కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త ఇంజిన్, ఐకానిక్ నేమ్ - Tata Sierra ఎలా ఉంది?, ఫుల్ రివ్యూ ఇదే!
టాటా సియెర్రా కొత్త తరం SUVగా మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, శక్తిమంతమైన ఇంజిన్లు, ప్రీమియం ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటాకు ఇది గట్టి పోటీ ఇస్తుందా? పూర్తి రివ్యూ చదవండి.

Tata Sierra Review Telugu: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా సియెర్రా అంటే కేవలం కారు మాత్రమే కాదు, ఈ పేరు ఒక ఎమోషన్. 1990లలో రోడ్డుపై తిరిగిన ఒరిజినల్ సియెర్రా ఇప్పటికీ చాలామందికి గుర్తుంది. ఇప్పుడు అదే పేరు పూర్తిగా కొత్త అవతారంలో, కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త ఇంజిన్లు, కొత్త తరం ఫీచర్లతో తిరిగి వచ్చింది. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం ఉన్న మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లోకి టాటా సియెర్రా ఎంటర్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
డిజైన్ & ఇంజినీరింగ్
కొత్త సియెర్రాను చూస్తే మొదట కనిపించేది - ఫ్యూచరిస్టిక్ లుక్‌తో పాటు నాస్టాల్జియా టచ్. ఒరిజినల్ సియెర్రాను గుర్తు చేసే బాక్సీ షేప్, అప్రైట్ స్టాన్స్, బ్లాక్ అవుట్ రియర్ గ్లాస్, మందపాటి B పిల్లర్ డిజైన్ అన్నీ మళ్లీ గుర్తొస్తాయి. అదే సమయంలో సూపర్ షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్–రియర్ లైట్‌బార్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఈ SUVకి మోడ్రన్ ఫీల్ ఇస్తాయి.
టాటా రూపొందించిన కొత్త ARGOS ప్లాట్‌ఫామ్ మీద సియెర్రా తయారైంది. ఇది భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, CNG వరకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. సైజ్ విషయానికి వస్తే, ఇది సెగ్మెంట్‌లోనే ఎత్తైనది, వెడల్పైనది, అలాగే అత్యంత పొడవైన వీల్‌బేస్ కలిగిన SUVగా నిలుస్తుంది.
ఇంటీరియర్ & కంఫర్ట్
కేబిన్‌లో అడుగు పెట్టగానే, టాటా ఇప్పటివరకు ఇచ్చిన బెస్ట్ ఇంటీరియర్ ఇదే అనిపిస్తుంది. డ్యుయల్ టోన్ అప్హోల్స్టరీ, ప్రీమియమ్ మెటీరియల్స్, అద్భుతమైన ఫిట్ అండ్ ఫినిష్ - అన్నీ కలసి లగ్జరీ ఫీల్ ఇస్తాయి. టాప్ వేరియంట్లలో మూడు స్క్రీన్‌ల సెటప్ ప్రత్యేక ఆకర్షణ. డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ స్క్రీన్ అన్నీ హై రెజల్యూషన్ OLED ప్యానెల్స్‌తో వస్తాయి.
ముందు సీట్లకు ఎక్స్‌టెండబుల్ అండర్ థై సపోర్ట్ ఇవ్వడం సెగ్మెంట్‌లోనే ఫస్ట్. వెనుక సీట్లలో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ చాలిపోతుంది. ముగ్గురు పెద్దలు సులభంగా కూర్చోవచ్చు. రియర్ AC వెంట్స్, విండో బ్లైండ్స్, రీక్లైన్ అయ్యే సీట్లు, ఆర్మ్‌రెస్ట్‌తో కంఫర్ట్ విషయంలో సియెర్రా బాగా స్కోర్ చేస్తుంది.
ఫీచర్లు
సియెర్రా ఫీచర్లను చూస్తే, ఇది టాటా క్రెటాను టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. వెంటిలేటెడ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ Android Auto & Apple CarPlay, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్ పెద్ద హైలైట్.
సేఫ్టీ
6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, 360 డిగ్రీ కెమెరా, ADAS ఫీచర్లు స్టాండర్డ్‌గా ఇవ్వడం ప్లస్ పాయింట్.
ఇంజిన్ & డ్రైవింగ్ అనుభవం
సియెర్రాలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్తగా పరిచయం చేసిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ బాగా ఆకట్టుకుంటుంది. ఇది పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు స్మూత్ డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 6 స్పీడ్ ఐసిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ దీనికి మంచి జోడీ. డీజిల్ వేరియంట్ హైవే ప్రయాణాలకు సరిపోతుంది కానీ ఇంజిన్ శబ్దం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.
రైడ్ & హ్యాండ్లింగ్
రైడ్ క్వాలిటీలో టాటా మరోసారి తన క్లాస్ చూపించింది. బ్యాడ్ రోడ్లపై కూడా సియెర్రా చాలా స్థిరంగా ఉంటుంది. మలుపుల్లో బాడీ రోల్ కంట్రోల్‌లో ఉంటుంది. డ్రైవింగ్‌లో కాన్ఫిడెన్స్ ఫీల్ ఇస్తుంది.
ధర & ఫైనల్ వెర్డిక్ట్
టాటా సియెర్రా ధరలు సుమారు రూ. 11.49 లక్షల నుంచి రూ. 21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. టాటా ఈసారి వాల్యూ కార్డ్ కాకుండా ప్రీమియం SUVగా సియెర్రాను పొజిషన్ చేసింది.
ఈ కారులో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ... డిజైన్, ఫీచర్లు, కంఫర్ట్, డ్రైవింగ్ అనుభవం అన్నింటిలోనూ సియెర్రా గట్టి ప్యాకేజీ. పైగా ఆ పేరు తెచ్చే ఎమోషన్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, టాటా సియెర్రా నిజంగానే ఒక లెజెండ్ రీబోర్న్!.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















