2025లో ఈ కారు కోసం క్యూ కట్టారు - ఇండియన్స్ ఎక్కువగా కొన్న ఫోర్‌వీలర్ ఇదే
2025లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి డిజైర్ నిలిచింది. SUVల ఆధిపత్యం మధ్యలోనూ 2.14 లక్షల అమ్మకాలతో క్రెటా, నెక్సాన్‌లను వెనక్కి నెట్టింది.

India Top Selling Cars 2025: భారత కార్ మార్కెట్ పూర్తిగా SUVల వైపు టర్న్ తీసుకుందని భావిస్తున్న సమయంలో... ఆ అంచనాలకు బ్రేక్ వేస్తూ Maruti Dzire మరోసారి తన సత్తా చూపించింది. క్యాలెండర్ ఇయర్ 2025లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి డిజైర్ నిలిచింది. మొత్తం 2.14 లక్షల యూనిట్లు అమ్ముడై, టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది.
SUVలు దూసుకెళ్తున్న మార్కెట్‌లో, డిజైర్ లాంటి కాంపాక్ట్ సెడాన్ నంబర్ వన్‌గా నిలవడం నిజంగా విశేషమే. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ లాంటి హాట్ ఫేవరెట్ SUVలను డిజైర్ వెనక్కి నెట్టడం కార్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.
వెనుకబడిన క్రెటా, నెక్సాన్
2025లో హ్యుందాయ్ క్రెటా 2.01 లక్షల యూనిట్లు, టాటా నెక్సాన్ కూడా దాదాపు 2.01 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ డిజైర్ మాత్రం ఈ రెండు SUVలకన్నా ముందుండి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. భారతీయులు ఇప్పటికీ డబ్బుకు తగిన విలువ, మైలేజ్, నిర్వహణ ఖర్చు వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెబుతున్న ఉదాహరణ ఇది.
2025లో అమ్ముడైన టాప్ 10 కార్లు
| ర్యాంక్ | మోడల్ పేరు | మొత్తం అమ్మకాలు (లక్షల్లో) |
| 1 | Maruti Dzire | 2.14 |
| 2 | Hyundai Creta | 2.01 |
| 3 | Tata Nexon | 2.01 |
| 4 | Maruti Wagon R | 1.94 |
| 5 | Maruti Ertiga | 1.92 |
| 6 | Maruti Swift | 1.89 |
| 7 | Maruti Fronx | 1.80 |
| 8 | Mahindra Scorpio | 1.77 |
| 9 | Maruti Brezza | 1.75 |
| 10 | Tata Punch | 1.73 |
టాప్ 5 & టాప్ 10లో మారుతి హవా
టాప్-5 ఉన్న డిజైర్, వాగన్ ఆర్, ఎర్టిగా - ఈ మూడూ మారుతి కార్లే కావడం గమనార్హం. మొత్తం టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఆరు మారుతి మోడళ్లు ఉండటం ఈ బ్రాండ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. టాప్ 10లో టాటాకు రెండు మోడళ్లు, హ్యుందాయ్, మహీంద్రాలకు ఒక్కో మోడల్ చొప్పున చోటు దక్కింది.
SUVల దూకుడు ఇదీ
ఈ జాబితా చూస్తే భారతీయులకు SUVల మీద ఎంత మోజు ఉందో అర్థమవుతుంది. టాప్ 10లో ఆరు SUVలు ఉన్నాయి. క్రెటా, నెక్సాన్‌తో పాటు ఫ్రాంక్స్, స్కార్పియో జంట, బ్రెజ్జా, పంచ్ కూడా భారీ అమ్మకాలు నమోదు చేశాయి. 2025లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 55.3 శాతం SUVలే కావడం రికార్డ్ స్థాయి.
హ్యాచ్‌బ్యాక్‌లకు తగ్గిన డిమాండ్
ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ తగ్గుతోంది. టాప్ 10లో వాగన్ ఆర్, స్విఫ్ట్ మాత్రమే ఉండటం దీనికి నిదర్శనం. ఇక ఎర్టిగా ఒక్కటే MPVగా ఈ జాబితాలో నిలిచింది.
మారుతి మళ్లీ టాప్‌లోకి
2024లో టాటా పంచ్ టాప్‌లో నిలిచి మారుతి 40 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ వేసింది. కానీ 2025లో డిజైర్‌తో మారుతి మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. SUVల కాలంలోనూ సెడాన్‌కు ఆదరణ తగ్గలేదని డిజైర్ మరోసారి రుజువు చేసింది.
గత సంవత్సరాల్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు
| సంవత్సరం | మోడల్ పేరు | మొత్తం అమ్మకాలు (లక్షల్లో) |
| 2024 | Tata Punch | 2.02 |
| 2023 | Maruti Swift | 2.03 |
| 2022 | Maruti Wagon R | 2.17 |
| 2021 | Maruti Wagon R | 1.84 |
| 2020 | Maruti Swift | 1.61 |
మొత్తానికి, డబ్బుకు తగిన విలువ ఉంటే... బాడీ టైప్ ముఖ్యం కాదు అన్న సందేశాన్ని మారుతి డిజైర్ 2025లో బలంగా వినిపించింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















