, టెక్నాలజీ ఆధారిత పారదర్శకమైన సిస్టమ్ తీసుకువచ్చారు. వాహనాలపై వారంటీ ఇవ్వడం, సరైన ధరలు నిర్ణయించడం, నమ్మకమైన సమాచారం అందించడం వంటివి సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో నమ్మకాన్ని పెంచాయి. మునుపటి కాలంలో “వాడిన కారు అంటే రిస్క్” అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు యాప్‌లు, సర్టిఫైడ్ డీలర్లు, ఆన్‌లైన్ ఇన్‌స్పెక్షన్లు ఆ ఇమేజ్‌ను మార్చేశాయి.
డిజిటల్ వేవ్
వాడిన కార్ల అమ్మకాలు ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ ఆధారితంగా మారిపోయాయి. యాప్‌ల ద్వారా కేవలం ఒక క్లిక్‌తో వాహనాన్ని చూడటం, ఫైనాన్స్ తీసుకోవడం, ఇన్స్యూరెన్స్ పొందడం, ఇంటి వద్దకే డెలివరీ పొందడం సాధ్యమవుతోంది. AI ఆధారిత ఫిల్టరింగ్ సిస్టమ్స్ ద్వారా ప్రతి కార్ డీటైల్స్ చెక్ చేయగలుగుతున్నారు. ఇది కొత్త తరం కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని తెచ్చింది.
GST తగ్గింపు ప్రభావం
ఇటీవల జీఎస్టీ రేట్లు తగ్గడంతో కొత్త కార్ల ధరలు తగ్గినా, దాని ప్రభావం వాడిన కార్ల మార్కెట్‌పైనా కనిపిస్తోంది. కొత్త కార్లు చవకగా లభించడం వల్ల ప్రజలు పాత కార్లను ట్రేడ్-ఇన్ చేయడం పెరిగింది. దీనివల్ల, మార్కెట్‌లోకి పాత వాహనాల సరఫరా పెరిగింది.
భవిష్యత్తు దిశ
ప్రస్తుతం భారతదేశంలో వాడిన కార్లు-కొత్త కార్ల అమ్మకాల నిష్పత్తి ఇంకా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి రాలేదు. అందువల్ల వచ్చే సంవత్సరాల్లో ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందనే అంచనా ఉంది. పాండమిక్, సెమీ కండక్టర్ కొరత వంటి సవాళ్లు ఉన్నా వాడిన కార్ల మార్కెట్ బలంగా నిలబడింది.
CRISIL డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ ప్రకారం — “వచ్చే 12-18 నెలల్లో ఎక్కువ కంపెనీలు ఆపరేటింగ్ బ్రేక్‌ఈవెన్ చేరుతాయి. ఖర్చుల నియంత్రణ కొనసాగితే వృద్ధి ఇంకా వేగవంతమవుతుంది” అని చెప్పారు. ఇలా చూస్తే, వాడిన కార్లు కేవలం ప్రత్యామ్నాయం కాదు, కొత్త తరానికి స్మార్ట్ ఆప్షన్‌గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.





















