Toyota Innova Hycross: బిజినెస్ క్లాస్ లాంటి ఇన్నోవా హైక్రాస్‌కు కొత్తగా '5-స్టార్ సేఫ్టీ రేటింగ్', ఇక దీనిని ఆపతరమా!
Toyota Innova Hycross Safety Ratings: టయోటా ఇన్నోవా హైక్రాస్ BNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ బండి ధర, ఫీచర్లు, ఇంజిన్ & మైలేజ్ వివరాలు తెలుసుకుందాం.

Toyota Innova Hycross Price, Mileage And Features: టయోటా ఇన్నోవా హైక్రాస్ భారత మార్కెట్లో బాగా పాపులారిటీ ఉన్న హైబ్రిడ్ MPVలలో ఒకటి. లగ్జరీ ఫీచర్లు, గొప్ప పెర్ఫార్మెన్స్ & అద్భుతమైన మైలేజీ కారణంగా కస్టమర్లు ఈ కారును ఇష్టపడుతున్నారు. తాజాగా, ఈ MPV భద్రత పరంగానూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇటీవల జరిగిన భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ MPV 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది, ఫ్యామిలీ కోసం మరింత నమ్మకమైన కారుగా మారింది.
పెర్ఫార్మెన్స్ & మైలేజ్
టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంది, ఇది మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మరింత సమర్థవంతంగా పని చేస్తుంది, ఇంధనాన్ని పొదుపుగా వాడుకుంటూ మెరుగైన మైలేజ్ ఇస్తుంది. దీని పెట్రోల్ CVT వేరియంట్ లీటరుకు 16.13 km మైలేజ్ ఇస్తుందని ARAI సర్టిఫై చేసింది. హైబ్రిడ్ e-CVT వేరియంట్ లీటరుకు 23.24 km వరకు మైలేజీని ఇవ్వగలదని కూడా ARAI ధృవీకరించింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 52 లీటర్లు. మీరు ఈ బండి హైబ్రిడ్ వెర్షన్‌ను కొని, పెట్రోల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, అది ఒకేసారి 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే, మీ ఫ్యామీలితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలను ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. ఈ కారణంగా ఈ MPV భారతదేశంలో అత్యంత ఇంధన-సమర్థవంత కుటుంబ కార్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
కుటుంబ భద్రత
టయోటా ఇన్నోవా హైక్రాస్ భద్రత పరంగా కూడా చాలా మెరుగ్గా ఉంది. ఈ బండిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రి-కొలిషన్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ ట్రేస్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ & ప్రతి వేరియంట్‌లో SOS ఇ-కాల్ వంటి హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా... పనోరమిక్ వ్యూ మానిటర్, ఆటో హై బీమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నీ సిటీ డ్రైవింగ్‌కు పనికొస్తాయి, హైవే మీద లాంగ్ జర్నీ చేయాలన్నా చాలా బాగా ఉపయోగపడతాయి.
ఫీచర్లు & కంఫర్ట్
ఇన్నోవా హైక్రాస్‌లో ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ & లగ్జరీ ఫీచర్లను చూస్తే మతిపోతుంది. క్యాబిన్‌లో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 300 లీటర్ల బూట్ స్పేస్, అడ్వాన్స్‌డ్ MID (మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే), వెంటిలేటెడ్ సీట్లు & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి జబర్దస్త్ ఫీచర్లు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలిసి దీనిని అద్భుతమైన ఫ్యామిలీ కారుగా & ప్రతి డ్రైవ్‌ను బిజినెస్ క్లాస్ స్టైలిష్ MPVగా మారుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధర
ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Innova Hycross ex-showroom price) రూ. 19.94 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో, దీని బేస్ మోడల్‌ను దాదాపు రూ. 25.28 లక్షల ఆన్-రోడ్ ధరకు ((Toyota Innova Hycross on-road price) కొనుగోలు చేయవచ్చు.





















