ఫ్రంట్ రాడార్, కొత్త హెడ్‌లైట్, మారిన డిజైన్: పులి లాంటి కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 వివరాలు
ట్రయంఫ్ టైగర్ 1200 ర్యాలీ టెస్టింగ్‌లో కనిపించింది. ఫ్రంట్ ఫేసింగ్ రాడార్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొత్త హెడ్‌లైట్, మారిన ఎగ్జాస్ట్‌తో త్వరలో అప్‌డేటెడ్ వెర్షన్ రానుంది.

Triumph Tiger 1200 Details In Telugu: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ అభిమానులకు ఇది నిజంగా ఆసక్తికరమైన అప్‌డేట్. ట్రయంఫ్ టైగర్ 1200 అప్‌డేటెడ్ వెర్షన్ టెస్టింగ్‌లో కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈసారి రోడ్డుపై కాదు, నేరుగా ఆఫ్‌రోడ్ ట్రయల్‌లో ఇది కనిపించింది. దీనివల్ల, రాబోయే టైగర్ 1200 ర్యాలీ వెర్షన్‌లో కొన్ని కీలక మార్పులు ఉంటాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ట్రయంఫ్ టైగర్ 1200ని ఈ కంపెనీ భారత్‌లో 2022లో లాంచ్ చేసింది. అప్పట్లోనే కొత్త స్టైలింగ్, పూర్తిగా అప్‌డేటెడ్ మెకానికల్స్‌తో ఈ అడ్వెంచర్ బైక్ మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత 2024లో స్వల్ప అప్‌డేట్ వచ్చింది. ఇప్పుడు కనిపించిన టెస్ట్ మ్యూల్‌ను చూస్తే, ఇది పూర్తిగా కొత్త జనరేషన్ కాకపోయినా, ఫీచర్లు, డిజైన్ పరంగా ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు.
ముందు వైపు డిజైన్ సరికొత్తగా
డిజైన్ పరంగా చూస్తే, కొత్త టైగర్ 1200కి అప్‌డేటెడ్ ఫ్రంట్ ఫేసియా లభించనుంది. ముందు భాగంలో మోనో ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్ కనిపిస్తోంది. అలాగే బీక్ డిజైన్ కూడా ఫ్యూయల్ ట్యాంక్‌తో మరింత స్మూత్‌గా కలిసిపోయేలా మార్చారు. ఇది బైక్‌కు మరింత అగ్రెసివ్ లుక్ ఇస్తోంది.
ఈ అప్‌డేట్‌లో అసలు హైలైట్ ఏమిటంటే... హెడ్‌ల్యాంప్ పైనే కనిపిస్తున్న ఫ్రంట్ ఫేసింగ్ రాడార్ సెన్సార్. ప్రస్తుత టైగర్ 1200లో రియర్ (వెనుక భాగంలో) రాడార్ ఆధారిత బ్లైండ్ స్పాట్ అసిస్టెన్స్, లేన్ చేంజ్ వార్నింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఫ్రంట్ రాడార్ చేరిందంటే... అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ముందు వాహనంతో దూరం ఆటోమేటిక్‌గా మెయింటైన్ చేసే ఫీచర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీని మనం ఇప్పటికే డుకాటి మల్టీస్ట్రాడా V4లో చూశాం.
వెనుక భాగంలో కూడా కొన్ని మార్పులు
కొత్త టైగర్ 1200 వెనుక భాగంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత మోడల్‌లో టైగర్ 900 తరహా టెయిల్ ల్యాంప్ ఉండగా, ఇప్పుడు స్ప్లిట్ టెయిల్ లైట్ సెటప్‌కి మార్చారు. బ్రేక్ లైట్స్‌ను ఇండికేటర్లలోనే ఇంటిగ్రేట్ చేయడం గమనార్హం. దీనితో పాటు, కొత్త ఎగ్జాస్ట్ ఎండ్ కాన్, కొత్త మిరర్స్ కూడా ఈ టెస్ట్ బైక్‌లో కనిపించాయి.
అయితే రేడియేటర్ సెటప్, ఫ్యూయల్ ట్యాంక్, బ్రేకింగ్ సెటప్ వంటి అంశాలు పెద్దగా మారినట్లు కనిపించడం లేదు. అంటే, ఇది పూర్తి జనరేషన్ అప్‌డేట్ కంటే, బైక్‌ను తాజాగా ఉంచేందుకు చేసిన నిప్ అండ్ టక్ అప్‌డేట్‌లా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, రాబోయే అప్‌డేటెడ్ ట్రయంఫ్ టైగర్ 1200లో రాడార్ గైడెడ్ సేఫ్టీ ఫీచర్లే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ బైక్‌ను కంపెనీ ఈ ఏడాది చివర్లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. అడ్వెంచర్ బైక్ ప్రేమికులు మాత్రం ఈ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















