Tata Cars Price Hike: బడ్జెట్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ - నాలుగు కార్ల ధరలు పెంచిన టాటా!
టాటా పంచ్, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్ కార్ల ధరలను కంపెనీ పెంచింది.
Tata Cars Price Hike: కొత్త బీఎస్6 స్టేజ్ II ఆర్డీఈ నిబంధనల ప్రకారం టాటా మోటార్స్ కొంత కాలం క్రితం తన మొత్తం కార్లను అప్‌గ్రేడ్ చేసింది. దీంతోపాటు ఇప్పుడు కంపెనీ తన కార్ల ధరలను కూడా పెంచింది. టాటా తన పరిధిలో ఉన్న కార్లకు ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌ని స్టాండర్డ్‌గా చేర్చింది.
టాటా పంచ్
టాటా పంచ్ గతంలో రూ. 5.99 లక్షల నుండి రూ. 9.54 లక్షల మధ్యలో అందుబాటులో ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. కానీ ఇప్పుడు ధరలు పెరిగిన తర్వాత ఈ కారు ధర రూ. 10,000 వరకు పెరిగింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ ప్యూర్ ధర రూ. 3,000 పెరిగింది. ఇది కాకుండా ఇతర వేరియంట్లలో రూ. 10,000 వరకు పెరిగింది. అలాగే, కంపెనీ ఇప్పుడు ఈ కారు కజిరంగా ఎడిషన్‌ను పూర్తిగా నిలిపివేసింది.
టాటా అల్ట్రోజ్
టాటా మోటార్స్ అల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ. 10,000 వరకు పెంచింది. కాగా డీజిల్ వేరియంట్ ధరలు ఏకంగా రూ. 15,000 మేర పెరిగాయి. ఇక అల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 5,000 నుంచి రూ. 15,000 వరకు పెరిగాయి.
టాటా టియాగో
టాటా టియాగో ధర రూ. 9,000 నుంచి రూ. 15,000 వరకు పెరిగింది. వేరియంట్‌ను బట్టి ధరల పెంపు కూడా మారింది. టాటా ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఫీచర్‌ను టియాగో కొత్త మోడళ్లలో అప్‌డేట్‌గా అందించింది.
టాటా టిగోర్
టాటా తన కాంపాక్ట్ సెడాన్ కారు టిగోర్ ధరలను వివిధ వేరియంట్‌లను బట్టి రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు పెంచింది. కార్ల మార్కెట్లో ఈ పెరుగుదల పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కనిపించనుంది.
టాటా మోటార్స్ త్వరలో ఆల్ట్రోజ్, పంచ్‌ల్లో కొత్తగా సీఎన్‌జీ వేరియంట్‌లను విడుదల చేయవచ్చని కూడా వార్తలు ఉన్నాయి.
ఇటీవలే టాటా మోటార్స్ దాని రెండు టాప్ ఎండ్ ఎస్‌యూవీలు అయిన సఫారీ, హారియర్‌లను ADAS భద్రతా వ్యవస్థ, పెద్ద టచ్‌స్క్రీన్‌తో సహా అనేక కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత సఫారీ, హారియర్‌ల్లో చాలా పెద్ద టచ్‌స్క్రీన్‌ను అందించారు.
ఈ కొత్త మార్పులన్నీ ఈ రెండు కార్ల కొత్త రెడ్ డార్క్ ఎడిషన్‌లో కనిపిస్తాయి. ఇందులో ADASతో కూడిన 360 డిగ్రీ కెమెరా ఫీచర్ మాత్రమే జోడించారు. ఇవన్నీ చాలా ఆధునికమైనవి, ముఖ్యమైనవి. ADAS సిస్టమ్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ అసిస్ట్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది.
ఈ రెండు కార్లలో మీకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందిస్తారు. 360 డిగ్రీ కెమెరా ఫీచర్ పార్కింగ్‌లో సహాయపడుతుంది. అలాగే విజువల్స్‌ను ఉత్తమమైన రీతిలో బయటకు తీసుకొచ్చే టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.
ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ ఉన్నాయి. సఫారీ రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు అందించారు. దాని సన్‌రూఫ్ చుట్టూ యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది. హారియర్, సఫారీల్లో కంఫర్ట్ అనేది ముఖ్యమైన అంశం.