17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్ మోడల్ వచ్చేసింది!
2026 Bajaj Pulsar RS200 భారత్‌లో రూ.1.98 లక్షలకు లాంచ్ అయింది. 5-అంగుళాల TFT, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, USD ఫోర్క్స్, సహా అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వివరాలు.

Updated Bajaj Pulsar RS200: బజాజ్, తన స్పోర్టీ బైక్ Pulsar RS200ను కొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి మళ్లీ లాంచ్ చేసింది. అప్‌డేటెడ్ వెర్షన్‌లో.. ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, కొత్త 5 అంగుళాల TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లను యాడ్ చేసింది. ముందు భాగంలో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో USD ఫోర్క్స్‌ను అందించింది. క్విక్‌షిఫ్టర్‌ను కూడా కొత్త మోడల్‌లో చేర్చింది.
ఇటీవల అప్‌డేట్ అయిన Pulsar NS200లో ఇచ్చిన మార్పులనే ఇప్పుడు RS200లోనూ ఇచ్చింది. అయితే ఈ అప్‌డేట్లతో బైక్ ధర 17,000 రూపాయలు పెరిగింది.
1. ఇంజిన్ పవర్ పెరిగింది.. టార్క్ మాత్రం అదే
కొత్త Pulsar RS200లో 199.5cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించారు. దీని గరిష్ఠ పవర్‌ను మాత్రం 1hp పెంచారు. ఇప్పుడు ఈ ఇంజిన్ 25.5hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠ టార్క్ మాత్రం 18.7Nm వద్ద యథాతథంగా ఉంది.
కొత్త ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ కారణంగా పవర్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవస్థ ద్వారా రైడర్‌కు వివిధ రైడింగ్ మోడ్స్‌ను అందించే అవకాశం కలిగింది. కొత్త RS200లో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ కూడా ఉన్నాయి.
2. కొత్త 5 అంగుళాల TFT డిస్‌ప్లే
పాత మోడల్‌లో ఉన్న కలర్ LCD యూనిట్ స్థానంలో ఇప్పుడు 5 అంగుళాల TFT కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవలి నెలల్లో కొన్ని Bajaj Pulsar మోడళ్లలో కనిపించిన అదే డిస్‌ప్లేను RS200లోనూ అందించారు.
ఈ కన్సోల్‌లో Google Maps మిర్రరింగ్ సదుపాయం ఉంది. దీంతో నావిగేషన్ సమాచారాన్ని బైక్ డిస్‌ప్లేపై చూడవచ్చు. వీటితో పాటు అడ్జస్టబుల్ లీవర్లు, USB Type-C ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ స్విచ్ వంటి కొత్త ఫీచర్లను కూడా జోడించారు.
ఇది కూడా చదవండి: పొల్యూషన్ సర్టిఫికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త BS6 వాహనాలకు మూడేళ్లకోసారి PUC సర్టిఫికెట్
3. సంప్రదాయ ఫోర్క్స్ స్థానంలో USD ఫోర్క్స్
కొత్త Pulsar RS200లో సస్పెన్షన్ సెటప్‌లోనూ మార్పు చేశారు. ముందు భాగంలో గతంలో ఉన్న సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో 37mm USD ఫోర్క్ బిగించారు. ఇది కొత్త మోడల్‌లో గుర్తించదగిన హార్డ్‌వేర్ అప్‌డేట్. ఇంజిన్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు సస్పెన్షన్‌లోనూ మార్పులు చేయడం ద్వారా RS200కు మరిన్ని ఆధునిక ఫీచర్లను జోడించింది బజాజ్.
4. రూ.17,000 పెరిగిన ధర
2026 Bajaj Pulsar RS200 ధరను రూ.1.98 లక్షలుగా నిర్ణయించారు. ఇది పాత మోడల్ ధర కంటే సుమారు రూ.17,000 ఎక్కువ.
Pulsar RS200కు సమీప ప్రత్యర్థి Hero Karizma XMR ప్రారంభ ధర రూ.1.86 లక్షలు. KTM RC 200 ధర రూ.2.33 లక్షలు. అంటే.. కొత్త RS200 బైక్ Karizma XMR కంటే ధర ఎక్కువైనప్పటికీ KTM RC 200 కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇది కూడా చదవండి: River Indieకి కొత్త వెర్షన్ రాబోతోందా? RX02, RX03 స్కూటర్ల ఫోటోలు లీక్.. డిజైన్‌లో మార్పులివే!
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















